రాజమండ్రిలో జనసేన-తెలుగుదేశం చారిత్రాత్మిక సమావేశం అంటూ ప్రారంభించి సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. కానీ ఒకటే అనుమానం ఏ విధంగా ఈ సమావేశం చారిత్రాత్మికం.. ఏ విధంగా ఈ ప్రసంగం చారిత్రాత్మికం.? అన్నదే.
జనసేన- తెలుగుదేశం పార్టీలు కలిసి సమావేశం కావడం కొత్త కాదు. 2014 లోనే రెండూ కలిసాయి. కలిసి పోటీ చేసాయి. కలిసి సమావేశాలు జరుపుకున్నాయి. అనేక సార్లు చంద్రబాబు- పవన్ కలిసారు. ఇవ్వాళ కొత్తగా కలిసింది లేదు. మరి ఏ విధంగా ఈ సమావేశం చారిత్రాత్మికం అవుతుంది. అంటే ఈసారి పవన్ తో పాటు మరో అయిదుగురు జనసేన నాయకులు కూడా సమావేశంలో వున్నారు. చంద్రబాబు సమావేశంలో లేరు. ఈ విధంగా మాత్రమే చారిత్రాత్మికం తప్ప మరోటి కాదు.
సరే, పవన్ ఏమైనా చారిత్రాత్మిక ఉపన్యాసం చేసారా అంటే అదీ లేదు. మళ్లీ అదే ఊకదంపుడు. వైకాపా వైరస్. దానికి విరుగుడు జనసేన – తేదేపా అన్న పాత పాటే. వైకాపా పాలన దారుణం అనడం, మళ్ల పాత మాటలే వల్లె వేయడం తప్ప కొత్త మాట లేదు.
పవన్ కన్నా లోకేష్ మాటలు గొప్పగా ఏమన్నా ఉన్నాయా అంటే అదీ లేదు. చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అనే పాత పాటే. కొత్త పాయింట్ ఏమన్నా వుందీ అంటే ఇప్పటి వరకు విడివిడిగా చేస్తున్న కార్యక్రమాలకు బదులు కలిసి కార్యక్రమం చేయడం. తెలుగుదేం పార్టీ జనాలు బలంగా కార్యక్రమాలు చేయలేకపోతున్నారు. ఇప్పుడు జనసేన కలిస్తే కార్యక్రమాలు చేయచ్చు అనే ఆలోచనతోనే ఈ ‘ఉమ్మడి’ కి శ్రీకారం చుట్టారు అనుకొవాలి.
అంతకు మించిన చారిత్రాత్మికం ఏమీ ఈ సమావేశంలో లేదు. మూడు తీర్మానాలు చేసారు. కలిసి పోరాడాలనుకుంటున్నారు. భాజపా ఏం చేస్తుంది అన్నది క్లారిటీ లేదు. పవన్ ను ఆ ప్రశ్న అడిగినా ఎప్పటిలాగే ఏదో చెప్పారు తప్ప క్లారిటీ ఇవ్వలేదు.
టోటల్ గా సమావేశం లక్ష్యం ఒక్కటే కనిపిస్తోంది…అధికారం. 2024లో అధికారం చేపట్టడం. 2014లో కలిసి పని చేసి అధికారం సాధించారు. విడిపోయి పోగొట్టుకున్నారు. మళ్లీ కలిసి దాన్ని సంపాదించడం.
కానీ ఎందుకు విడిపోవాల్సి వచ్చిందన్నది ఇరు వైపుల నుంచి క్లారిటీ రాని విషయం. లోకేష్ అవినీతి గురించి తెగ మాట్లాడిన పవన్ ఇప్పుడు దాని గురించి చెప్పరు. తెలుగుదేశం పార్టీ తరపున పవన్ టార్గెట్ చేసిన సంగతిని లోకేష్ కన్వీనియెంట్ గా మరిచిపోతారు. అదే అసలు సిసలు చారిత్రాత్మకం.