అడలేని నాట్యగత్తె మద్దెల ఓడు అన్నదనేది చాలా చాలా పాపులర్ సామెత! ఈ సామెత ప్రస్తుత పరిస్థితి కోసమే పుట్టినట్టుగా కనిపిస్తోంది. భారత క్రికెట్ జట్టు వీరులు- ఆడలేక ఓడిపోయి.. ఇప్పుడు రకరకాల సాకులు వెతుక్కుంటున్నారు. నిర్వహణలో లోపాలను గమనిస్తే.. గెలిచి- ఆ తర్వాత.. వాటి గురించి ప్రస్తావిస్తే చాలా గొప్పగా ఉంటుంది.
అలా కాకుండా.. అన్ని విభాగాల్లోనూ దారుణంగా విఫలం అయిపోయి.. టెస్టు క్రికెట్ ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లో దారుణ పరాభవానికి గురైన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. ఒకవైపు ఓటమిని అంగీకరిస్తూనే.. అందుకు రకరకాల వక్ర కారణాలను చెబుతున్నారు.
ఇంతకూ ఆయన చెబుతున్న హాస్యాస్పదమైన కారణాలు ఏమిటో తెలుసా?
ప్రపంచ టెస్టు క్రికెట్ చాంపియన్ షిపో మ్యాచ్ ను జూన్ లోనే ఎందుకు నిర్వహిస్తారు? మార్చిలోనే నిర్వహించవచ్చు కదా.. అని అంటున్నారు. జూన్ లో, అనగా ఐపీఎల్ మ్యాచ్ ల తరువాత, టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ పెట్టడం వలన తమ ఆటగాళ్లు లయ తప్పుతున్నారనే భావనను ఆయన ధ్వనింపజేశారు. ఇదొక్కటే కాకుండా ఇంగ్లాండులోనే ఈ ఫైనల్ ఎందుకు జరగాలి. ప్రపంచంలో ఎక్కడైనా జరగవచ్చు కదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం భారత్ ఓడిపోయిన ఫైనల్ ఇంగ్లాండులోని ఓవల్ మైదానంలో జరిగిన సంగతి తెలిసిందే.
రోహిత్ శర్మ వద్ద ఇంకొన్ని సాకులు కూడా ఉన్నాయి. టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ ను ఒకటే మ్యాచ్ గా కాకుండా, బెస్ట్ ఆఫ్ త్రీ గా నిర్వహించాలట. రోహిత్ చెబుతున్న ఈ మాటలను ఎవరైనా వింటే.. పైన చెప్పుకునే సామెతనే గుర్తు చేసుకుంటారు.
ఆ మాటకొస్తే.. ఐపీఎల్ ఆడితీరాలని ఏముంది. ప్రపంచంలో చాలా దేశాలకు చెందిన సుప్రసిద్ధ క్రికెటర్లు ఐపీఎల్ టోర్నీల్లో ఆడడం లేదు. డబ్బు సంపాదనే ప్రధానంగా అనుకున్నప్పుడు ఐపీఎల్ మాత్రమే ఆడుకోవాలి. లేదా టెస్టు చాంపియన్ షిప్ ప్రధానం అనుకుంటే.. టెస్టు జట్టులోని ఆటగాళ్లు ఐపీఎల్ టోర్నీ ఆడకూడదనే నిబంధన అయినా పెట్టాలి.
ఇటీవలి ఐపీఎల్ టోర్నీలో సంచలనాలు నమోదు చేసిన బ్యాటర్ శుభ్ మన్ గిల్ సహా.. మొత్తం భారత జట్టులోని ఏ ఒక్క ఆటగాడు కూడా.. కనీసమాత్రమైన ప్రభావాన్ని మ్యాచ్ పై చూపించలేకపోయారన్న మాట నిజం. భారత వైఫల్యం ఇంత బహిరంగంగా కనిపిస్తున్నప్పుడు.. దానిని సమర్థించుకునే ప్రయత్నం చేయడం నవ్వులపాలు చేస్తుందని రోహిత్ శర్మ గమనించాలి. ఓడిపోయిన తర్వాత నిబంధనల్లో లోపాల గురించి మాట్లాడకూడదని కూడా గ్రహించాలి.