ఎమ్బీయస్‍: సమ్‌థింగ్ ఫ్రెష్

సుమారు 100 సంవత్సరాల క్రితం రాసినా అవి ఇప్పటికీ మార్కెట్లో అమ్ముడు పోతూండడానికి కారణమేమిటో ఆయన రచనలు రుచి చూడాలి.

పి.జి.ఉడ్‌హవుస్ పుస్తకాలు చదవని వారు కూడా ఆయన పేరు వినగానే, ‘ఓహ్, హాస్య రచయిత కదూ‘ అంటారు. ఆయనపై నేను రాసిన వ్యాసం చదివిన వారికి యింకొంత సమాచారం తెలిసి ఉంటుంది. ఉడ్‌హవుస్ హాస్యం ఉదాత్తమైనది. ఆయన idle rich ను వేళాకోళం చేస్తూ 90కు పై చిలుకు నవలలు రాసారు. ఆయన సృష్టించిన పాత్రలు కూడా విలక్షణంగా, అదో రకం తిక్కతో ఉంటాయి. సుమారు 100 సంవత్సరాల క్రితం రాసినా అవి ఇప్పటికీ మార్కెట్లో అమ్ముడు పోతూండడానికి కారణమేమిటో ఆయన రచనలు రుచి చూడాలి. మీకు రుచి చూపించడానికి ‘సమ్ థింగ్ ఫ్రెష్’ అనే 1914 నాటి నవలను పరిచయం చేస్తున్నాను. దాంతో బాటు నవలలో ఉడ్‌హవుస్ బ్రాండ్ తెలిపే కొన్ని ఒరిజినల్ కొటేషన్స్ ఉటంకిస్తాను.

కథ ఎలా సాగుతుందంటే – ఒక బిజినెస్‌మన్‌కి స్కరాబ్ అనే కీటకపు ఆకారంలో ఉండే విలువైన ఈజిప్షియన్ ఉంగరాలు సేకరించే పిచ్చి. వాటి కోసం ఇంట్లోనే ఓ మ్యూజియమ్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. ఓనాడు ఓ మతిమరుపు జమీందారును తన మ్యూజియం చూడడానికి ఆహ్వానిస్తే ఆయన పరధ్యానంగా ఒక స్కరాబ్‌ను జేబులో వేసుకుని వెళ్లిపోయాడు. తర్వాత అది గ్రహించాడితను. కానీ జమీందారుతో పేచీ పెట్టుకోలేడు. ఎందుకంటే ఆ జమీందారు కొడుక్కి, తన కూతురుకి పెళ్ళి నిశ్చయం అయింది.

మరి తన స్కరాబ్ తిరిగి తన చేతికి రావడం ఎలా? అంచేత ఎవరినైనా జమీందారు ఇంట్లోంచి దొంగతనంగా పంపించి, ఆ స్కరాబ్‌ని వెనక్కి తెప్పిద్దా మనుకున్నాడు. ‘ఓ సాహసకృత్యం చేయడానికి సిద్ధపడే యువకుడికి వెయ్యిపౌండ్లు ఇస్తానని పేపర్లో ప్రకటన ఇచ్చాడు. డిటెక్టివ్ కథలు రాసి పొట్టపోసుకునే ఓ నిరుద్యోగి కుర్రవాడు దాన్ని చూశాడు. అతనే హీరో. ఇంటిపక్కనే ఉన్న ఓ అమ్మాయి (ఆమెయే హీరోయిన్) ప్రోత్సాహంతో బిజినెస్‌మన్ వద్దకు వచ్చి, పని తెలుసుకున్నాడు, చేస్తానన్నాడు. తక్కిన వారికి అనుమానం రాకుండా హీరోను తనకు అసిస్టెంట్‌గా నియమించాడా బిజినెస్‌మన్.

