టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చేసిన ఘాటు వ్యాఖ్యలు సృష్టించిన దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాజకీయ కౌంటర్లు, ఎన్కౌంటర్లతో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం తిట్ల పురాణానికి దిగారు. ఒకరిపై మరొకరు వ్యక్తిగత విమర్శలకు దిగారు. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది.
కాంగ్రెస్ పార్టీని వీడి అధికార టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కార్యకర్తలకు ఇచ్చిన పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్లోకి ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో స్పందించారు.
తమను రాళ్లతో కొడితే, చెప్పులతో సమాధానం చెబుతామని దీటైన కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు నీచంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కోట్లకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతో గెలిచి ఇప్పుడు వారిపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారని మండి పడ్డారు.
అందుకే వారిని తరిమి కొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారని గుర్తు చేశారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచి గెలవాలని ఆమె సవాల్ విసిరారు. తప్పుడు కూతలు మానుకోకుంటే ప్రజలే రాళ్లతో కొడతారని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.