టీవీ9కు టీఆర్పీలు తీసుకొచ్చిన అతి తక్కువ కార్యక్రమాల్లో జర్నలిస్ట్ మురళీకృష్ణ కార్యక్రమం కూడా ఒకటి. “ఎన్ కౌంటర్ విద్ మురళీకృష్ణ” అంటూ ఈయన జరిపిన చర్చా కార్యక్రమాలు చాలానే పాపులర్ అయ్యాయి. అంతెందుకు.. ఏపీలో టికెట్ రేట్లు తగ్గించినప్పుడు, తాజాగా థియేటర్లు మూతపడుతున్నప్పుడు.. లెజెండ్ దాసరి నారాయణరావును మురళి ఇంటర్వ్యూ చేసిన వీడియోలే ఎక్కువగా వైరల్ అయ్యాయి. అలాంటి మురళి టీవీ9ను వీడారు. తను టీవీ9కు రాజీనామా చేసినట్టు మురళికృష్ణ చెప్పుకున్నప్పటికీ.. తెరవెనక జరిగింది మాత్రం 'ఆ పాత' తంతే.
అసలు మేటర్ ఇది..
టీవీ9 చేతులు మారిన తర్వాత పాత కాపులకు పొగబెట్టే కార్యక్రమం దిగ్విజయంగా మొదలైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రవిప్రకాష్ నుంచి మొదలుపెట్టి చాలామంది పెద్ద తలకాయల్ని దశలవారీగా తొలిగిస్తూ వచ్చింది కొత్త యాజమాన్యం. నూతన యాజమాన్యం చేతుల్లోకి ఛానెల్ వచ్చిన తర్వాత టీవీ9కు కొత్త బాస్ గా మారిన రజనీకాంత్ కూడా ఈ పొగబెట్టే కార్యక్రమాన్ని చూసీచూడనట్టు ఊరుకున్నారు. పైపెచ్చు తన స్థాయిలో ఎగదోశారనే పుకారు చాన్నాళ్లుగా వినిపిస్తున్నదే.
ఇక తాజా వికెట్ మురళీకృష్ణ విషయానికొద్దాం. ఈయన చేసే కార్యక్రమాన్ని కొన్నాళ్లుగా ఆపేశారు. అడిగితే రేటింగ్ రావడం లేదని చెప్పారట. ప్రసారం చేస్తే కదా రేటింగ్ వస్తుందా లేదా తెలుస్తుందనేది మురళి వాదన. రేటింగ్ రానప్పుడు ఇంకెన్నాళ్లు కార్యక్రమాన్ని కొనసాగిస్తామనేది ఛానెల్ వాదన. అలా కొన్నాళ్లుగా ఆఫీస్ కు రావడం, పంచ్ కొట్టి ఇంటికెళ్లడం దినచర్యగా పెట్టుకున్నారు మురళి. ఈ క్రమంలో తను ఉద్యోగం మానేస్తానని మేనేజ్ మెంట్ కు ఆయన చెప్పడం.. పంచాయితీ పెద్దల వరకు వెళ్లి సయోధ్య కుదర్చడం కూడా జరిగాయి. కానీ అంతర్గతంగా మళ్లీ అదే 'పొగ'. దీంతో ఉక్కిరిబిక్కిరైన మురళి బయటపడ్డానికే మొగ్గుచూపారు. కొన్నాళ్ల కిందట రిజైన్ చేశారు. ఈరోజు అధికారికంగా రిలీవ్ అయ్యారు.
వేర్ ఈజ్ సానుభూతి.. వేర్ ఈజ్ బాధ
నిజానికి మురళీకి ఛానెల్ ను వీడడం కొత్తకాదు. గతంలోనే ఆయన టీవీ9 నుంచి ఓసారి బయటకు వెళ్లారు. అట్నుంచి మళ్లీ గోడకు కొట్టిన బంతిలా తిరిగి టీవీ9కు వచ్చేశారు. ఇప్పుడు మరోసారి టీవీ9 ను వీడారు. అయితే ఈసారి బంతి వెనక్కి రాదంటున్నారు ఛానెల్ ఉద్యోగులు. మురళీకృష్ణను అవమానకర రీతిలో సాగనంపారనేది సారాంశం.
తన రాజీనామా విషయాన్ని మురళీకృష్ణ సోషల్ మీడియాలో పెడితే ఎవ్వరూ బాధపడలేదు. ఒక్కరు కూడా సానుభూతి తెలపలేదు. పైపెచ్చు టీవీ9 నుంచి మురళి బయటకొచ్చినందుకు నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలపడం విశేషం. ఇకపై మురళికృష్ణ మరింత స్వేచ్ఛగా తన ఇంటర్వ్యూల్ని కొనసాగించొచ్చని కొందరు అభిప్రాయపడితే, టీవీ9 సంకెళ్ల నుంచి బయటపడిన మురళి అంటూ మరికొందరు కొటేషన్స్ తగిలిస్తున్నారు. మొత్తమ్మీద ఓ పెద్ద ఛానెల్ ను మురళి వదిలేశారనే కామెంట్ మాత్రం ఎక్కడా వినిపించకపోవడం ఆశ్చర్యం.
ఛానెల్ ఏ పార్టీ వైపు ఉన్నప్పటికీ, మురళీ ఇంటర్వ్యూలు మాత్రం హాట్ హాట్ గా ఉండేవి. మద్దతు తెలుపుతున్న పార్టీ నేతనైనా, ఛానెల్ కు గిట్టని పార్టీకి చెందిన నేతనైనా ఒకేలా ఇరుకునపెడుతూ ప్రశ్నలు సంధించేవారు మురళి. ఆ శైలి చాలామందికి నచ్చింది. తిరిగి మురళీకృష్ణ ఎప్పుడు, ఏ ఛానెల్ లో తన ప్రస్థానం మొదలుపెడతారో చూడాలి. తాజా సమాచారం ప్రకారం, ఆయనకు ఎన్టీవీ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.