ఇది కొంత వింతగా తోస్తుంది. మిత్రులకు ధన్యవాదాలు చెప్పడంలో అర్థముంది కానీ, శత్రువులకు చెప్పడమేమిటి అనిపిస్తుంది. ‘యూ నీడ్ ఎ ఫ్రెండ్ టు కమ్‌అప్, బట్ ఏన్ ఎనిమీ మేక్స్ యూ గో ప్లేసెస్’ (విజయవంతం కావడం) అంటారు. మా వరప్రసాద్ విషయంలోనే అది చూశాను. ఆయన హైదరాబాదు బ్యాటరీస్‌లో భాగస్వామిగా చేరి వంచనకు గురి కావడంతోనే శాంతా బయోటెక్నిక్స్ పెట్టి తనకు ముఖపరిచయం కూడా లేని బయోటెక్ రంగంలో ప్రవేశించి రాణించాడు. వంచనకు గురయ్యాడని కోర్టు కూడా చెప్పింది కాబట్టే ధైర్యంగా రాస్తున్నాను. ఎటొచ్చీ ఆ తీర్పు దశాబ్దంన్నర తర్వాత వచ్చింది. ఈ లోపున యీయన శత్రువు మీద పళ్లు నూరుతూ కూర్చోకుండా, పట్టుదలతో ఏదో ఒకటి సాధించాలనే తపనతో కృషి చేసి నెంబర్ వన్ స్థానానికి ఎదిగాడు. పాత కంపెనీలోనే కొనసాగి ఉంటే నెంబర్ టూ గానే ఉండేవాడు. వ్యక్తిగతమైన ఖ్యాతి వచ్చేది కాదు.
‘‘వెర్జర్’’ అని సోమర్సెట్ మామ్ కథ ఉంది. చర్చిలో గంటలు కొట్టే ఉద్యోగికి చదువు లేదని కొత్తగా వచ్చిన ఫాదర్ ఉద్యోగంలోంచి తీసేశాడు. ఇతను అతన్ని తిట్టుకున్నాడు కానీ బయటకు వచ్చేసి, గత్యంతరం లేక వ్యాపారంలోకి దిగి బోల్డు డబ్బు గడించాడు. ఓ పెద్ద ఫంక్షన్‌లో అతను నిశానీ పద్దు అని తెలిసి విలేకరి తెల్లబోయి ‘మీరే కనుక చదువుకుని ఉంటే యింకా ఎంత పైకి వచ్చేవారో’ అంటాడు. ‘చదువుకుని ఉంటే చర్చిలో యింకా గంటలు కొడుతూండేవాణ్ని’ అంటాడు యితను! ఆ ఫాదర్ అప్పటికి శత్రువుగా తోచినా, దీర్ఘకాలంలో చూస్తే మహోపకారం చేసినట్లే లెక్క! ఈ కాన్సెప్టును యీ సినిమాలో పెట్టడం నాకు నచ్చింది. ఎటొచ్చీ సినిమాకు యూత్‌ఫుల్ లుక్ యివ్వడానికి కాబోలు యీ భాగాన్ని గంటసేపు సాగదీశారు.
పల్లెటూరి నుంచి వచ్చేసిన తర్వాత హీరో వైజాగ్‌కి చేరి కాలేజీ చదువులో పడ్డాడు. అక్కడుండగానే తల్లి చనిపోయింది. కాలేజీలో చదువుతో పాటు హాకీలో కూడా రాణించడంతో అప్పటిదాకా హాకీ కెప్టెన్‌గా వెలిగిన శర్వా అనే ఎమ్మెల్యే కొడుక్కి మండింది. హీరోపై పగ పెంచుకుని మాటిమాటికీ హింసించాడు. ఇతనూ తక్కువ తినకుండా ఎదుర్కుంటూ వచ్చాడు. శర్వా చెల్లెలు అవికా యితనికి రాఖీ కట్టి మా అన్నా, నువ్వూ కొట్టుకోకండి అని నచ్చచెప్పింది. ఒక స్టేజి తర్వాత హీరో వైషమ్యం వదిలేశాడు కానీ శర్వా వదలలేదు. హాకీ ఛాంపియన్‌గా హీరో నెగ్గిన రోజు అవికా ఫోన్ నుంచి మెసేజి పంపి స్టేడియంకు రప్పించి, చావగొట్టి భవిష్యత్తులో హాకీ ఆడకుండా చెయ్యి విరక్కొట్టారు. అంతటితో ఆగకుండా చంపడానికి చూస్తే హీరో గూడ్స్ ఎక్కి వారికి చిక్కకుండా పారిపోయాడు. శర్వా, అతని చెల్లెలు కలిసి తనను మోసగించారని పగ పెంచుకున్నాడు.
