చదువు చెప్పే గురువు విద్యార్ధి ఉన్నతిని కోరుకుంటారు. విద్యార్ధి మెదడులో గుజ్జు ఎంత ఉందన్నది మాత్రమే ఆలోచిస్తారు మార్కుల చదువులు, పాస్ సర్టిఫికేట్లూ అన్నవి అసలు చూడరు. అలాగే, తన శిష్యుడుని అని ఏదోలా గట్టెక్కించాలని చూడడు. మరి గతంలో మాస్టారుగా పనిచేసిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మాత్రం శిష్య ప్రేమను చూపిస్తున్నారు.
ఆయనలోని మాస్టారు టెన్త్ విద్యార్ధుల మీద మమకారాన్ని చూపించేలా చేస్తున్నాయి. టెన్త్ పరీక్షా ఫలితాల్లో తక్కువ ఉత్తీర్ణత రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే కొత్త పరీక్షా విధానం, బిట్లు లేవు, చాయిస్ గా తక్కువ ఇచ్చారు అంటూ దాడి మాస్టారు చెప్పుకొచ్చారు.
ఈ కొత్త విధానం విద్యార్ధులకు అర్ధం కాలేదని, పైగా కరోనాతో చదువు అంతా అటకెక్కిందని ఆయన అంటున్నారు. అందుకే టెన్త్ విద్యార్ధులకు గ్రేస్ మార్కులు పది దాకా ఇచ్చి అయినా వారిని గట్టెక్కించాలని కోరుతున్నారు. ఈ విషయంలో జగన్ పెద్ద మనసు చేసుకోవాలని, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన పలుకుబడి ఉపయోగించాలని ఆయన సూచిస్తున్నారు.
అయినా మాస్టార్ గా దాడి వారు ఈ రకమైన సూచనలు చేయడం ధర్మమేనా అని మేధావులు అంటున్నారు. చదువుకుని మార్కులు విద్యార్ధులు రాబట్టాలి కానీ గ్రేస్ మార్కులతో వారిని పాస్ చేస్తే చేతిలో సర్టిఫికేట్ ఉంటుంది కానీ అంతకు మించి ఏమిటి ఉపయోగం అన్న ప్రశ్న కూడా ఉత్తమ విద్యను కోరుకునే వారి నుంచి వస్తోంది.
మరి పేపర్లు దిద్ది మార్కులు వేసి తప్పులకు టిక్కులు పెట్టే ఒకనాటి మాస్టారుగా దాడి వారు కూడా ఈ విషయాలను కాస్తా ఆలోచించాలేమో.