చాలామంది సాధారణంగా వేసే ప్రశ్న యిది. కొందరు తమకు తామే సమాధానం కూడా చెప్పేసుకుంటూ ఉంటారు, ఔను అని. సినీరంగంలో కాని, రాజకీయరంగంలో కాని ఎన్టీయార్ వచ్చేదాకా కమ్మలకు ఏ ప్రాధాన్యతా లేదని, ఎన్టీయార్ కులాభిమానం వలననే వాళ్లు పైకి వచ్చారని అనుకుంటారు వాళ్లు. కొంతమంది యింకా ముందుకు వెళ్లి అసలు వాళ్లు ధనికులైనదే తెలుగుదేశం హయాం వచ్చాక అనుకుంటారు. తెలుగునాట కమ్మలు అనేక రంగాల్లో ఎప్పణ్నుంచో దూసుకుపోతూ వచ్చారు. విద్య, ఉద్యోగాలలో బ్రాహ్మణులతో, వ్యవసాయంలో రెడ్లతో, వ్యాపారంలో వైశ్యులతో, చొరవ, తెగింపులలో కాపులతో – యిలా అందరితో పోటీ పడుతూ, వేరే ప్రాంతాలకు విస్తరిస్తూ చొచ్చుకుపోయారు. ఎంటర్‌ప్రెనార్‌షిప్‌లో వారిది అందె వేసిన చేయి. శతాబ్దాల క్రితమే వాళ్లు తమిళనాడులో కూడా పాతుకుపోయి వర్ధిల్లారు. భూములు ఎక్కడ చవకగా దొరికితే అక్కడకు వెళ్లి కొని, వ్యవసాయం చేస్తూ నిలదొక్కుకున్నారు. సినిమా రంగంలో ఎన్టీయార్ అడుగు పెట్టడానికి ముందే ఎల్వీ ప్రసాద్, చక్రపాణి, కెయస్ ప్రకాశరావు, గూడవల్లి రామబ్రహ్మం వంటి కమ్మలు స్థిరపడి వున్నారు. ఇవన్నీ విస్మరిస్తే ఎలా?
ఇక రాజకీయాలకు వస్తే ఎన్టీయార్ వచ్చేవరకు మనకు కమ్మ ముఖ్యమంత్రి లేడన్నమాట వాస్తవమే. అంతమాత్రం చేత కమ్మలు రాజకీయాల్లో లేరని అనగలమా? ఆ మాటకు వస్తే యిప్పటివరకు కాపు ముఖ్యమంత్రి రాలేదు. మరి వాళ్లు రాజకీయాల్లో లేరా? జరిగినదేమిటంటే – కమ్మలలో కొందరు రాజకీయ ప్రముఖులు కాంగ్రెసుకు దూరంగా ఉన్నారు. కొంతకాలం జస్టిస్ పార్టీ, మరి కొంతకాలం కమ్యూనిజం, యింకొంతకాలం ఎన్జి రంగాగారి కృషికార్, స్వతంత్ర యిత్యాది పార్టీలు – యిలా ప్రయోగాలు చేశారు. నిజానికి యివేమీ వాళ్ల ఒంటికి పడలేదు. కొందరు నాయకుల విషయంలో ఐతే వారు ప్రవచించే కమ్యూనిజం, సహజమైన భూస్వామ్య లక్షణం రెండు పొసగలేదు. మురారి గారు తన ఆత్మకథ ''నవ్విపోదురు గాక..'' లో యీ వైరుధ్యాన్ని బాగా పట్టుకుని తెలియచెప్పారు. ఆంధ్ర రాష్ట్రం విడిగా ఉండగా కృష్ణా, గుంటూరు జిల్లాలలో కమ్యూనిస్టు ఉద్యమం జోరుగా సాగడానికి కారణం కమ్మల మద్దతే. అక్కడే బెంగాల్ విప్లవనాయకుల పేర్లు బెనర్జీ, చటర్జీ, బోసు వినబడతాయి.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక, తెలంగాణ రాష్ట్రం కలవడంతో మొత్తం రాష్ట్రం మీద చూస్తే కమ్యూనిస్టు ప్రభావం తగ్గుముఖం పట్టింది. 1952లో ఆంధ్రలో కమ్యూనిస్టులు 35% సీట్లు తెచ్చుకోగా, 1962లో ఆంధ్రప్రదేశ్‌లో 17% సీట్లు మాత్రమే తెచ్చుకోగలిగారు. పైగా ఆ తర్వాత కమ్యూనిస్టులు చీలిపోయారు కూడా. ఈ లోగా రెడ్లలో చాలామంది కాంగ్రెసునే అంటిపెట్టుకుని లాభపడ్డారు. ఆ విషయం గ్రహింపుకి వచ్చేసరికి, యితర కులాల వాళ్లు కూడా కాంగ్రెసువైపే మొగ్గు చూపారు. కాంగ్రెసుపైకి సామ్యవాదం పేరు చెప్పినా, దళితకులాలకు, మైనారిటీలకు మేలు చేస్తామని చెప్పుకున్నా ఆచరణలో అది యథాతథ పార్టీ అని, పెట్టుబడిదారులకే, అగ్రకులాలకే మేలు చేస్తుందని వీరర్థం చేసుకున్నారు. అందువలన కమ్మలు కూడా కాంగ్రెసులో బాగానే చేరారు. కాంట్రాక్టులు అవీ తెచ్చుకున్నారు. వ్యాపారాలు చేశారు, పదవులు సంపాదించుకున్నారు, పైకి వచ్చారు. కాంగ్రెసు పాలనలో రెడ్లు బాగుపడ్డారని, టిడిపి పాలనలో కమ్మలు బాగుపడ్డారని జనరల్‌గా అనేస్తారు కానీ డబ్బున్నవాళ్లకి ఎవరి పాలనలోనైనా పనులు జరుగుతూనే ఉంటాయి. 1983లో టిడిపి అధికారంలోకి వచ్చేవరకు కమ్మలు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాలేదా? రాష్ట్రంలో, కేంద్రంలో మంత్రులు కాలేదా?