ఆయన కూతురు, హీరోయిన్‌కి స్నేహితురాలు. తన స్నేహితురాలి ద్వారా ఆమె తండ్రి దగ్గరుండే విలువైన ఈజిప్షియన్ ఉంగరం పోయిన సంగతి విని, దానిని దొంగిలించే పనిని తానే చేస్తానంది హీరోయిన్. పేరు మార్చుకుని స్నేహితు రాలికి చెలికత్తెగా పనిలో చేరింది. ఈ విధంగా అనుకోకుండా హీరో, హీరోయిన్ ఒకరికొకరు ప్రత్యర్థులుగా తయారయ్యారు. అందరూ కలిసి జమీందారు గారి కోటకు వెళ్లారు.

జమీందారు కొడుకుకి డిటెక్టివ్ కథల పిచ్చి. గతంలో హీరోయిన్‌తో ప్రేమలో పడి, ఆమెకు ప్రేమలేఖలు రాసి వున్నాడు. హీరోయిన్ ఆ వ్యవహారమంతా మర్చిపోయింది. ఉత్తరాలన్నీ చించి పారేసింది కూడా. ఇదేమీ తెలియని జమీందారు కొడుక్కి హీరోయిన్ని చూడగానే ఒకటే కంగారు. ఇప్పుడు బిజినెస్‌మన్ కూతురుతో పెళ్లి కుదిరింది కాబట్టి ఈ హీరోయిన్ వచ్చి గొడవ చేస్తుందేమోనని భయం. అందుకని పక్క ఊరిలో వున్న తన ఫ్రెండు నొకణ్ని సంప్రదించాడు. వాడు మహా టక్కరి. డబ్బున్న కుర్రాళ్లను ఎలా పీడించాలో బాగా తెలిసిన రకం. ఓ 500 పౌండ్లు ఇస్తే ఆ ఉత్తరాలు కాల్చిపారేయడానికి హీరోయిన్‌ను ఒప్పిస్తానని చెప్పి అతని దగ్గర్నుంచి ఆ డబ్బు లాగేడు. పాపం ఆ జమీందార్ కొడుకుకి వాళ్ల నాన్న ఇచ్చే పాకెట్‌మనీ తప్ప వేరేలా డబ్బులొచ్చే మార్గం లేదు. అయినా తప్పదు కనక ఒప్పుకున్నాడు.

ఓ పోలీసు ఆఫీసరు బిజినెస్‌మన్ కూతురంటే పడిచస్తాడు. కానీ అతనితో పెళ్లికి బిజినెస్‌మన్ ఒప్పుకోడు. దాంతో ఆ అమ్మాయి తటపటాయిస్తోంది. తనని పెళ్లిచేసుకోమని ప్రాధేయపడినా ప్రయోజనం లేకపోవడంతో, పోలీసాఫీసరు పెళ్లి కొడుకు (జమీందారు కొడుకు)తోనే పరిచయం పెంచుకుని, అతని ద్వారా ఆ జమీందారు కోటకు ఆహ్వానం సంపాదించుకున్నాడు. ప్రియురాలికి సమీపం లోనే మసలితే ఆమె మనస్సును మార్చవచ్చునన్న ఆశ అతనిది.

హీరో, హీరోయిన్లు స్కరాబ్ గురించి మాట్లాడు కుంటూంటే చాటుగా విన్న టక్కరి ఫ్రెండు కూడా వీళ్లందరితో బాటు ఆ ఊరు చేరాడు, తనకు డబ్బు ఇవ్వడానికి జమీందారు కొడుక్కి సంపాదించే మార్గం చూపుదామని అతని ఐడియా!