అయితే గూడ్స్‌లో పారిపోతున్నప్పుడే రక్తసిక్తమై, ముక్కలుచెక్కలైన తన చేతిని చూసుకున్నపుడు అతనికి ఐడియా వచ్చింది – అప్పటికప్పుడు తన చేతిని ఎక్స్‌రే తీసి డాక్టర్లకు పంపితే, రక్తం నమూనాను పంపితే, చికిత్స వెంటనే ప్రారంభమవుతుంది కదా అని! ఈ ఆలోచనే అతను ‘వైద్య’ అనే యాప్‌ను డెవలప్ చేయడానికి కారణభూతమైంది. ఆ పేరుతోనే కంపెనీ పెట్టి అతను కోట్లు గడించాడు. అందువలన తనకా దుస్థితి కల్పించిన శత్రువు కూడా అభినందనకు, కృతజ్ఞతకు అర్హుడే అని పరివర్తన చెందిన హీరోకి తోచింది. వైజాగ్ వెళ్లి కలిశాడు. శర్వాలో కూడా మార్పు వచ్చింది. హింసా రాజకీయాల ద్వారా అతను కాలు పోగొట్టుకున్నాడు. హీరోపై దాడి విషయంలో తన చెల్లెలి పాత్ర ఏమీ లేదని క్లారిఫై చేసి, హీరోకి ఆమెపై ఉన్న కోపాన్ని పోగొట్టాడు.
ఈ విధంగా మిత్రులు, శత్రువులు, తల్లి, ప్రేయసి అందరూ ఏదో రకంగా సాయపడితేనే తనీ స్థాయికి రాగలిగానని, అంతా తన సొంత ప్రతాపమే కాదనే అవగాహన హీరోకి కలిగింది. అమెరికాకు తిరిగి వచ్చి పాత కొలీగ్స్ అందర్నీ మళ్లీ చేర్చుకుని, సముచిత స్థానం, గుర్తింపు యిచ్చాడు. ఉద్యోగులందర్నీ భాగస్వాములుగా చేశాడు. ప్రకాశ్ రాజ్ తన క్లయింట్లకు ఉద్యోగాలు చూపించలేక, బ్యాంకు నుంచి తీసుకున్న అప్పు తీర్చలేక, కొందరికైనా ఉద్యోగాలు యిప్పించి తన పరువు కాపాడమని అడగడానికి తన వద్దకు వచ్చాడని తెలుసుకుని, ఆయన మరణానంతరమైనా ఆయన కోరిక తీర్చడానికి కొందరికీ తన కంపెనీలో ఉద్యోగాలు యిచ్చి ఆ ఉద్యోగార్థులు ప్రకాశ్ రాజ్‌ను తిట్టుకోకుండా చేశాడు. ఇవన్నీ తెలుసుకున్న రాశీ మళ్లీ హీరోకి చేరువైంది. తాము తలిదండ్రులం కాబోతున్నామని చెప్పింది.
