జ‌ట్టును కూర్చ‌లేక‌పోతోంది.. బీసీసీఐ ఫెయిల్యూర్ స్టోరీ!

ఎవరో ఒక‌రికి ఛాన్సులు ఇవ్వ‌డం, వారు మెరిస్తే మెర‌వ‌డం లేక‌పోతే.. ఆ సీరిస్ ను అభిమానులు మ‌రిచిపోవాలంతే!

ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నిక క్రీడా బోర్డుల్లో ఒక‌టి! ప్ర‌పంచంలోనే అత్యంత రిచెస్ట్ క్రికెట్ బోర్డు! ప్ర‌తి యేటా వేల కోట్ల రూపాయ‌ల లాభాల‌తో బ‌డ్జెట్ వేస్తూ ఉంటుంది! మ‌రి క్రికెట్ అభివృద్ధికి ఎంత ఖ‌ర్చు పెడుతోందో అంత తేలిక‌గా బ‌య‌ట‌కు పొక్కే వ్య‌వ‌హారం కాదు. అయితే ఐపీఎల్ రూపంలో, టెలివిజ‌న్ ప్ర‌సార హ‌క్కుల రూపంలో.. వేల కోట్ల రూపాయ‌ల‌ను ఇట్టే సంపాదిస్తూ ఉంది! ద‌శాబ్దాలుగా బీసీసీఐ ప్ర‌పంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డు అవ‌తారం ఎత్తింది. క్రికెట్ ప్ర‌సార హ‌క్కుల అమ్మ‌కం మొద‌లై రోజుల నుంచినే బీసీసీఐ రిచెస్ట్. అప్ప‌టి నుంచినే రాజ‌కీయ నేత‌ల చూపు కూడా బీసీసీఐ మీద ప‌డింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ ద‌గ్గ‌రి వారు బీసీసీఐలో ఆధిప‌త్యం చ‌లాయించ‌డం రివాజుగా మారింది.

యూపీఏ అధికారంలో ఉన్న‌ప్పుడు శ‌ర‌ద్ ప‌వార్ చూపంతా బీసీసీఐ మీదే ఉండేది. బీసీసీఐ ప్రెసిడెంట్ గా కూడా మారిపోయాడు ఆ రాజ‌కీయ నేత కొంత‌కాలం పాటు! త‌ను ప‌ద‌విలో లేక‌పోయినా.. త‌న వారిని అక్క‌డ కొన‌సాగించారు. ఇక రాష్ట్రాల స్థాయిలో కూడా రాజ‌కీయ నేత‌లే క్రికెట్ వ్య‌వ‌హారాల‌ను శాసిస్తూ వ‌చ్చారు. ఇవి కంపుగా మారాయి. ఢిల్లీ క్రికెట్ బోర్డ్ వ్యవ‌హారాలు ఒక ద‌శ‌లో పతాక స్థాయిలో నిలిచి దుమారం రేపాయి. అయితే అంతా పెద్ద‌ల క‌నుస‌న్న‌ల్లో కాబ‌ట్టి.. గ‌ప్ చుప్. అయితే బీసీసీఐ వ్య‌వ‌హారాలు తీవ్ర స్థాయిలో భ్ర‌ష్టు ప‌ట్ట‌డంతో ఒక ద‌శ‌లో సుప్రీం కోర్టు వ‌ర‌కూ వెళ్లింది వ్య‌వ‌హారం.

బోర్డు వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌చెబ‌ట్ట‌డానికి కోర్టు చాలానే క‌ష్ట‌ప‌డింది. చాలా నియ‌మాల‌ను పెట్టింది. కొంత‌మంది త‌మ ప‌ర‌ప‌తిని ఉప‌యోగించుకుంటూ బీసీసీఐలో తిష్ట వేస్తున్న వైనాన్ని గ‌మ‌నించి కూలింగ్ పిరియ‌డ్ నియ‌మాన్ని పెట్టింది. బీసీసీఐ ప్రెసిడెంట్ గా మాజీ క్రికెట‌ర్ల ఉంటే మంచిద‌నే నియ‌మాన్నీ అమ‌లు చేసేందుకు ప్ర‌య‌త్నించింది. లోథా క‌మిటీ సంస్క‌ర‌ణ‌లు వ‌చ్చాయి. కొంత‌కాలం పాటు.. అంతా బాగానే సాగింద‌నిపించారు! ప్ర‌తిదానికీ క‌మిటీలు ప‌డ్డాయి. ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు లేకుండా పోయాయి! అయితే అదంతా కొంత‌కాల‌మే!

