అందమైన భామలు.. కొందరే మెరుపుతీగలు

ఎంతోమంది హీరోయిన్లు ఈ ఏడాది టాలీవుడ్ లో అడుగుపెట్టి క్లిక్ అవ్వలేకపోయారు.

ఏటా పరిశ్రమలోకి ఎంతమంది హీరోలు వస్తారో చెప్పలేం కానీ, హీరోయిన్లు మాత్రం కుప్పలుతెప్పలుగా వస్తూనే ఉంటారు. చిన్న సినిమా తీస్తే చాలు, అందులో కొత్తమ్మాయిని తీసుకుంటారు. వీళ్లతో పాటు, బాలీవుడ్ నుంచి కూడా కొంతమంది ఈ ఏడాది టాలీవుడ్ లో అడుగుపెట్టారు. టాలీవుడ్ లో 2024లో మెరిసిన ముద్దుగుమ్మలెవ్వరో చూద్దాం.

ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సింది దీపిక పదుకోన్ గురించే. ఏళ్లుగా బాలీవుడ్ లో స్టార్ గా కొనసాగుతున్న దీపిక పదుకోన్, కెరీర్ లో తొలిసారి ఓ తెలుగు సినిమాలో నటించింది. అదే కల్కి. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో సినిమా మొత్తం దీపిక పదుకోన్ చుట్టూనే తిరుగుతుంది. పైగా ఆమె తన తొలి తెలుగు సినిమాలోనే గర్భవతిగా నటించింది. ఈ సినిమా దీపిక పదుకోన్ కు తెలుగులో మంచి లాంఛింగ్ ప్రాజెక్టుగా నిలిచింది.

దీపిక తర్వాత మోస్ట్ సక్సెస్ ఫుల్ డెబ్యూ అనిపించుకుంది జాన్వి కపూర్. ఈ అమ్మాయిని తెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఏటా టాలీవుడ్ మేకర్స్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు 2024లో అది సాధ్యమైంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ శ్రీదేవి కూతురు. ప్రస్తుతం ఈమె సౌత్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. కొత్త ఏడాదిలో మరిన్ని సినిమాలు చేయబోతోంది.

హిట్స్ కొట్టకపోయినా ఇండస్ట్రీని ఆకర్షించిన డెబ్యూ హీరోయిన్లు కొంతమంది ఉన్నారు. వీళ్లలో ముందుగా చెప్పుకోవాల్సింది భాగ్యశ్రీ బోర్సె గురించే. హరీశ్ శంకర్ డైరక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది భాగ్యశ్రీ. సినిమా డిజాస్టర్ అయినా, భాగ్యశ్రీ అందాలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. అలా మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినప్పటికీ, తన అందచందాలతో ఇప్పుడిప్పుడే అవకాశాలు దక్కించుకుంటోంది ఈ బ్యూటీ.

ఇలానే అవకాశాల వేటలో పడిన మరో బ్యూటీ మానుషీ ఛిల్లర్. ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది ఈ మాజీ మిస్ వరల్డ్. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మానుషీకి ఆశించిన గుర్తింపు రాలేదు. అయినప్పటికీ ఆమె సౌత్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. కొత్త ఏడాదిలో కూడా ఇక్కడే కొనసాగాలనుకుంటున్నట్టు ఇదివరకే ప్రకటించింది.

కన్నడనాట వచ్చిన పెద్ద హిట్ తో తెలుగులో కూడా పాతుకుపోవాలని చూసింది హీరోయిన్ రుక్మిణి వసంత్. ఆమె నటించిన తొలి తెలుగు సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా ఎప్పుడొచ్చిందో వెళ్లిందో కూడా ప్రేక్షకులకు తెలియదు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినా రుక్మిణి వసంత్ కు ఇంకా క్రేజ్ మిగిలే ఉంది. కొత్త ఏడాదిలోనైనా ఆమె మెరుస్తుందేమో చూడాలి.

ఇలా చెప్పుకుంటూపోతే ఎంతోమంది హీరోయిన్లు ఈ ఏడాది టాలీవుడ్ లో అడుగుపెట్టి క్లిక్ అవ్వలేకపోయారు. ఇప్పటివరకు చెప్పుకున్నవి కొన్ని పేర్లు మాత్రమే. చిన్న సినిమాలతో మరింత మంది టాలీవుడ్ లో అడుగుపెట్టారు, సరైన ఫలితం దక్కించుకోలేకపోయారు.

One Reply to “అందమైన భామలు.. కొందరే మెరుపుతీగలు”

Comments are closed.