ఈ మతిమరుపు జమీందారు ఇంట్లో కూడా ఓ మ్యూజియం వుంది. ఆనాడు తను తీసుకొచ్చేసిన ఆ స్కరాబ్‌ని తన మ్యూజియంలోనే ఓ ట్రేలో పడేసి, ఆ విషయమే మరిచి పోయాడు. హీరో ఆ స్కరాబ్ ఎక్కడుందో కనిపెట్టగలిగాడు కానీ అతని ప్రయత్నాలకు అడ్డం పడగల ఓ వ్యక్తి ఉన్నాడు. అతనే జమీందారు సెక్రటరీ, చాలా సమర్థుడిగా పేరు బడ్డవాడు. బిజినెస్‌మన్, అతనికి అసిస్టెంట్ నంటూ వచ్చిన హీరో – వీళ్ళ ఉద్దేశ్యాలను చూచాయగా పసి గట్టాడు. రెడ్‌హేండెడ్‌గా పట్టుకుందామని కని పెట్టుకు కూచున్నాడు.

ఈ లోగా హీరో, హీరోయిన్ల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ ఒకే పని మీద ఉన్నారని తెలియగానే, హీరో ‘నీ ప్రత్యర్థిగా ఉండడం నా కిష్టంలేదు. మనిద్దరం చేతులు కలిపి స్కరాబ్ కొట్టేద్దాం. బహుమతి చెరిసగం పంచుకుందాం.’ అన్నాడు. ఓ రోజు రాత్రి జమీందారింట్లో మ్యూజియం వద్ద తచ్చాడుతూంటే సెక్రటరీ కంటబడ్డాడు కానీ ఎలాగోలా తప్పించుకుని బయట పడ్డాడు. అది తెలిసిన బిజినెస్‌మన్ హీరో మీద అభిమానం కొద్దీ ‘ఇంత రిస్కు తీసుకుని, స్కరాబ్ తెచ్చి ఇవ్వకపోయినా వెయ్యి పౌండ్లు ఇస్తాలే గానీ సిల్లీ స్కరాబ్ గురించి పట్టించుకోకు’ అనేశాడు.

పోలీసు ఆఫీసరు బిజినెస్‌మన్ కూతురు వెంటే తిరుగుతున్నాడు. ‘నువ్వు డైటింగు పేరు చెప్పి కడుపు మాడ్చుకోవడం బాగా లేదు. రాత్రిపూట కాస్త ఏదైనా తిను.’ అని నచ్చచెప్పాడు. చెప్పడమే కాదు, ఆమెకు రాత్రి పూట ఆకలేసినప్పుడు తినడానికి వీలుగా ఏదైనా ఫలహారం కొనుక్కొచ్చి తన గది బయట వదిలేసి సర్‌ప్రైజు చేద్దామని ప్లాను వేసాడు కూడా.

ఆమెతో పెళ్లి కుదిరిన జమీందారు కొడుకుకి మాత్రం ఈమె గురించి పట్టించుకునే తీరిక లేదు. ఎందుకంటే అతని పాత ప్రేమ పురాణం ఎక్కవుంటే ఇంకా తేలలేదు. హీరోయిన్‌కి డబ్బులిచ్చినా ఉత్తరాలు కాల్చేయలేదనీ, బ్లాక్‌మెయిల్ చేయబోతోందని చెప్పి ఆ టక్కరి ఫ్రెండు ఇంకా అతన్ని అడల గొడుతూనే ఉన్నాడు.

ఈలోగా ఇక్కడ హీరో హీరోయిన్లు ‘నేను దొంగిలిస్తానంటే నేను దొంగిలిస్తాన’ని పోటీపడ్డారు. నువ్వు ఆడదానివి, నన్ను రిస్కు తీసుకోనీ అంటాడు హీరో. ఛ, అలా అంటే నేనూరుకోను అంటుంది హీరోయిన్. చివరికి బొమ్మాబొరుసూ వేసుకుంటే హీరో వంతు వచ్చింది. ఆ రోజు అర్ధరాత్రి హీరో స్కరాబ్ కొట్టేయడానికి మెట్లెక్కసాగాడు. సరిగ్గా అదే సమయంలో ప్రియురాలి కోసం అర్ధరాత్రి ఫలహారం తెస్తున్న పోలీసు ఆఫీసరుని ఢీ కొన్నాడు. చీకట్లో ఇద్దరూ ఖంగారుపడి ఒకళ్లనొకళ్లు దొంగ అనుకుని కుమ్ములాడడం మొదలు పెట్టారు. దాంతో ఫలహారం పళ్లెం కిందపడడం, సెక్రటరీ నిద్రలేచి పరిగెత్తుకు రావడం జరిగింది.

