ఆఫీసులకు వెళ్లే వారు, కరోనా సోకకుండా జాగ్రత్త వహించాలనే ఉద్దేశం ఉన్న వారు.. ఇప్పటికీ మాస్కులు వాడుతున్నారు. మిగతా వాళ్లు లైట్ తీసుకుంటున్నారు. మాస్క్ ను ఏదో నామమాత్రంగా తగిలించుకునే వారు ఇంకొందరు.
దేశంలో ఏ షాపు దగ్గరకు వెళ్లినా, ఏ ఆఫీసు, హోటల్ వద్దకు వెళ్లినా.. మాస్కు లేనిదే ప్రవేశం లేదు అనే బోర్డులు అయితే కనిపిస్తున్నాయి. అయితే యథారీతిన అవి బోర్డులు మాత్రమే. ఆచరణలో అంత సీన్ లేదు.
ఇండియాలో రూల్స్ కఠినం, ఆ రూల్స్ ను ఆచరించడం అథమం అనే పాయింట్ కొత్తది కాదు. మాస్కు విషయంలో కూడా అంతే. ఇక మాస్కును నియమానుసారం వాడే వారు కూడా వాటి మేనేజ్ మెంట్ ఏ మేరకు చేస్తున్నారు? అనేది మరో చర్చ!
కొందరు వైద్యులు చెప్పేదాని ప్రకారం అయితే.. సర్జికల్ మాస్కుల వల్ల కరోనా ఆగదగనేది! సర్జికల్ మాస్కులు అనేవి కేవలం సర్జరీలు చేసేటప్పుడు వైద్యుల నోటి నుంచి తుంపరలు, వైరస్ లు రోగికి డైరెక్టుగా సోకకుండా ఆపేవి మాత్రమే. వీటిని ధరించే వైద్యులు కూడా వైరస్ ల బారిన పడవచ్చు. ఇక ఈ మాస్కులు ఇరవై నాలుగు గంటలకు మించి వాడరాదు. వాడితే లేని సమస్యలు వస్తాయనే మాటా మొదటి నుంచి వినిపిస్తోంది.
కానీ సర్జికల్ మాస్కులను రోజుల తరబడి వాడే ఘనులూ కోకొల్లలు. అలాగే ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులను కూడా మురికి పట్టి, మాసిపోయే వరకూ వరకూడా వాడటం కూడా భారతీయులకు అలవాటైపోయింది! వీటి వల్ల కరోనా సోకకపోవడం ఏమో కానీ, వేరే సమస్యలు కలుగుతాయని వైద్య శాస్త్రం చెప్పవచ్చు.
ఏదేమైనా.. మాస్కులను నిత్యం వాడే వారు కూడా వాటిని సరైన పద్ధతిలో వాడుతున్నారా? అనేది ఇప్పటికీ అంతుబట్టని శాస్త్రమే! ఊరట ఏమిటంటే.. మాస్కు రహిత రోజులు మరెంతో దూరం లేవని పరిశోధకులు చెబుతుండటం. కరోనా మూడో వేవ్ ఇండియాలో ఎంత వేగంగా ఎగసిందో, అంతే వేగంగా దిగింది. యూరప్ లో మాస్కులను తప్పనిసరి అనే నియమాన్ని కొన్ని దేశాల్లో తొలగించారు. అమెరికన్లు ఈ అంశంపై స్పందిస్తూ.. మాస్కు రహిత రోజులు త్వరలోనే అంటున్నారు. అంత వరకూ జాగ్రత్త అని చెబుతున్నారు.
కరోనా కొత్త వేరియెంట్లు రావా, వస్తాయా, అవి మరింత ప్రమాదకరంగా ఉంటాయా, తేలికవుతాయా.. అనే అంశాల గురించి డబ్ల్యూహెచ్వో హెచ్చరికలే జారీ చేస్తోంది. అయిపోలేదని అంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్నాళ్లు నోరు మూసుకుంటే మంచిదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి 2020 మార్చికి ముందు నాటి మాస్కు రహిత రోజులు ఇండియాలో త్వరలోనే వస్తాయని ఆశిద్దాం.