ముగ్గురు భార్య‌ల ముచ్చ‌ట ఎందుకంటే?

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను వైసీపీ ఓ ప‌థ‌కం ప్ర‌కార‌మే ఇరిటేట్ చేస్తోంది. అధికార పార్టీ ట్రాప్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌డ్డారు. ఎప్పుడైతే ప‌వ‌న్ చెప్పు తీసుకుని…రాండ్రా నా కొడుకుల్లారా అని తిట్ల పురాణానికి దిగారో, ఆ క్ష‌ణాన్నే…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను వైసీపీ ఓ ప‌థ‌కం ప్ర‌కార‌మే ఇరిటేట్ చేస్తోంది. అధికార పార్టీ ట్రాప్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌డ్డారు. ఎప్పుడైతే ప‌వ‌న్ చెప్పు తీసుకుని…రాండ్రా నా కొడుకుల్లారా అని తిట్ల పురాణానికి దిగారో, ఆ క్ష‌ణాన్నే అత‌ని రాజ‌కీయానికి స‌మాధి క‌ట్టుకున్నారు. మ‌హిళ‌ల‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని, ఏపీ మ‌హిళా క‌మిష‌న్ నోటీసు ఇవ్వ‌డం, మ‌రోవైపు మ‌హిళ‌లెవ‌రైనా జ‌న‌సేన‌కు ఓటు వేస్తారా? అని మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ప్ర‌శ్నించ‌డం వెనుక భారీ వ్యూహం ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌హిళ‌ల జీవితాల‌తో ఆడుకునే వ్య‌క్తిగా ప‌వ‌న్‌ను బోనులో నిలిపేందుకు అధికార పార్టీ వ్యూహాత్మ‌కంగా ముందుకెళుతోంది. అందుకే ప‌వ‌న్ మూడు పెళ్లిళ్ల గురించి జ‌గ‌న్ మొద‌లుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు ప‌దేప‌దే విమ‌ర్శించ‌డం. “ఔను క‌దా” అని సామాన్య‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జానీకం కూడా అధికార పార్టీతో శ్రుతి క‌లిపే ప‌రిస్థితి వ‌స్తోంది. రాజ‌కీయంగా, పాల‌కుడిగా జ‌గ‌న్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడే వాళ్లు కూడా, ప‌వ‌న్ వ్య‌వ‌హార శైలిని ఆమోదించే ప‌రిస్థితి లేదు. ఇది ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు నెగెటివ్ అవుతోంది. 

మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ జ‌న‌సేనాని మ‌హిళ‌ల ఓట్లు అడ‌గ‌గ‌ల‌రా? అని ప్ర‌శ్నించ‌డం వెనుక వ్యూహాన్ని జ‌న‌సేన అర్థం చేసుకోవాలి. అవినీతి, అక్ర‌మాలు, దౌర్జ‌న్యాల కంటే, మ‌హిళ‌ల విష‌యంలో నేత‌ల చేష్ట‌ల‌ను స‌మాజం అంగీక‌రించ‌దు. మ‌హిళ‌ల జీవితాల‌తో ఆడుకునే వారిని పోకిరీలుగా పౌర స‌మాజం చూస్తుంది.

సినిమాల్లో మాత్ర‌మే పోకిరీల‌ను ఆద‌రిస్తారు. రియ‌ల్ లైఫ్‌లో అలాంటి వారిని ద‌గ్గ‌రికి రానివ్వ‌రు. నా అక్క‌చెల్లెళ్లు, వీర మ‌హిళ‌లు, మాతృమూర్తుల‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎంతో ఆరాధ‌న భావంతో మాట్లాడినా… అన్నీ మాట‌లే, చేష్ట‌లు మ‌రోలా వుంటాయ‌నే చ‌ర్చ న‌డుస్తోంది. అంతేకాకుండా, ప‌వ‌న్ చుట్టూ అలాంటి బ్యాచ్ వుంటోంద‌నే అభిప్రాయం బ‌లంగా వుంది. ఇటీవ‌ల ప‌వ‌న్‌క‌ల్యాణ్ దూష‌ణ భాష కూడా ఆయ‌న నిజ స్వ‌రూపం ఇదే అనే అభిప్రాయాల్ని బ‌ల‌ప‌రిచేలా వుంది. 

ఏ ర‌కంగా చూసినా ప‌వ‌న్ వైవాహిక జీవితాల గురించి వైసీపీ వ్యూహాత్మ‌కంగా దాడి చేయ‌డం వెనుక‌… గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేసే మ‌హిళ‌ల ఓట్ల‌ను జ‌న‌సేన‌తో పాటు ఆ పార్టీ మ‌ద్ద‌తు ఇచ్చే ఇత‌ర రాజ‌కీయ ప‌క్షానికి ప‌డ‌కూడ‌ద‌నే ఎత్తుగ‌డ‌లో భాగ‌మ‌ని చెప్పొచ్చు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో కాల‌మే జ‌వాబు చెప్పాలి.