ఆయన స్వాగతం చెప్పకపోయినా రాజకీయ రగడ జరగాల్సిందే!

తెలంగాణలో కేసీఆర్ సర్కారు మీద ప్రజా వ్యతిరేకత ఉందన్నది వాస్తవం. మునుగోడు ఉప ఎన్నికే అందుకు సాక్ష్యం. కేసీఆర్ మునుగోడులో తన సర్వ శక్తులను మోహరించినా, చతురంగ బలాలను రంగంలోకి దింపినా, ఆర్ధిక, అంగ…

తెలంగాణలో కేసీఆర్ సర్కారు మీద ప్రజా వ్యతిరేకత ఉందన్నది వాస్తవం. మునుగోడు ఉప ఎన్నికే అందుకు సాక్ష్యం. కేసీఆర్ మునుగోడులో తన సర్వ శక్తులను మోహరించినా, చతురంగ బలాలను రంగంలోకి దింపినా, ఆర్ధిక, అంగ బలాలతో విన్యాసాలు చేసినా కొద్దీ మెజారిటీతోనే గెలిచింది అనేది వాస్తవం. కేసీఆర్ దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మునుగోడు యుద్ధాన్ని కొనసాగించాలనుకున్నారు. అది ప్రధాని మోడీ పర్యటన రూపంలో అంది వచ్చింది. ఇక చెలరేగిపోతున్నారు. బీజేపీ వాళ్ళు కూడా తక్కువ తినలేదు. వాళ్ళు కూడా కేసీఆర్ మీద యుద్ధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు కనబడుతోంది. అందుకే పనిగట్టుకొని మోడీని రామగుండానికి రప్పిస్తున్నట్లుగా ఉంది. ఎలాగూ ఆయన ఏపీకి వస్తున్నాడు. పనిలోపనిగా తెలంగాణాకు కూడా తీసుకొస్తే సరిపోతుందని అనుకున్నారు.

రామగుండం ఎరువుల కర్మాగారం ఉత్పత్తి ప్రారంభించినా రాజకీయ ప్రయోజనాల రీత్యా దాన్ని మోడీ ప్రారంభిస్తున్నారని అనుకోవాలి. మోడీ పర్యటన సందర్భంగా కేసీఆర్ ఎప్పిటి మాదిరిగానే తన పాత అస్త్రాన్ని బయటకు తీశారు. ఆ అస్త్రం పేరు ప్రోటోకాల్ పాటించకపోవడం. అంటే ప్రధానికి ముఖ్యమంత్రిగా స్వాగతం చెప్పకపోవడం. ఆయన గవర్నర్ విషయంలోనూ ఇదే వైఖరి అనుసరించారు. కేసీఆర్ ఎలాగూ మోడీకి స్వాగతం చెప్పారు. కానీ కేంద్రం ప్రోటోకాల్ పాటించడంలేదని ఆరోపించారు. ప్రదానమంత్రి నరేంద్రమోడీ 12వ తేదీన తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ పాల్గొనాల్సి ఉంది. అయితే ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించలేదని టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వ వర్గాలు .. ఈ ఆరోపణల్ని ఖండించాయి.

రామగుండం ప్లాంట్ సీఈవో స్వయంగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పంపిన ఆహ్వాన లేఖను సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీకి అందించారన్నారు. ఈ లేఖను మీడియాకు కూడా విడుదల చేశారు. ప్రధాని రాష్ట్రంలో చేపట్టే అధికారిక పర్యటనకు ముఖ్యమంత్రి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. నిజానికి ఇది పూర్తి స్థాయిలో అధికారిక కార్యక్రమమే. ప్రధానమంత్రి ఒక రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు పార్టీలకు అతీతంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కావడం ఆనవాయితీ. అయితే గతంలో ప్రధాని చేపట్టిన మూడు పర్యటనలకు గైర్హాజరైనట్టే  ఇప్పుడు కూడా కేసీఆర్ వెళ్లడం లేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ముచ్చింతల్ సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మోదీ వచ్చారు. కానీ స్వాగతం పలికేందుకు కేసీఆర్ హాజరు కాలేదు. అప్పటినుంచే మోదీ, కేసీఆర్ మధ్య వైరం మొదలైంది.

రామానుజుల విగ్రహ ఆవిష్కరణ శిలాఫలకంపై కేసీఆర్ పేరు ఏర్పాటు చేయకపోవడంతో ఆయన నొచ్చుకున్నారని, అందుకే వెళ్లలేదనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత మే 26న ప్రధాన మంత్రి మోడీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ శతాబ్ది ఉత్సవాలకు హాజరయ్యారు. దానికి కూడా కేసీఆర్ హాజరు కాలేదు. అదే సమయంలో బీజేపీయేతర పక్షాలను కూడగట్టడంలో భాగంగా కేసీఆర్ అదేరోజు బెంగళూరుకు వెళ్లి మాజీ ప్రధాని దేవె గౌడతో భేటీ అయ్యారు. ప్రధాని హైదరాబాద్ కు వచ్చిన రోజే కేసీఆర్ బెంగళూరు టూర్ పెట్టుకోవడంపై అప్పట్లో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఆ తర్వాత జూలై 2 నుంచి నగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. అందులో భాగంగా జూలై 3న ప్రధాని నగరానికి వచ్చారు.

అది పూర్తిగా పార్టీ కార్యక్రమం కావడంతో కేసీఆర్ పర్యటనకు దూరంగానే ఉన్నారు. ఇప్పుడు అధికారిక పర్యటనలో భాగంగా రామగుండం వస్తున్నప్పటికీ దానికి కేసీఆర్ హాజరు అయ్యే అవకాశం లేదు. వాస్తవానికి ప్రధాని పర్యటిస్తే ప్రోటో కాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాగతం పలకాల్సి ఉంటుంది. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కావడంతో టీఆర్ఎస్ అగ్గిమీద గుగ్గిలం అవుతోందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక ముగిసిపోయినా టీఆర్ఎస్, బీజేపీ మధ్య రగడ చల్లారడం లేదు. ఈసారి రామగుండం రూపంలో మరో ఘర్షణ రాజుకుంది. ప్రధానమంత్రి మోడీ రామగుండంలో పర్యటించనున్న నేపథ్యంలో దాని చుట్టూ రాజకీయం అల్లుకుంటున్నది.