ప్రత్యేక హోదాపై అడుగుతూ వుండడమేనా.?

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదని గతంలోనే తేలిపోయింది. మరోసారి బీజేపీ దేశంలో అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రావడంతో ప్రత్యేక హోదా అన్న అంశం గురించిన చర్చే అనవసరం ఇప్పుడు. ఈ విషయం…

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదని గతంలోనే తేలిపోయింది. మరోసారి బీజేపీ దేశంలో అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రావడంతో ప్రత్యేక హోదా అన్న అంశం గురించిన చర్చే అనవసరం ఇప్పుడు. ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ఎన్నికల ఫలితాలు వెల్లడయిన వెంటనే గుర్తించారు. ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీని కలిసిన తర్వాత, 'అడుగుతాం.. అంతకన్నా ఏం చేయగలం.?' అని ఆయన నిర్వేదం వ్యక్తం చేయడాన్ని ఎవరైనా ఎలాగైనా తప్పు పట్టొచ్చుగాక.! నిజం ఎప్పుడూ చేదుగానే వుంటుంది. 

కేంద్రంలో బీజేపీకి సరైన మెజార్టీ వచ్చి వుండకపోతే మాత్రం, పరిస్థితి ఇంకోలా వుండేది. ఇక, నరేంద్ర మోడీ సర్కార్‌ పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదాపై పాత పాటే పాడింది. ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తేల్చి చెప్పారు. తెలుగువారి కోడలు ఆర్థిక మంత్రి అయ్యారని సంతోషించాలో.. లేదంటే, ఆమె ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా లేదన్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితి. ఆమె మాత్రం ఏం చేస్తారు.? అక్కడ అంతా డిసైడ్‌ చేసేది నరేంద్ర మోడీనే కదా.! 

ప్రత్యేక హోదా లేదు, ప్యాకేజీ ఇస్తున్నామని చంద్రబాబు హయాంలోనే కేంద్రం ప్రకటించింది. చంద్రబాబు పండగ చేసుకున్నారు.. అసెంబ్లీలో హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అని తీర్మానం కూడా చేసేశారు. కానీ, ఆ ప్యాకేజీ కూడా రాష్ట్రానికి రాలేదాయె. ఇప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ముందున్న తక్షణ కర్తవ్యం, కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా నిధులు రాబట్టడం. ఎలాగూ ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే వుంటామని చెబుతున్నారు గనుక.. ఆ పని ఆల్రెడీ షురూ చేశారు గనుక.. ఆ ప్రక్రియ అలా అలా కొన'సాగు'తూనే వుంటుంది. 

సరే, ఇంకో ఐదేళ్ళ తర్వాత అయినా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వస్తుందా.? అంటే, ప్చ్‌.. కష్టమే. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ప్రత్యేక హోదా కోసం ప్రజా పోరాటాలు తప్పనిసరి.. అంటున్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష వున్నట్లు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో ప్రత్యేక హోదా పట్ల అంతటి చిత్తశుద్ధి లేదని తేల్చేశారు జనసేనాని. అక్కడికేదో పవన్‌ కళ్యాణ్‌, చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించేసినట్లు.!