వైఎస్సార్ వుండి వుంటేనా – కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణకు కాంగ్రెస్ పార్టీతో, అలాగే ఆ తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో వున్న అనుబంధం ఇంతా అంతా కాదు. వైఎస్ తన హయాంలో కృష్ణకు, విజయనిర్మలకు అనేక సాయాలు చేసారని కూడా…

సూపర్ స్టార్ కృష్ణకు కాంగ్రెస్ పార్టీతో, అలాగే ఆ తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో వున్న అనుబంధం ఇంతా అంతా కాదు. వైఎస్ తన హయాంలో కృష్ణకు, విజయనిర్మలకు అనేక సాయాలు చేసారని కూడా వార్తలు వున్నాయి. ముఖ్యంగా కొన్ని భూముల రెగ్యులరైజేషన్ వంటి విషయాల్లో ఆయన చాలా సాయం చేసారని అంటారు. అందుకే అల్లుడు గల్లా జయదేవ్ కాంగ్రెస్ నుంచి తేదేపాలోకి చేరినా, కృష్ణ కుటుంబం మాత్రం తటస్థంగానే వుండిపోయింది.

ఇదిలావుంటే భార్య విజయనిర్మల మరణించిన తరువాత కృష్ణ లేటెస్ట్ గా మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ ను తలచుకున్నారు. ఆయన వుండి వుంటే విజయనిర్మలకు పద్మభూషణ్ వచ్చి వుండేదని అన్నారు. వైఎస్సార్ నే తనకు పద్మభూషణ్ వచ్చేలా చేసారని, రెండేళ్ల తరువాత నిర్మలకు కూడా వచ్చేలా చూస్తానని మాట ఇచ్చారని కృష్ణ గుర్తు చేసుకున్నారు. కానీ ఆయన అంతలోనే మరణించారని లేదూ అంటే నిర్మలకు కూడా పద్మభూషణ్ వచ్చి వుండేదని చెప్పారు.

ఇదిలావుంటే విజయనిర్మలకు గత కొద్ది కాలంగా అల్జీమర్స్ సమస్య వచ్చిందని కృష్ణ తొలిసారి వెల్లడించారు. రెండు రోజుల క్రితం జరిగినవి గుర్తు వుండేవి కాదని, కానీ పాతికేళ్ల క్రితం సంగతులు అన్నీ గుర్తు వుండేవని, మెడపక్కన నరం బలహీనం కావడం వల్ల ఇలా జరిగిందని డాక్టర్లు చెప్పారని వివరించారు. ఇప్పటి వరకు ఈ విషయం బయట ప్రపంచానికి తెలియదు.

వికేంద్రీకరణకే వైఎస్ జగన్ మొగ్గు?