కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగం సోషల్ నెట్ వర్క్ లో అద్భుతమైన ఆదరణకు నోచుకుంది. ప్రతి ఒక్కరు పాజిటివ్ కామెంట్స్ తో ప్రసంగాన్ని ప్రశంసిస్తున్నారు. కలెక్టర్లు సమావేశంలో ముఖ్యమంత్రి సిన్సియర్ గా మాట్లాడడం అన్నది మామూలే. కానీ జగన్ మరో అడుగు ముందుకు వేసి కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. కలెక్టర్లు ఇప్పుడు ఆ స్థానంలో వుండడానికి కారణం ప్రజలే అని, వారు తనకు ఇచ్చిన అధికారం కారణంగానే తాను వారిని ఆ స్థానాల్లో వుంచగలిగానని చెప్పారు.
ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా మర్యాదగా రిసీవ్ చేసుకోవాలని వారు చెప్పిన మాటలు వినాలని, అయితే ఎమ్మెల్యే ఏ ఇల్లీగల్ యాక్టివిటీని అడిగాన మొహమాటం లేకుండా తిరస్కరించమని చెప్పేసారు. ఆ తరహా విధానం తమది కాదని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేలే కాదు, అంతకన్నా పెద్దవారు ఎవరు పోన్ చేసినా, అడిగిన అస్సలు పట్టించుకోవద్దని స్పష్టంచేసారు. ఈ విషయంలో ఎవరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
అదే విధంగా నవరత్నాల అమలులో తర తమ బేధాలు వద్దు అని, పొరపాటున తమ ఎమ్మెల్యేలు, అంతకన్నా పెద్దవారు చెప్పినా కూడా వినవద్దని మరోసారి స్పష్టంచేసారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు చిన్న బుచ్చుకోకుండా, అధికారులు, ప్రజా ప్రతినిధులు రెండు కళ్లు అని, రెండు కలిసి వుంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. జగన్ ఎంత ఇలా చెప్పినా, అధికారులను ఎమ్మెల్యేల తప్పుడు సిఫార్సులు పట్టించుకోవద్దని చెప్పడం కాస్త ఇబ్బందికర పరిణామమే.
మామూలుగానే అందరు కలెక్టర్లు ఒకలా వుండరు. ఐఎఎస్ అధికారి సరైన వారయితే అభివృద్ధి పరుగులు తీస్తుంది. అలాంటి టైమ్ లో వారు మామూలుగానే ఎవ్వరినీ ఖాతరు చేయరు. ఇక సాక్షాత్తూ సిఎమ్ ఇలా చెప్పిన తరువాత ఇక ఎమ్మెల్యేలను కలెక్టర్లు ఖాతరు చేయడం కష్టమే. అయితే ప్రజల విషయంలో మాత్రం జగన్ స్పీచ్ అదిరిపోయింది.
తాము సరైన వాడిని సిఎమ్ గా ఎన్నుకున్నామన్నా ఆనందం సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో కనిపిస్తోంది. అందువల్ల ఇక ఎమ్మెల్యేలు లోలోపల మధన పడాల్సిందే తప్ప, ఒకరు మరొకరితో కూడా చెప్పుకుని బాధపడడానికి లేదు. నెల రోజుల్లోనే జగన్ తనేంటో జనాలకు చూపించేసాడు. ఇంకా ఇంకా చూపించేస్తున్నాడు. ఇక ఎవ్వరూ ఏమీచేసేది లేదు. నచ్చినా నచ్చకున్నా శభాష్ అనాల్సిందే.