ఆ త‌ర్వాత లోథా క‌మిటీ సంస్క‌ర‌ణ‌ల‌ను తుంగ‌లో తొక్కారు. ఇప్పుడు ఆ రూల్స్ ఏమీ లేవు! మాజీ క్రికెట‌ర్ల‌తో క‌మిటీలు వంటివేమీ లేవు! అస‌లు ఇప్పుడు ఎవ‌రు నిర్ణ‌యాలు తీసుకుంటారో కూడా ఎవ్వ‌రికీ తెలీదు. త‌ర‌చూ వినిపించే పేరు మాత్రం జైషా అనేది మాత్ర‌మే! ట్రెజ‌ర‌ర్ హోదాలో ఉన్నప్పుడే జైషా బీసీసీఐ ప్రెసిడెంట్ కు మించి నిర్ణ‌యాలు తీసుకున్నారు, ప్ర‌భావితం చేశార‌నే పేరు తెచ్చుకున్నారు. దేశంలో అత్యంత ప‌వ‌ర్ ఫుల్ పొలిటీషియ‌న్ జాబితాలో రెండో స్థానంలో ఉన్న నేత కొడుకాయ‌న‌. రాజు త‌లుచుకుంటే అన్న‌ట్టుగా బీసీసీఐ వ్య‌వ‌హారాలు ఏ హోదాలో ఉన్నా జై షా పేరు మాత్ర‌మే వినిపించింది. లోథా క‌మిటీ సంస్క‌ర‌ణ‌ల ఊసూ లేదు, కోర్టు లు కూడా ఇప్పుడు అలాంటి విష‌యాల గురించి అడ‌గ‌వు!

ఆ రాజ‌కీయాల‌న్నింటి సంగ‌తెలా ఉన్నా.. 11 మంది ఆట‌గాళ్ల‌తో కూడిన జ‌ట్టు ఎంపిక‌లో మాత్రం బీసీసీఐ ఫెయిల్యూర్ స్టోరీ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌త్యేకించి బౌల‌ర్ల విష‌యంలో ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా ఉందంటే అంత ద‌య‌నీయంగా ఉంది. బుమ్రాను మిన‌హాయిస్తే.. ఇప్పుడు టీమిండియా ఫైన‌ల్ లెవ‌ల్ లో ఒక్క న‌మ్ముకోద‌గ్గ బౌల‌ర్ లేకుండా పోయాడు! గాయంతో ష‌మీ ఏడాది నుంచి దూర‌దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఒక్క‌డంటే ఒక్క న‌మ్ముకోద‌గ్గ బౌల‌ర్ లేడు! పేస్ బౌల‌ర్, స్పిన్న‌ర్.. ఇలా అన్ని కేట‌గిరిల ప‌రిస్థితీ ఇంతే! టీ20ల మెరుపుల సంగ‌తిని ప‌క్క‌న పెడితే.. ఆస్ట్రేలియాలో టెస్ట్ క్రికెట్ లో ఓపెన‌ర్ ను అయినా టెయిలెండ‌ర్ ను అయినా బుమ్రానే పెవిలియ‌న్ కు పంపాలి! లేక‌పోతే అంతే సంగ‌తులు!

కేవ‌లం బౌల‌ర్లే కాదు, బ్యాటింగ్ ఘోరాలు అన్నీ ఇన్నీ కావు. రోహిత్, విరాట్ ల‌ను జ‌ట్టులో ఉంచుకోవాలో, సాగ‌నంపాలో కూడా అంతుబ‌ట్ట‌ని స్థితిలో ఉంది బీసీసీఐ. ఇది ఇప్ప‌టి నుంచి కాదు.. చాన్నాళ్ల నుంచినే! రోహిత్, విరాట్ ల‌ను కొంత‌కాలం పక్క‌న పెట్టారు ఏదో చెప్పి. ఆ త‌ర్వాత మ‌ళ్లీ వాళ్లే దిక్క‌య్యారు. ఇప్పుడు మ‌ళ్లీ భారం అయ్యారు. ఐదో టెస్ట్ స‌మ‌యానికి రోహితే త‌ప్పుకున్నాడ‌ట‌! మ‌రి వారిని ప‌క్క‌న పెట్టినా.. మ‌ళ్లీ కొత్త వాళ్ల‌కు ఛాన్సులు ఇచ్చి పెంచుకోవాల్సిందే కానీ, ట‌క్కున ప్ర‌త్యామ్నాయాలు లేవు! అంటే.. బీసీసీఐ వ‌ద్ద జ‌ట్టు విష‌యంలో దీర్ఘ‌కాలిక వ్యూహాలు ఏమీ లేవు!

ఎవరో ఒక‌రికి ఛాన్సులు ఇవ్వ‌డం, వారు మెరిస్తే మెర‌వ‌డం లేక‌పోతే.. ఆ సీరిస్ ను అభిమానులు మ‌రిచిపోవాలంతే! మ‌ళ్లీ గెలిచిన‌ప్పుడు తొడ‌లు కొట్టుకోవాలి! స్వ‌దేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సీరిస్ లో క్లీన్ స్వీప్ అయిన‌ప్పుడే.. బీసీసీఐ పేల‌వ‌తీరు అభిమానుల‌కు స్ప‌ష్ట‌మై ఉండాలి. మామూలుగా అయితే బీసీసీఐ ఫెయిల్యూర్ స్టోరీ పూర్తిగా ఎండ‌గ‌ట్ట‌బ‌డేది. అయితే రాజ‌కీయం పూర్తిగా పెన‌వేసుకుపోయిన నేప‌థ్యంలో.. ఎవ్వ‌రూ కిక్కురుమ‌న‌లేరంతే!

3 Replies to “జ‌ట్టును కూర్చ‌లేక‌పోతోంది.. బీసీసీఐ ఫెయిల్యూర్ స్టోరీ!”

Comments are closed.