పాఠశాలలో మరుగుదొడ్లు.. ఈ విషయం చాలా చిన్నదే కావొచ్చు. కానీ చాలామంది టీనేజ్ ఆడపిల్లలు పల్లెటూళ్లలో స్కూల్ మానేయడానికి ఇదే ప్రధాన కారణం. తాటాకులు, కొబ్బరి మట్టలతో కట్టిన తడికెలే అడ్డుగా ఇన్నాళ్లూ ఉండేవి.
కానీ నాడు-నేడు పనులతో రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు ఏర్పాటయ్యాయి. బాత్రూమ్ లు కట్టించినంత మాత్రాన సరిపోదు.. నిత్యం వందలాది పిల్లలు వాటిని ఉపయోగించే క్రమంలో వాటి నిర్వహణ కూడా అంతే సమర్థంగా ఉండాలి.
కానీ స్కూళ్లకు ఇచ్చే ఫండ్స్ తో బాత్రూమ్ ల నిర్వహణ దాదాపుగా అసాధ్యం. అందుకే అమ్మఒడి నుంచి వెయ్యి రూపాయలు మినహాయించుకుని మరీ మరుగుదొడ్ల నిర్వహణ నిధి ఏర్పాటు చేశారు.
500 మంది పిల్లలు ఉండే స్కూల్ లో తలా వెయ్యి రూపాయలు అంటే.. ఏడాదికి మరుగుదొడ్ల నిర్వహణ కోసం 5లక్షల రూపాయలు జమకావాలి. పోనీ పిల్లలందరికీ అమ్మఒడి అందదు అనుకుంటే.. సగానికి సగం లెక్కేసుకున్నా రెండున్నర లక్షల రూపాయలు జమ అవుతాయి.
పల్లెటూళ్లలో పారిశుధ్య సిబ్బందికి ఇచ్చే జీతం, ఇతర మెటీరియల్.. వీటన్నిటికీ ఈ నిధులు సరిపోతాయి. అయితే ఈ నిర్వహణ విషయంలోనే లోటుపాట్లు ప్రభుత్వ వైఫల్యాన్ని వెక్కిరిస్తాయి.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి నిధి సమకూరితే.. వారి అనుయాయులకు అప్పగించి స్వాహా చేయడం ఆనవాయితీ. దానికి భిన్నంగా జరిగితేనే వైసీపీ ప్రభుత్వం మార్పు చూపించినట్టు అవుతుంది.
నాడు-నేడు పనులతో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారిపోయాయి. దీనితోపాటు మరుగుదొడ్ల నిర్వహణ కూడా సమర్థంగా ఉంటేనే ప్రభుత్వానికి మంచి పేరు. దీనిపై ఇప్పటికే విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం జగన్.
నిర్వహణ నిధి విషయంలో రాష్ట్ర, జిల్లా, పాఠశాల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిటీలు సక్రమంగా పనిచేసి, టాయిలెట్స్ నిర్వహణ సరిగా ఉంటే.. దేశానికే ఏపీ ఆదర్శంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎస్ఎంఎస్ విప్లవం..
ఇప్పటివరకు ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలలోనే.. పిల్లలు గైర్హాజరు అయితే తల్లిదండ్రుల ఫోన్లకు సమాచారం వెళ్లే విధానం అమలులో ఉంది. ప్రభుత్వ హయాంలోని పాఠశాలల్లో కూడా ఈ విధానం అమలులోకి వస్తే జవాబుదారీ విధానం మరింత పెరుగుతుంది.
దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన అధికారులు మొబైల్ యాప్ రూపొందించారు. పిల్లల హాజరుకి బాధ్యులుగా వాలంటరీలు, సచివాలయ సిబ్బందిని బాధ్యులుగా చేయడం కూడా మరో ముందడుగేనని చెప్పాలి.
నాడు-నేడు, అమ్మఒడి, ఇంగ్లిష్ మీడియం, గోరుముద్ద, విద్యా దీవెన, విద్యాకానుక, కంటి వెలుగు.. ఇలా ఏపీ విద్యా వ్యవస్థలో.. జగన్ కి ముందు.. జగన్ తర్వాత అనే విధంగా పెను మార్పులు జరుగుతున్నాయి.