ఇదీ సినిమా కథ. నవలలో హీరో స్వార్థపరుడు మాత్రమే కాక, కపటి కూడా. తను పైకి రావడానికి అందర్నీ ఉపయోగించుకుంటూ, తొక్కుకుంటూ పోయాడు. చావబోతున్నానని తెలిసి కూడా కన్ఫెషన్ చేయడు. తను అమాయకుణ్ననే టోన్‌లోనే చెప్తాడు. మనస్సాక్షి చీదరించుకుని దూరంగా వెళ్లిపోయాకనే అతనిలో అంతర్జ్వలన ప్రారంభమౌతుంది. సినిమా హీరోలో కాపట్యం లేదు. అహంకారం ఉంది. అంతా తన ప్రజ్ఞే అనుకున్నాడు. టీము స్పిరిటు మీద నమ్మకం లేదు. ఎవరి సాయం లేకుండా స్వయంకృషితో పైకి వచ్చాననుకున్నాడు. తను పైకి రావడానికి ఎన్నో జ్ఞాత, అజ్ఞాత హస్తాలు తోడ్పడ్డాయనే సంగతి గ్రహించాక పశ్చాత్తాప పడ్డాడు. పొరపాట్లు దిద్దుకున్నాడు. ఇలా హీరోని పాజిటివ్‌గా మార్చారు. నవల ఛాయలు తొలి అరగంటలోనే కనబడతాయి. తర్వాతిదంతా స్వతంత్ర రచనే. సినిమా జనాలకు నచ్చలేదు. ఇది సినిమా సమీక్ష కాదు కాబట్టి, బాగోగుల సంగతి చర్చించటం లేదు. కానీ బేసిక్ థీమ్ ఐన థాంక్యూ చెప్పడం నాకు నచ్చి యిదంతా రాశాను.
ఈ సినిమాలో థాంక్యూ థీమ్‌ను వ్యక్తులకు మాత్రమే పరిమితం చేశారు కానీ నా దృష్టిలో ఎన్నారైలు (నవలలో, సినిమాలో హీరోలు వాళ్లే కాబట్టి వాళ్ల గురించే మాట్లాడుతున్నాను) థాంక్యూ చెప్పవలసిన మరో అంశం, భారతదేశంలో ఉన్న వ్యవస్థ గురించి కూడా అని నా ఉద్దేశం. చాలామంది ఎన్నారైలు ‘ఇండియా తిరిగి రావాలని లేదండి. అక్కడ సిస్టమ్ బాగుండదు. డిసిప్లిన్ ఉండదు. అవినీతి, దరిద్రగొట్టు రాజకీయనాయకులు…’ అంటూ వల్లిస్తారు. ఈ దిక్కుమాలిన వ్యవస్థ నుండే వాళ్లు ఎదిగారని చాలా కన్వీనియెంటుగా మర్చిపోతారు. వ్యవస్థ అంటే రాజకీయాలు ఒకటే కాదు, కుటుంబ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, పుట్టిన చోట ఉన్న వాతావరణం.. యిలా ఎన్నో ఉంటాయి. ఇక్కడ తలిదండ్రులు పిల్లల కోసం చచ్చేదాకా శ్రమిస్తూనే ఉంటారు. సిఏ చదువుతానంటే 30 ఏళ్లు వచ్చినా సపోర్టు చేస్తూనే ఉంటారు. పాశ్చాత్య దేశాల్లో ఆ పరిస్థితి ఉందా? ఇక్కడ ప్రభుత్వ కాలేజీల్లో ఉన్నత విద్య కూడా ఉచితమే. అత్యుత్తమ సాంకేతిక ఉన్న ఐఐటికి సామాన్యుడు కూడా వెళ్లగలడు. అమెరికాలో అది ఉందా? ఉన్నత విద్య ఎంత ఖరీదు? విద్యాఋణాలనేవి అక్కడ పెద్ద ఫ్యాక్టర్.