అతను రావడం చూసి, వీళ్లిద్దరూ చెరోవైపూ పారిపోయారు. సెక్రటరీ మెట్లమీద నుండి జారి పడ్డాడు. చేయి చాస్తే చల్లగా ఫలహారం తగిలింది. అది ఏదో తెలియక భయపడి కదలకుండా అలాగే పడుక్కుని ఉండిపోయాడు. చప్పుడుకి నిద్ర లేచిన జమీందారు గన్ తీసుకుని చీకట్లో కాల్చసాగేడు. లైట్లు వేసాక చూసి, ముందు తెల్లబోయాడు. తర్వాత మండిపడ్డాడు. ‘అంతగా ఆకలితో మాడుతూంటే నీ రూముకి తెప్పించుకుని తిను. అంతేగాని అర్ధరాత్రి పూట అందర్నీ లేపి హడల గొట్టకు.’ అని సెక్రటరీని తిట్టి, అతని సమాధానం వినకుండా వెళ్లిపోయాడు.

మర్నాడు దొంగిలించే వంతు హీరోయిన్‌ది. హీరో మళ్లీ వెళతానని ఆఫర్ ఇచ్చినా ఒప్పుకోకుండా బయలు దేరింది. ఆమె అదృష్టం కొద్దీ ముందు రోజు రాత్రి జరిగిన అనుభవం వల్ల, జమీందారు చేత మళ్లీ తిట్టించుకోవడం ఇష్టం లేనందువల్ల సెక్రటరీ తన గదిలోనే ఉండిపోయాడు. పొద్దున్న లేచి చూస్తే స్కరాబ్ మాయం. ఘొల్లుమన్నాడు సెక్రటరీ.

స్కరాబ్ చేజిక్కించు కున్నందుకు హీరోయిన్ వద్దకు వచ్చి కంగ్రాట్యులేట్ చేసాడు హీరో. హీరోయిన్ మండిపడింది – ‘నీ షివల్రీ చూపించు కోవడానికి నువ్వే కొట్టేశావ్, నాకు ఛాన్స్ ఇవ్వకుండా.’ అని. నేను తీయలేదు మొర్రోమన్నాడు హీరో. మరి ఎవరు తీసినట్టు? ఇద్దరూ పజిల్‌లో పడ్డారు. హీరో తీవ్రంగా ఆలోచించాడు. చీకట్లో మెట్ల మీద జారి పడ్డానని చెప్పి జమీందారు కొడుకు ఉదయం నుంచీ మూలుగుతున్నాడు. చీకట్లో తిరగవలసిన పనేముంది అతనికి? స్కరాబ్ కొట్టేయడానికే అయివుంటుంది. అదీగాక ఆ టక్కరి ఫ్రెండు జమీందారు కొడుక్కి రాసిన ఉత్తరం ఓసారి చూడడం తటస్థించింది హీరోకి. వీటన్నిటినీ ఒక్కటొక్కటిగా పేర్చుకుంటూ చూస్తే జమీందారు కొడుక్కే ఆ స్కరాబ్ తీసే అవకాశం ఉందనిపించింది.

