ఇండస్ట్రీకి సంబంధించి చాలా విషయాలపై బోల్డ్ గా మాట్లాడే డిస్కోశాంతి, తన కొడుకు హీరోగా మారిన అంశంపై కూడా అంతే సూటిగా స్పందించారు. కొడుకు హీరోగా మారడం తనకు బొత్తిగా ఇష్టంలేదని, ఈ విషయంలో శ్రీహరి కోరిక మాత్రం నెరవేరిందని అంటున్నారామె.
“నా కొడుకులు ఎప్పటికైనా సినిమాల్లోకి వెళ్తారని బావ (శ్రీహరి) ఎప్పుడూ అంటుండేవాడు. ఇప్పుడదే జరిగింది. నాకు మాత్రం ఇష్టంలేదు. ఇండస్ట్రీకి వెళ్తానంటే నేను ఒప్పుకునేదాన్ని కాదు. పిచ్చిపిచ్చిగా మాట్లాడకంటూ బావను వారించేదాన్ని. ఒక కొడుకు డాక్టర్, మరో కొడుకు లాయర్ కావాలనేది నా కోరిక.”
అయితే తన కోరిక కంటే శ్రీహరి కోరికే బలంగా ఉందంటున్నారు డిస్కోశాంతి. అందుకే తన కొడుకు రాజ్ దూత్ సినిమాతో హీరోగా మారాడని చెప్పుకొచ్చారు. వాడి రాతను తను మార్చేలేనని, ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుందని అన్నారు. కొడుకు సినిమాకు ప్రచారం కల్పించడం కోసం మీడియా ముందుకొచ్చిన డిస్కో శాంతి, కాస్టింగ్ కౌడ్ పై మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
“అబ్బాయిలు మన మీద పడరు. మనం అలుసు ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్లు రెచ్చిపోతారు. మానసికంగా, శారీరకంగా మనం దృఢంగా ఉండాలి. అప్పుడు కాస్టింగ్ కౌచ్ లాంటివేం ఉండవు. ఇద్దరి అంగీకారంతో జరిగితే అది వేరే విషయం. బలవంతం చేయడం మాత్రం ఇండస్ట్రీలో లేదు. అలాంటిదే జరిగితే మాత్రం ప్రతి మహిళ చెప్పు తీసుకొని కొట్టాలి.”
కెరీర్ లో 900 సినిమాలు చేశానని, తనకు ఎలాంటి కాస్టింగ్ కౌచ్ ఘటనలు ఎదురుకాలేదంటున్నారు డిస్కోశాంతి. అమ్మాయిలు మాత్రం ఇండస్ట్రీలో కాస్త ధైర్యంగా ఉండాలని సలహా ఇస్తున్నారు.