నేరస్తుల నుంచి ప్రముఖుల దాకా ఎందరో విదేశీయుల జీవితగాథలు చదివాను, ఫిక్షన్ సినిమాలు, సీరియల్స్ చూశాను. అనేకమంది బాల్యం బాధాకరం, హింసాత్మకం. సవతి తండ్రి రేప్ చేశాడు… సవతి తల్లి తరిమేసింది.., మొగుడు విడిచినందుకు తల్లి డ్రగ్ అడిక్ట్ అయింది.. ఇలా ఎన్నో అబ్యూజ్‌డ్ చైల్డ్‌హుడ్ కేసెస్. సమాజపరంగా చూసినా అనేక దేశాల్లో రేసిజం, సోషల్ అన్‌రెస్ట్, మతాలవారీ విభజన, నియంతృత్వం. మిలటరీ పాలన, స్వేచ్ఛాహరణం.. యివేమీ లేని బాల్యాన్ని, యౌవనాన్ని యిచ్చి, చచ్చేదాకా దన్నుగా నిలిచే కుటంబవ్యవస్థనిచ్చిన మాతృదేశానికి ఏ కృతజ్ఞతా చెప్పనక్కరలేదా? వాతావరణ రీత్యా చూసినా కూడా నిన్ను దేవుడు నీరున్న ప్రాంతంలో పుట్టిస్తే నీటి కోసం వెతికే సమయాన్ని మిగిల్చి కళాసక్తిని కలిగించాడు, నీరు దొరకని ఎడారిలో పుట్టిస్తే బతికే పట్టుదలను యిచ్చాడు, రాళ్ల మధ్య పుట్టిస్తే దేహదార్ఢ్యం యిచ్చాడు, అడవిలో పుట్టిస్తే చురుకైన చూపు, శ్రవణశక్తి యిచ్చాడు. నయాగరా ఫాల్స్ పక్కన పుట్టిస్తేనే థాంక్స్ చెప్పాలి, లేకపోతే అక్కర్లేదు అనుకోకూడదు.
జన్మభూమి ఋణం ఎలా తీర్చుకోవాలి? భూములు కొని రెమిటెన్సెస్ ద్వారా ఫారెక్స్ నిధులు పెంచి దేశసేవ అని చెప్పుకోడం ద్వారానా? అక్కడి ఇన్‌కమ్ టాక్స్ బెనిఫిట్ కోసం సొంతూళ్లో గుడో, బడో కట్టించడమా? బడికి విరాళం యివ్వగానే సరికాదు, అది సద్వినియోగం అవుతుందా లేదా అని చూడాలి కదా, అది మనకనవసరం అనుకుంటే ఎలా? కావాలంటే డబ్బిస్తామనడం అన్యాయం, డబ్బుతో అన్ని సమస్యలూ పరిష్కారమయ్యేట్లుంటే అమెరికాలో హేపీనెస్ ఇండెక్స్ పీక్స్‌లో ఉండాలి కదా! గుడి కానీ, బడి కానీ బాగా నడవాలంటే దాని వ్యవస్థ బాగుండాలి. విదేశాల్లో నేర్చుకున్న అనుభవంతో వ్యవస్థలో లోపాలను చక్కదిద్దడంలోనే మీ ఘనత ఉంది.
అమెరికాలో అన్నీ బాగానే ఉన్నపుడు అమర్చినదానిలో అత్తగారు వేలు పెట్టిందన్నట్లు అక్కడ మీరేం వెలగబెట్టినా మీ ప్రజ్ఞేమి ఉంది? ఏమీ లేనిచోట పాండవులు ఇంద్రప్రస్థాన్ని నిర్మించినట్లు, హెర్క్యులిస్ ఔజీన్ స్టేబుల్స్‌ను క్లీన్ చేసినట్లు యిక్కటి వ్యవస్థను క్షాళనం చేయాలి. ఇవన్నీ చేస్తూ కూర్చుంటే మా సంపాదనో అనవచ్చు. కోయంబత్తూరు పారిశ్రామిక వేత్త జిడి నాయుడుగారి కొటేషన్ ఉంది. జీవితంలో మొదటి పాతికేళ్లు నేర్చుకో, తర్వాతి పాతికేళ్లు ఆర్జించు, మూడో పాతికేళ్లు సమాజం కోసం ఏదైనా చేయి అని. విదేశాల్లో విద్య, డబ్బు, అనుభవం సంపాదించి కృతజ్ఞతాభావంతో తిరిగి వచ్చి యిక్కడి పరిస్థితులు బాగు చేయడం సమంజసం. పూర్తిగా తిరిగి రాకపోయినా ఏడాదిలో మూణ్నాలుగు నెలలైనా ఉండి, తక్కిన సమయంలో రిమోట్‌గా నైనా సూపర్‌వైజ్ చేయడం ఆచరణసాధ్యం.