ఇంతలో పోలీసు ఆఫీసరుకి వచ్చి డ్యూటీలో జాయినవ్వమని వాళ్ల ఆఫీసు నుండి పిలుపు వచ్చింది, బిజినెస్‌మన్ కూతుర్ని తనతో బాటు వచ్చేయమని ప్రాధేయపడ్డాడు. ఆమె ఆలోచనలో పడింది. ఇటు తనని పెళ్లి చేసుకోవలసిన వాడిని చూడబోతే అస్తమానూ డిటెక్టివ్ కథలు చదవడం తప్ప తనను పట్టించుకున్నది లేదు. అందుకని తనని ప్రేమించే పోలీసాఫీసర్‌తో కలిసి ఇల్లు వదిలి పారిపోయింది.

హీరో జమీందారు కొడుకుని ఎదుర్కున్నాడు. ‘నీ మాజీ ప్రియురాలికి (హీరోయిన్‌కి) వెయ్యి పౌండ్లు చెల్లించాలనుకుని నువ్వే ఆ స్కరాబ్ కొట్టేశావ్’ అంటూ చీకట్లో బాణం వేశాడు. జమీందారు కొడుకు తెల్లబోయాడు, నువ్వెలా పసిగట్టేశావ్? అంటూ దొరికిపోయాడు. ‘నువ్వు అంత ఇష్టంగా చదివే డిటెక్టివ్ కథలు రాసేది నేనే, ఆ మాత్రం ఊహించగలను’ అని చెప్పాడు హీరో.

ఓ అభిమానిగా ఆనందాశ్చర్యాలలో మునిగి పోయాడా జమీందారు కొడుకు. అందువల్లనే తండ్రి వచ్చి పెళ్లికూతురు పారిపోయిందని చెప్పినా పెద్దగా పట్టించుకోలేదు కూడా. తన అభిమాన రచయిత అయిన హీరోకు స్కరాబ్‌ను బహుమతిగా ఇచ్చేశాడు. దాన్ని పట్టుకెళ్లి బిజినెస్‌మన్‌కి అప్పగించాడు హీరో. తన దగ్గరున్న స్కరాబ్‌ను మతిమరుపు పేరుతో జేబులో వేసుకుని పోయి యింత హైరానాకు కారకుడైన జమీందారు, అతని దగ్గర్నుంచి దాన్ని కొట్టేసిన అతని కొడుకు – బిజినెస్‌మన్‌కు చిర్రెత్తించారు. ఈ దొంగల వంశంలో పిల్ల నివ్వడం కంటె పోలీసు వాడికే ఇవ్వడం మంచి దనుకున్నాడు.

ఆ సంతోషంలో హీరోకి అనుకున్న ప్రకారం వెయ్యిపొండ్లే కాక, తన హెల్త్ కౌన్సిలర్‌గా ఉద్యోగం కూడా ఇచ్చాడు. నిరుద్యోగ సమస్య తీరింది కాబట్టి హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకున్నారు. అక్కడ ఆ మతిమరుపు జమీందారు తన కొడుకుని ఓదార్చాడు – ‘పెళ్లి తప్పిపోయిందని బాధపడకు, నీకు పాకెట్ మనీ పెంచుతానులే.’ అని. ఇదీ ఆ నవల కథ! ఇక కొన్ని కోట్స్ –

‘To attract attention in the dining room of the Senior Conservative Club between the hours of one and one-thirty, you have to be a mutton chap, not an earl.’

“Explanations pushed and jostled one another in his fermenting brain, but he could not utter them. On every side he met gravely reproachful eyes. Finally, when he spoke, he stampeded. Words began to proceed from him, tripping and stumbling over each other”

“The rules governing exercise in London are clearly defined. You may run, if you are running after a hat, or an omnibus; you may jump, if you do so with the idea of avoiding a taxi-cab or because you have stepped on a banana – skin. But if you run because you wish to develop your lungs or jump because jumping is good for the liver, London punishes you with its mockery. It rallies round and points the finger of scorn.”

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2024)

7 Replies to “ఎమ్బీయస్‍: సమ్‌థింగ్ ఫ్రెష్”

Comments are closed.