జగన్ ఎఫెక్ట్.. కేసీఆర్ పై పెరుగుతున్న ఒత్తిడి

ఏపీలో స్కూల్స్ తెరుచుకున్నాయి, నాడు-నేడుతో పండగ వాతావరణం నెలకొంది. విద్యాదీవెన కిట్లు కూడా పంపిణీ చేశారు. బుక్స్, బ్యాగ్స్, షూస్.. కొత్తగా డిక్షనరీ కూడా ఇచ్చేశారు. దీంతో ఏపీలో విద్యార్థులు స్టడీ మూడ్ లోకి…

ఏపీలో స్కూల్స్ తెరుచుకున్నాయి, నాడు-నేడుతో పండగ వాతావరణం నెలకొంది. విద్యాదీవెన కిట్లు కూడా పంపిణీ చేశారు. బుక్స్, బ్యాగ్స్, షూస్.. కొత్తగా డిక్షనరీ కూడా ఇచ్చేశారు. దీంతో ఏపీలో విద్యార్థులు స్టడీ మూడ్ లోకి వచ్చేశారు. మరి తెలంగాణ పరిస్థితి ఏంటి..? తెలంగాణలో స్కూల్స్ ఎప్పుడు తెరుస్తారు.

సెప్టెంబర్-1నుంచి స్కూల్స్ తెరవాలంటూ ఇటీవలే అక్కడి విద్యాశాఖ కూడా ప్రభుత్వానికి సూచన చేసింది. కానీ ప్రభుత్వం దాన్ని పక్కనపెట్టింది, కనీసం మంత్రి మండలి సమావేశంలో కూడా చర్చించలేదు. అసలింతకీ కేసీఆర్ వ్యూహం ఏంటి..?

సినిమా హాళ్లు తెరుస్తారు.. స్కూళ్లు తెరవరా..?

ఏపీలో సినిమా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరిచేందుకు నిబంధనలు అడ్డంగా ఉన్నాయి. నైట్ కర్ఫ్యూ వల్ల సెకండ్ షోలు వేయడంలేదు. కొన్ని జిల్లాల్లో పగటి కర్ఫ్యూ కూడా అమలులో ఉండటంతో థియేటర్లకు రావడానికి జనం జంకుతున్నారు. టికెట్ రేట్ల తగ్గింపు వ్యవహారంతో చాలా చోట్ల థియేటర్ల ఓనర్లు షోలు వేసేందుకు వెనకడుగేస్తున్నారు. తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది. కర్ఫ్యూ ఊసే లేదు. సినిమా హాళ్లు, మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లు, బార్లు.. అన్నిటికీ పర్మిషన్ ఉంది, ఒక్క విద్యా సంస్థలకు తప్ప.

ఇప్పటివరకూ కంపేరిజన్ రాలేదు కానీ, ఇప్పుడు ఏపీతో తెలంగాణకు పోలిక వచ్చింది. జగన్ ప్రభుత్వం సినిమా హాళ్ల కంటే స్కూల్స్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. అటు కేసీఆర్ సర్కారు మాత్రం స్కూళ్లను పట్టించుకోకుండా సినిమా హాళ్లను మాత్రం బార్లా తెరిచింది.

ఎన్నికలే ముఖ్యం.. చదువులు కాదు..

కేసీఆర్ మూడ్ అంతా హుజూరాబాద్ చుట్టూ తిరుగుతోంది. ఈటలను ఎలా దెబ్బకొట్టాలి, ఎలాంటి కొత్త పథకాలు తేవాలి, బీజేపీని కాంగ్రెస్ ని కలిపి ఎలా వెనక్కు నెట్టాలి అనే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్. అందుకే వలసలను ప్రోత్సహిస్తూ, వారికి వరాలు ప్రకటిస్తూ, దళిత బంధు లాంటి పథకాలను ప్రవేశ పెడుతూ ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయారు కేసీఆర్. ఆన్ లైన్ క్లాసులు అన్నారు కానీ, ప్రైవేట్ స్కూల్స్ దూసుకెళ్తున్నాయి, ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఆన్ లైన్ చదువులు కష్టమయ్యాయి.

అటు ఇంటర్మీడియట్ విషయంలో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు మరీ వెనకబడ్డారు. ప్రైవేటు కాలేజీల్లో ఇంటర్ సిలబస్ సగం పూర్తయింది, ప్రభుత్వ కాలేజీల్లో బోధన బాగా ఆలస్యం కావడంతో నిన్నటికి నిన్న హడావిడిగా ఆన్ లైన్ క్లాసులు పెట్టారు. కానీ సరైన టెక్నాలజీ అందుబాటులో లేక, విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులకు కూడా అవగాహన లేక దానివల్ల ఫలితం లేకుండా పోయింది.

తెలంగాణలో వెంటనే ఆఫ్ లైన్ బోధన మొదలు పెట్టాలని కొంతమంది నుంచి డిమాండ్ మొదలైంది. ఇటు ఏపీలో స్కూళ్లు, కాలేజీలు మొదలు కావడంతో సర్కారుపై ఆ ఒత్తిడి మరింత పెరిగింది. మరి దీనికి కేసీఆర్ ఎలాంటి ముగింపునిస్తారో చూడాలి.