కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా మరోసారి కేసీఆర్-హరీష్ రావ్ రచ్చ తెరపైకి వచ్చింది. గతంలో ప్రాజెక్టు పనుల్ని దగ్గరుండి చూసుకున్న హరీష్ ను, ప్రారంభోత్సవానికి పిలవకపోవడాన్ని సోషల్ మీడియాలో చాలామంది వ్యతిరేకిస్తున్నారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవడానికి బీజేపీ సిద్ధమైంది.
హరీష్ ను తమ పార్టీలోకి లాగేందుకు ఇప్పటికే పలు దఫాలు ప్రయత్నించిన బీజేపీ, ఇప్పుడు కాళేశ్వరం అంశాన్ని మరోసారి వాడుకొని, అతడికి గాలం వేసే ప్రయత్నాల్లో ఉంది. ఇన్నాళ్లూ కింగ్ మేకర్ లా ఉన్న హరీష్ ను రాష్ట్రానికి కింగ్ ని చేస్తామంటూ ఆఫర్లిస్తోంది. కానీ హరీష్ ఎందుకో ఆ దిశగా ఆలోచస్తున్నట్టు లేదు. టీఆర్ఎస్ తో తనకున్న అనుబంధాన్ని తెంచుకోవాలని అనుకోవట్లేదు. కానీ ఇలా పిలవకుండా అవమానిస్తే మాత్రం ఏదో ఒకరోజు హరీష్ మనసు ముక్కలైపోతుంది.
హరీష్ ప్రాధాన్యం తగ్గించబట్టే లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ఆశించిన స్థాయి విజయం దక్కలేదని అంటారు విశ్లేషకులు. స్టార్ క్యాంపెయినర్ గా హరీష్ రావు పేరును ఫస్ట్ లిస్ట్ లో చేర్చకపోవడాన్ని అప్పట్లో ఆయన అభిమానులు పెద్ద అవమానంగా ఫీలయ్యారు. మంత్రిపదవి ఇవ్వకపోవడం, ఆర్టీసీకి చెందిన మరో పదవి వదులుకోమని చెప్పడం.. లాంటి పనులు హరీష్ ను అప్పట్లో ఇబ్బంది పెట్టాయి.
ఆ టైమ్ లోనే హరీష్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది బీజేపీ. తమనేతల ద్వారా తెరవెనక సంప్రదింపులు జరిపింది. కానీ హరీష్ ఒక్కసారిగా తెరపైకొచ్చి తను ఏ పార్టీకి వెళ్లనని, టీఆర్ఎస్ లోనే కొనసాగుతానని సీరియస్ గా ప్రకటించడంతో బీజేపీ సైలెంట్ అయింది. అలా కొన్నాళ్లుగా సైలెంట్ అయిన ఆ పార్టీకి ఇప్పుడు కాళేశ్వరం ఇష్యూ ఆయాచిత వరంగా మారింది. ఇప్పటికే మనసులో రగిలిపోతున్న హరీష్ కు మరిన్ని మాటలు చెప్పి తమ పార్టీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తోంది.