కానీ ఇలాటి ఆలోచనలు చాలామంది ఎన్నారైలకు రావు. ఎక్కి వచ్చిన నిచ్చెనను తన్నేసినట్లు, ఇండియాను తన్నేస్తారు. వాళ్ల మెంటాలిటీయే మారిపోతుంది. పైన చెప్పిన నవలలో ‘అవకతవకలు చేశావు’ అని ఒక్క వాక్యంలో సరిపెట్టారు కానీ ఎందరో చాలా అక్కడ అక్రమంగా ఉద్యోగాలు చేస్తూంటారు. చట్టవిరుద్ధమైన పని యిక్కడ చేయడానికి భయపడేవాళ్లు, చట్టం అక్కడ కఠినంగా అమలు చేస్తారని తెలిసినా అక్కడ మాత్రం చేస్తారు. అసలు అమెరికా ఐడియా రాగానే అప్పులు తెచ్చి బ్యాంక్‌లో వేసి డిపాజిట్లు బూస్టప్ చేసి చూపిస్తారు. అంటే తప్పులు చేయడం అక్కడే ప్రారంభిస్తారన్నమాట.
ఎన్నారైలను కదలేసి చూడండి, చాలామంది ‘లోకల్ వాళ్లకు బుఱ్ఱలు లేవండి, కష్టపడి పనిచేయరు, అందుకే మనకు ఢోకా లేదు’ అంటూంటారు. అక్కడ ఎవరికీ బుఱ్ఱ లేకుండా ఉంటే అంత పైకి ఎందుకు వస్తారు? వీళ్లు చూసినవారిలో అధికాంశం మంది అలా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. పోనీ అది పాక్షికంగా నిజం అనుకున్నా, మనకు తెలివితేటలు, కష్టించే గుణం ఎక్కణ్నుంచి వచ్చాయి? మనం ఎవరూ స్వయంభువు కాదు కదా! శ్రమించే లక్షణం, ఒడిదుడుకులు తట్టుకునే శక్తి, మేధస్సు తరతరాలుగా అందిస్తే వచ్చాయి. దాన్నే ఋషిఋణం అంటారు. మాతాపితృఋణానికే పంగనామాలు పెట్టే రోజుల్లో యీ ఋషిఋణం సోదెలోకి రాకుండా పోతోంది. అమ్మానాన్నలను అమెరికా తీసుకెళ్లి వాళ్ల చేత బేబీసిటింగ్ చేయిస్తే ఋణం తీర్చుకున్నట్లు కాదు.
