అయ్యయ్యో వద్దమ్మా.. ఆ ఛానెళ్లకు వెళ్లొద్దమ్మా..?

మీడియా అంటే చంద్రబాబుకి ఎంతిష్టమో చెప్పలేం. అవును, ఆ మీడియా దయ వల్లే ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కోవడం, ఆ తర్వాత స్మూత్ గా సీఎం పీఠం ఎక్కడం.. అన్నీ చకచకా జరిగిపోయాయి. కేవలం…

మీడియా అంటే చంద్రబాబుకి ఎంతిష్టమో చెప్పలేం. అవును, ఆ మీడియా దయ వల్లే ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కోవడం, ఆ తర్వాత స్మూత్ గా సీఎం పీఠం ఎక్కడం.. అన్నీ చకచకా జరిగిపోయాయి. కేవలం మీడియా వల్లే బాబు ప్రతిపక్షంలో ఉన్నా.. ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ ప్రచారం పొందుతుంటారు.

చివరకు 23 సీట్లతో పాతాళంలోకి పడిపోయినా కూడా చంద్రబాబు లైమ్ లైట్ లో ఉండగలిగారంటే అది బాబు అను'కుల'మీడియా ప్రభావమే. కానీ మీడియాలో ప్రశ్నించే గొంతులు పెరిగిపోవడంతో బాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.

ప్రత్యేక హోదా వద్దన్న బాబు, ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టుకున్న బాబు, తిరిగి హోదా కావాలని అడిగి మీడియా ముందు అభాసుపాలయ్యారు. ఎన్నిసార్లు అడ్డదిడ్డంగా నాలుక మడత పెట్టారో వ్యతిరేక మీడియా అన్నిసార్లూ బాబుని బఫూన్ చేసింది. దీంతో ఓ వర్గం మీడియా అంటే బాబుకి భయం పెరిగిపోయింది.

క్రమంగా వారిని దూరం పెట్టడం అలవాటు చేసుకున్నారు. ఇది ఎంతవరకు వచ్చిందంటే.. ఫలానా ఛానెళ్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాం. మీరెవరూ వారికి ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు, వారిని మీ ప్రెస్ మీట్లకు పిలవొద్దు అనే స్థాయికి వెళ్లిపోయారు

సాక్షి, ఐ డ్రీమ్, టీవీ-9, ప్రైమ్-9 ఛానెళ్లను బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నట్టు.. రాష్ట్ర టీడీపీ కార్యాలయం నుంచి ఏపీలోని నేతలందరికీ ఓ వర్తమానం అందింది. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులెవరూ సదరు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దనేది ఆ సందేశం సారాంశం. ఆ ఛానెళ్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టామని కూడా బహిరంగంగానే ప్రకటించారు టీడీపీ అధినేత.

జగన్ దారిలోనే చంద్రబాబు

నిజానికి ఈ విషయంలో చంద్రబాబు కంటే ముందే మేల్కొన్నారు జగన్. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు మీడియా చేసిన అకృత్యాల్ని ప్రజలు కళ్లారా చూశారు. రాజకీయ విమర్శలతో పాటు జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఎల్లో మీడియా ఇచ్చిన కథనాలు చాలామందికి గుర్తుండే ఉంటాయి. అందుకే అప్పట్లోనే ఎల్లో మీడియాను బ్యాన్ చేశారు జగన్. 

ఇప్పుడు ఆ నొప్పి ఏంటో చంద్రబాబుకు బాగా తెలిసొస్తోంది. గతంలో జగన్ ను తన మీడియా ఎంత బాధపెట్టి ఉంటుందో, చంద్రబాబుకు ఇప్పుడు స్వానుభవంలోకి వస్తోంది. ఈ సంగతి పక్కనపెడితే.. టీడీపీ నేతలు ఆయా ఛానెళ్ల కార్యక్రమాలకు వెళ్లకపోతే అది వాళ్లకే నష్టం. తమకి అనుకూలంగా వార్తలిచ్చే వారిని మాత్రమే ప్రోత్సహించి, అలాంటి వారినే గుడ్డిగా అనుసరిస్తే ఏమవుతుందో 2019 ఎన్నికల్లో తెలుసుకున్నారు చంద్రబాబు. 

పార్టీలో లోటుపాట్లను ఎత్తి చూపే వైరి వర్గం లేకపోతే చంద్రబాబు మరోసారి పాతాళం అంచుకు వెళ్లాల్సిందే. ఆయా ఛానెళ్లపై నిషేధం విధించామని బాబు ఇప్పుడు చంకలు గుద్దుకోవచ్చు కానీ అది తమ భవిష్యత్తుకే అవరోధమనే విషయాన్ని త్వరలోనే తెలుసుకుంటారు.