రాష్ట్ర‌ప‌తి వ‌ల్ల ఆ రాష్ట్రంలో బీజేపీకి అధికారం ద‌క్కేనా!

మోడీ, అమిత్ షాలు ఏం చేసినా దాని వెనుక పెద్ద లెక్క ఉంటుంద‌నేది రాజ‌కీయ పండితులు చెప్పే మాట‌. అడుగ‌డుగునా రాజ‌కీయ వ్యూహాల‌కు అనుగుణంగానే వీరి నిర్ణ‌యాలు ఉంటాయ‌నేది త‌ర‌చూ వినిపించే విశ్లేష‌ణే.  Advertisement…

మోడీ, అమిత్ షాలు ఏం చేసినా దాని వెనుక పెద్ద లెక్క ఉంటుంద‌నేది రాజ‌కీయ పండితులు చెప్పే మాట‌. అడుగ‌డుగునా రాజ‌కీయ వ్యూహాల‌కు అనుగుణంగానే వీరి నిర్ణ‌యాలు ఉంటాయ‌నేది త‌ర‌చూ వినిపించే విశ్లేష‌ణే. 

మోడీ గ‌డ్డం పెంచ‌డం వెనుక కూడా ఏదో రాష్ట్రం ఎన్నిక‌లు ఉంటాయంటారు! మ‌రి ఇంత‌లా రాజ‌కీయాన్ని శ్వాసించే ఈ అగ్ర‌నేత‌లు రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి ద్రౌప‌ది ముర్మును ఎంపిక చేయ‌డం వెనుక దేశం మొత్తం మీదా నిమ్న వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త అనే సందేశాన్ని ఇవ్వ‌డ‌మే కాదు, ప్ర‌త్యేకించి ఒడిశాలో అధికారాన్ని చేప‌ట్ట‌డం అనే టార్గెట్ కూడా ఉందంటారు.

భార‌తీయ జ‌న‌తా పార్టీకి మొద‌టి నుంచి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ‌ర్గాలు దూరంగా ఉంటాయి. అగ్ర‌కులాల పార్టీగా బీజేపీ పేరు తెచ్చుకుంది త‌న ప్ర‌స్థానంలో. ఇలాంటి క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని త‌మ‌కు దూరం అనుకున్న వ‌ర్గాల‌కు ఇవ్వ‌డం బీజేపీ పాటించే ఆన‌వాయితీ. అబ్దుల్ క‌లాం, రామ్ నాథ్ కోవింద్, ఇప్పుడు ద్రౌప‌ది ముర్ము.. ముగ్గురూ పై స‌మీక‌ర‌ణాల‌కు అనుగుణంగా రాష్ట్ర‌ప‌తులు అయ్యార‌నే విశ్లేష‌ణ‌లున్నాయి. ముర్ము ఎంపిక ద్వారా ఎస్టీల‌ను బీజేపీ ద‌గ్గ‌ర చేసుకునే ప్ర‌య‌త్నం చేసింద‌ని అనుకోవాలి. 

ఇక ప్ర‌త్యేకించి ఒడిశా బీజేపీకి ఉన్న టార్గెట్ స్టేట్ ల‌లో ఒక‌టి. బీజేపీకి వ్య‌తిరేకి కాక‌పోయిన‌ప్ప‌టికీ.. న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌భుత్వాన్ని దించి, తాము అక్క‌డ గ‌ద్దెనెక్కాల‌ని క‌మ‌లం పార్టీ గ‌ట్టి ప్ర‌య‌త్నాల్లోనే ఉంది. అయితే ఒడిశాలో క‌మ‌లానికి ప‌ట్టు చిక్క‌డం లేదు. ఇప్ప‌టికే కేంద్ర‌మంత్రి ప‌ద‌వులు కూడా ఆ రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు ఇచ్చింది.  ఇప్పుడు ద్రౌప‌ది ముర్ముకు రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి ద్వారా అక్క‌డి ట్రైబ‌ల్స్ ను క‌మ‌లం పార్టీ అక్కున చేర్చుకునే య‌త్నం చేస్తోంది. 

ఏకంగా 23 శాతం ఎస్టీలు ఉన్న రాష్ట్రం అది! 12 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అయితే..గిరిజ‌నుల శాతం 55!ఇలా ఒడిశా రాజ‌కీయంలో ట్రైబ‌ల్స్ డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్. 147 అసెంబ్లీ సీట్లున్న ఒడిశాలో 24 సీట్లు ట్రైబ‌ల్స్ కు రిజ‌ర్వ్డ్. వీటిల్లో బిజూ జ‌న‌తాద‌ళ్ కు తిరుగులేని బ‌లం ఉంది. 20 ఎస్టీ రిజ‌ర్వ్డ్ సీట్ల‌లో బీజేడీ ఎమ్మెల్యేలున్నారు. స‌రిగ్గా ఆ నియోజ‌క‌వ‌ర్గాల‌నే ఇప్పుడు బీజేపీ టార్గెట్ గా చేసుకుంది. 

ఎస్టీకి రాష్ట్ర‌ప‌తి ప‌దవి అనే సానుకూల ప్ర‌చారానికి తోడు, త‌మ ల‌క్ష్యంలో ఒక‌టైన ఒడిశాలో పాగా వేయ‌డానికి కూడా ముర్ము ఎంపిక క‌మ‌లం పార్టీకి అద‌నపు అస్త్రం అనేది ఇప్పుడు వినిపిస్తున్న విశ్లేష‌ణ‌. మ‌రి రాష్ట్ర‌ప‌తితో ఎన్నిక‌ల ప్ర‌చారం అయితే చేయించ‌లేరు కాబ‌ట్టి, ఈ ఎంపిక ఓటర్ల‌ను ఏ మేర‌కు ప్ర‌భావితం చేస్తుంద‌నేది ఇప్పుడు అంచ‌నా వేయ‌లేని అంశ‌మే!