నిమ్మ‌గ‌డ్డ‌.. ఎంత తేడా వ‌చ్చేసింది!

ఏపీలో ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పెండింగ్ లో ఉన్న స్థానిక ఎన్నిక‌ల‌ను నిర్వహించ‌డం సాధ్యం కాద‌ని తేల్చేశారు ఆ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్. మ‌ధ్య‌లో ఆగి ఉన్న ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల…

ఏపీలో ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పెండింగ్ లో ఉన్న స్థానిక ఎన్నిక‌ల‌ను నిర్వహించ‌డం సాధ్యం కాద‌ని తేల్చేశారు ఆ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్. మ‌ధ్య‌లో ఆగి ఉన్న ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఎస్ఈసీకి ఆదేశాలు ఇవ్వాల‌ని ఏపీ ప్ర‌భుత్వం కోర్టును ఆశ్ర‌యించ‌గా, ఆ ఆదేశాలు ఇవ్వ‌ల‌మేని కోర్టు పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఎస్ఈసీ కౌంట‌ర్ దాఖ‌లు చేస్తూ.. ప్ర‌స్తుతం ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు నిర్వ‌హించే ఆలోచ‌న త‌న‌కే మాత్రం లేద‌ని తేల్చి చెప్పారు.

దానికి అనేక కార‌ణాల‌ను ఆయ‌న పేర్కొన్నారు. ఏవేవో అభ్యంత‌రాలున్నాయ‌ట‌. వాటికి తోడు త‌న ప‌ద‌వీ విర‌మ‌ణ ఉంద‌ట‌. అందుకే ఇప్పుడు ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించే ఆలోచ‌న లేద‌ని నిమ్మ‌గ‌డ్డ తేల్చి చెప్పారు. పెండింగ్ లో ఉన్న ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఐదారు రోజుల స‌మ‌యం చాల‌ని ఇది వ‌ర‌కే ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. 

ఆయ‌న వారం కింద‌టే ఈ మాట చెప్పారు. అయితే నిమ్మ‌గ‌డ్డ అనాస‌క్తి గురించి తెలిసిన సంగ‌తే. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కోర్టును ఆశ్ర‌యించింది, నిమ్మ‌గ‌డ్డ కోరిన‌ప్పుడు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు అవ‌కాశం ఇచ్చిన న్యాయ‌స్థానం, ఇప్పుడు కూడా ఆ నిర్ణ‌యం ఆయ‌న ప‌రిధిలోనే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది.

అయితే ఈ విష‌యంలో ప్ర‌భుత్వం త‌ర‌ఫు నుంచి తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏపీలో జ‌రిగిన పంచాయ‌తీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తి వ్య‌తిరేక ఫ‌లితాలు రావ‌డం వ‌ల్ల‌నే ఇప్పుడు నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డానికి సానుకూలంగా లేద‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం నుంచి వినిపిస్తున్న వాద‌న‌. 

సామాన్య ప్రజానీకం, విశ్లేష‌కులు కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్నే వ్య‌క్తం చేస్తూ ఉన్నారు. స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో పంతానికి పోయి నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ తెలుగుదేశం పార్టీకి తీవ్ర న‌ష్టం చేశార‌నే అభిప్రాయాలే ఏక‌గ్రీవంగా వ్య‌క్తం అయ్యాయి. టీడీపీకి ఎంతో ఇష్ట‌మైన ఆ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ చివ‌ర‌కు టీడీపీ నావ‌కు ప‌డ్డ చిల్లుల‌ను హైలెట్ చేశార‌నే అభిప్రాయాలు ముక్త‌కంఠంతో వ్య‌క్తం అయ్యాయి. ఈ క్ర‌మంలో ఆయ‌న ఎంపీటీసీ-జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డానికి స‌సేమేరా అంటార‌ని అంతా అనుకున్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన‌ప్పుడే ఆ క్లారిటీ వ‌చ్చింది.

త‌న మీద ఉన్న ఎక్స్ పెక్టేష‌న్ల‌ను ఏ మాత్రం వ‌మ్ము చేయ‌లేదు నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్. అవ‌కాశం ఉన్నా జ‌డ్పీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌లేద‌నే అపప్ర‌ద‌ను మూట‌గ‌ట్టుకోవ‌డానికే ఆయ‌న రెడీ అయ్యారు. అదే చేసి వెళ్తున్నారు. వ‌చ్చే కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ పెండింగ్ లో ఉన్న ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తాడ‌ని కూడా ఆయ‌న కోర్టుకు నివేదించార‌ట‌. దాన్నైతే నిమ్మ‌గ‌డ్డ ఆప‌లేరు!

త‌న హ‌యాంలో స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కోసం ప‌ట్టుబ‌ట్టిన పెద్ద మ‌నిషి, ఆ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయ‌కుండా, పూర్తి చేసేది లేదంటూ నిష్క్ర‌మించ‌డం మాత్రం గ‌మ‌నార్హం!