బ్రాహ్మణ వ్యతిరేకత పెంచుకుంటున్నారా?

జ‌గన్ అధికారంలోకి రాకముందు…డాలర్ శేషాద్రి, ఐవిఆర్ కృష్ణారావు, ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఇలా చాలా మంది నోటెడ్ బ్రాహ్మణులు అంతా జ‌గన్ కు మద్దతుగా నిలిచారు. జ‌గన్ అధికారంలోకి వచ్చాక ఏమైందో తెలియదు. మెలమెల్లగా బ్రాహ్మణులు…

జ‌గన్ అధికారంలోకి రాకముందు…డాలర్ శేషాద్రి, ఐవిఆర్ కృష్ణారావు, ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఇలా చాలా మంది నోటెడ్ బ్రాహ్మణులు అంతా జ‌గన్ కు మద్దతుగా నిలిచారు. జ‌గన్ అధికారంలోకి వచ్చాక ఏమైందో తెలియదు. మెలమెల్లగా బ్రాహ్మణులు దూరం అవుతూ వస్తున్నారు. ఐవిఆర్ కృష్ణారావు నిత్యం సోషల్ మీడియాలో జ‌గన్ ను విమర్శిస్తూనే వుంటారు. ఉండవల్లి అరుణ్ కుమార్ సంగతి తెలిసిందే. ఎల్వీ సబ్రహ్మణ్యాన్ని జ‌గన్ నే సాగనంపారు.

తొలి విడత మంత్రి వర్గంలో అన్ని సామాజిక వర్గాలకు ఎంచి ఎంచి అవకాశం ఇచ్చారు కానీ బ్రాహ్మణులకు ఇవ్వలేదు. ఏవో చిన్న చితక పదవులు ఇచ్చి కూర్చో పెట్టారు. ఇప్పుడు రెండో విడత మంత్రి వర్గ విస్తరణలో కూడా అదే పరిస్థితి. చూస్తుంటే బ్రాహ్మణ ఓటింగ్ మీద జ‌గన్ కు పెద్దగా నమ్మకం వున్నట్లు కనిపించడం లేదు. 

బ్రాహ్మణ యువత ఎక్కువగా హిందూత్వ, భాజ‌పా అనుకూల భావజాలంతో వుంటుంది. ఓసి కేటగిరీలో బ్రాహ్మణ పేదలకు కూడా ఏ పథకాలు అందవు. అందువల్ల వారు జ‌గన్ పట్ల లాయల్ గా వుంటారన్న నమ్మకమూ లేదు.తమకు ఆ ఓటింగ్ ఎలాగూ రాదని జ‌గన్ ఫిక్స్ అయిపోయి వుంటారు. అందుకే మొహమాటం లేకుండా ఆ వర్గాన్ని పక్కన పెట్టారు.

మిగిలిన ఆ కులాలు కూడా

జ‌గన్ ఎంత అద్భుతంగా పాలించినా, పాలించకపోయినా కమ్మవారి ఓట్లు వైకాపాకు పడతాయని అస్సలు అనుకోవడానికి లేదు. గత ఎన్నికల్లో ఏమో కానీ ఈ సారి కమ్మ ఓటింగ్ శాతం మొత్తం గంప గుత్తగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే వుంటుంది అన్నది వాస్తవం. అందుకే ఆ కులానికి కూడా మంత్రి వర్గ విస్తరణలో మొండి చెయ్య చూపించారు.

రఘురామ కృష్ణ రాజు వ్యవహారంతోనూ, ఉత్తరాంధ్ర అశోక్ గజ‌పతి ఉదంతంతోనూ, భాజ‌పా, హిందూత్వ వ్యవహారంతోనూ క్షత్రియ వర్గం కూడ జ‌గ‌న్ కు దూరం అవుతోంది. ఎలాగూ దూరంగా వుండేదానికి మంత్రి పదవి కూడా దండగ అనుకున్నారేమో?

కాపులు ఎలాగూ ఈసారి మెజారిటీ వరకు జ‌నసేన వెంట నడిచే అవకాశం కనిపిస్తోంది. బిసిలను దగ్గరకు చేర్చుకోవాలంటే కాపులను తగ్గించాలి. గత ఎన్నికల దగ్గర నుంచి జ‌గన్ ఇదే స్ట్రాటజీతో వెళ్తున్నారు. ఇప్పుడు కూడా అదే చేసారు.

కాపులకు ఎస్సీ వర్గాలకు, మరి కొన్ని సామాజిక వర్గాలకు దక్షిణ, ఉత్తర కోస్తాల్లో అస్సలు పడదు. ఇక బిసి కాపుల మధ్య అంతరం సంగతి తెలిసిందే. అందుకే వీళ్లకు ప్రయారిటీ ఇవ్వడం, వాళ్లకు తగ్గించడం వంటి స్ట్రాటజీలు అమలు చేస్తున్నారు.

జ‌గన్ తీరు వేరు

ఎక్కడైనా ఏ రాజ‌కీయ నాయకుల ఆలోచనా సరళి అయినా ఒకే విధంగా వుంటుంది. దూరం అవుతున్నవారిని ఎలాగైనా దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నిస్తారు. వారిని బుజ్జ‌గించాలని ప్రయత్నిస్తారు. కానీ జ‌గన్ వ్యవహారం వేరు. దూరం అవుతారు, లేదా అవుతున్నారు అనుకుంటే ఇంక దూరం పెట్టడంటమే తప్ప దగ్గరకు తీయడం అనే వ్యవహారం వుండదు.

అది ఆయనకు మంచి చేస్తుందా, పార్టీకి కీడు చేస్తుందా? అన్నది ఏదీ పట్టదు. వదిలేస్తే వదిలేయడమే. ఇలాంటి తీరు జ‌గన్, పార్టీకి మంచి చేస్తుందా చేయదా అన్నది 2024 నాటికి తెలిసిపోతుంది.