బోయన్‌పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలైన మాజీ మంత్రి అఖిలప్రియ జైలు పాలై ఊచలు లెక్క పెడుతున్నారు. అయితే ఓ విషయంలో ఆమెను రాయలసీమ ప్రజానీకం తప్పక అభినందించాలి. కిడ్నాప్ ఉదంతం ఓ చెడ్డ పని అనుకుంటే, అందులోనూ అఖిలప్రియ ఓ మంచి పని చేశారని చెప్పక తప్పదు.
బోయన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఇంత వరకూ తెలంగాణ పోలీసులు 19 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా ప్రధాన నిందితులైన అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, అతని స్నేహితుడు శ్రీను, జగత్‌విఖ్యాత్‌రెడ్డి, మరో ఇద్దరు ముగ్గురు దొరకాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ నిన్న ఓ 15 మందిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా నిందితుల వివరాలను వెల్లడించారు.
వీరంతా కూడా కృష్ణా జిల్లా వాసులే కావడం గమనార్హం. నిన్న అరెస్ట్ అయిన సిద్ధార్థ విజయవాడలో బౌన్సర్లను సరఫరా చేసే ఏజెన్సీ నిర్వాహకుడిగా నగర పోలీస్ కమిషనర్ ప్రకటించారు. సిద్ధార్థ ఏజెన్సీ తరపున కిడ్నాప్‌నకు పంపిన యువకులంతా కృష్ణా జిల్లా వాళ్లే కావడం విశేషం. ఎక్కడే నేరం జరిగినా, వెంటనే సీమ వైపు వేలెత్తి చూపడం కొందరికి ప్యాషన్ అయిన విషయం తెలిసిందే.
కానీ రాయలసీమకు చెందిన అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్ మాత్రం తమ నేరానికి కోస్తా ప్రాంతం, అది కూడా చంద్రబాబు అత్తగారి జిల్లాను ఎంచుకోవడం గమనార్హం. ప్రాంతాలను బట్టి నేరాలుండవని, మనుషుల మనస్తత్వాలను బట్టి మాత్రమే ఉంటాయనేందుకు తాజా ఘటనే నిదర్శనం.
గత కొన్నేళ్లుగా ఓ పథకం ప్రకారం రాయలసీమపై సాంస్కృతిక దాడి జరుగుతోందని ఆ ప్రాంత ప్రజానీకం వాపోతోంది. దీని వెనుక బలమైన రాజకీయ కారణాలున్నాయనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో కిడ్నాప్ ఘటనలో కోస్తా ప్రాంతాన్ని అఖిలప్రియ దంపతులు ఎంచుకుని, కనీసం ఈ రకంగానైనా తన ప్రాంతంపై మచ్చ పడకుండా చేశారని చెప్పొచ్చు.