నువ్వు ఒక కొడుకువి మాత్రమే కాదు, ఒక అల్లుడివి, మేనల్లుడివి, బాబాయివి, క్లాస్‌మేట్‌వి, కొలీగ్‌వి, స్నేహితుడివి.. యీ బాధ్యతలన్నీ నువ్వు నెరవేరుస్తున్నావా? ఇక్కడి కుటుంబాలలో ఎన్నారై ఉన్నారంటే వాళ్లు అక్కరకు రాని చుట్టాలే. శుభానికి, అశుభానికి దేనికీ రారు. ఎన్నారై పిల్లలు తమ తలిదండ్రులకు స్వావలంబన నేర్పుతారు. ‘గాంధీగారు ఆయన పనులు ఆయన చేసుకోలేదా? ఇక్కడ అమెరికాలో 80 ఏళ్ల వాళ్లు కూడా వాళ్ల పనులు వాళ్లు చేసుకుంటారు. మీరు ఆసుపత్రిలో పడినప్పుడల్లా మమ్మల్ని రమ్మనమంటే ఎలా? నేను డాక్టరుకి ఫోన్ చేసి, సరిగ్గా ట్రీట్ చేయకపోతే కేసు పెడతానని బెదిరిస్తానులే. వెళ్లి చేరండి.’ అని ధైర్యం చెప్తారు. ‘అమెరికాలో 16 ఏళ్ల నుంచి కుర్రాడు వాడి కాళ్ల మీద వాడు నిలబడతాడు. మరి నేను నీ యింజనీరింగు చదువుకి, ఫారిన్ పంపడానికి అప్పు చేసి యిచ్చానే’ అని తండ్రి అనడు. అమెరికా తండ్రి అంటాడేమో నాకు తెలియదు.
ఈ శాఖాచంక్రమణం ఆపి, నవల దగ్గరకు వస్తే – సీరియల్‌గా చదివినపుడు బాగానే ఉందనిపిస్తూనే, ఇంకా బాగా ఉండవచ్చు అనిపించింది. పుస్తకంగా చదివినపుడు అర్థమైంది, సీరియల్ పరిమితులకు లోబడి, పెద్ద కాన్వాస్‌ను కుదించారని! సాధారణంగా నవలలో సంభాషణలు ఎక్కువగా ఉంటాయి. వాటి ద్వారా పాత్రల స్వరూపస్వభావాలు తెలుస్తాయి. కానీ యీ నవల ఒక డైరీలా సాగుతుంది. స్ట్రెయిట్ నెరేషనే తప్ప యితర పాత్రలు మనసులో నాటుకోవు. పైగా ఆత్మకథ కాబట్టి, యితని వెర్షనే వింటాం. చివర్లోని ట్విస్టే మనకు ఉలిక్కిపడేలా చేస్తుంది. సినిమాలో థర్డ్ పార్టీ ద్వారా, ముఖ్యంగా అతనితో లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న హీరోయిన్ ద్వారా చెప్పడం వలన అతని మంచిచెడులు సినిమా ప్రారంభమైన అరగంటకే మనకు అర్థమౌతాయి.
సినిమా అమెరికాలో ప్రారంభమైనా, గంటన్నర పాటు సాగిన ప్రధాన కథ అంతా ఇండియాలోనే తెలిసిన వాతావరణంలో జరిగింది. నవలలో సగటు తెలుగు పాఠకుడికి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. దాన్ని విడిగా సినిమాగా తీయవచ్చు. ‘‘థాంక్యూ’’ సినిమాలో అయితే హార్ట్ ఎటాక్ ఒక వ్యక్తికి మాత్రమే వచ్చింది. నవలలో యాక్సిడెంటు జరిగిందని చెప్పారు కాబట్టి ఆ ప్రమాదంలో పద్మ, జాన్, ఎమిలీ, భార్య నందిని.. యిలా అందరూ గాయపడ్డారని చెప్పి, ప్రాణాపాయ స్థితిలో ఒక్కోరూ తమ తరఫు నుంచి గాథలు చెప్పారని కల్పించవచ్చు. ఒకే సంఘటనను తమతమ దృక్కోణంలో చెప్పే ‘‘రాషొమోన్’’ సినిమాలోలా ఒక్కోరి వెర్షన్ వినిపిస్తూ వాళ్ల హిపాక్రసీని బయటపెడితే చాలా రక్తి కడుతుందని నా భావన. అప్పుడు ఒకే సంభాషణ వేర్వేరు వ్యక్తులకు ఒక్కోలా ఎలా అన్వయించిందో అర్థమై, సినిమా మంచి చిక్కటి కాఫీలా ఉంటుంది. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2022)