ఇందిరా గాంధీ అధికారంలో నిలదొక్కుకున్నాక ప్రతి రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలను మార్చేసిందని రాశా కదా. ఆంధ్రప్రదేశ్‌లో రెడ్డి, కమ్మ కులాలు భూస్వాములుగా, వ్యాపారస్తులుగా బలపడడమే కాక రాజకీయంగా పలుకుబడి సంపాదించి మోతుబర్లుగా ఉన్నారని గ్రహించిందామె. వీళ్లు తన వెంటే ఎప్పుడూ వుంటారన్న నమ్మకం లేదు. అందువలన వారి ప్రాభవాన్ని తగ్గించి, యితర కులాలలను, బిసిలను, ఎస్సీలను, మైనారిటీలను, డబ్బు లేనివారిని రాజకీయంగా పైకి తీసుకుని వచ్చి, వాళ్లు తనకు ఎప్పటికీ విధేయులుగా వుండేట్లు చూసుకుందా మనుకుంది. (తర్వాతి రోజుల్లో ఎన్టీయార్ బిసిలతో యిదే ప్రయోగం చేశారు) 1972 అసెంబ్లీ ఎన్నికలలో యీ ప్రయోగాన్ని అమలు చేద్దామనుకుంది. ఏ బలమూ లేని బ్రాహ్మణుణ్ని ముఖ్యమంత్రిగా పెట్టడంతో బాటు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మహమ్మద్ ఇస్మాయిల్ అనే కాకినాడ ముస్లిముని నియమించింది. బిసి నాయకుడిగా పేరుబడిన టి. అంజయ్యను (ఈయన ముఖ్యమంత్రయ్యాక తను 'రెడ్డి'నని, కానీ బిసిలకు దత్తు పోయానని చెప్పుకున్నాడు) ఉపాధ్యక్షుడిగా పెట్టింది.
15 మందితో ఎన్నికల కమిటీ పెట్టింది. బ్రహ్మానంద రెడ్డి, అతని అనుచరుడు విజయభాస్కరరెడ్డిలకు యీ కమిటీలో స్థానం యివ్వలేదు. 1967లో రెడ్లకు 69 సీట్లు కేటాయించగా యీసారి 47 మాత్రమే యిచ్చారు. అలాగే కమ్మలకు 47 సీట్ల నుంచి 29కి తగ్గించారు. తక్కిన అగ్రవర్ణాలకు గతంలో 53 యిస్తే యీసారి 49 మాత్రమే యిచ్చారు. మొత్తం సీట్లలో యీ మూడు వర్గాలకు కలిపి 46% యిచ్చారు. ఇక బిసిలకు 64, మైనారిటీలకు 20, తక్కినవి ఎస్సీ, ఎస్టీలకు యిస్తూ మొత్తంలో 30 మంది మహిళలు ఉండేట్లు చూశారు. 230 మంది సిటింగ్ ఎమ్మెల్యేలలో 116 మందికి మాత్రమే టిక్కెట్లు యిచ్చారు. దెబ్బకి 14 మంది మాజీ ఎమ్మెల్యేలతో సహా 200 మంది అసంతృప్త కాంగ్రెసు వాదులు ఎన్నికలలో తిరుగుబాటు అభ్యర్థులుగా నిలబడ్డారు. దాంతో 97 మందిని సస్పెండు చేశారు. 300 మందిని పార్టీలోంచి తీసేశారు. అలా సస్పెండైన వారిలో జలగం వెంగళరావు, బ్రహ్మానంద రెడ్డి సోదరుడు కాసు వెంగళరెడ్డి కూడా ఉన్నారు.
ఎన్నికలలో ఇందిరా ప్రభంజనం వీచింది. కులంతో, అభ్యర్థితో ప్రమేయం లేకుండా ఆమె నిలబెట్టిన వాళ్లంతా గెలిచారు. 287 స్థానాలుంటే కాంగ్రెసు 219 (76%), 52% ఓట్లు గెలిచింది. దాని మిత్రపక్షమైన సిపిఐకు 6% ఓట్లు, 7 సీట్లు. దాన్ని వ్యతిరేకించిన సిపిఎంకు 3% ఓట్లు, 1 సీటు. స్వతంత్రులు 57. స్వతంత్ర పార్టీకి రెండు సీట్లే. 26 మంది మహిళలు, 10 మంది ముస్లిములు గెలిచారు. దీనికి కారణం – వెనుకబడిన వర్గాలు, కులాలు, బలహీనవర్గాలు ఇందిర 'గరీబీ హటావో' నినాదాన్ని నమ్మి, ఆరాధించి, ఆమె వెంట నిలిచారు. ఓట్లు కురిపించారు. భూస్వామి, ధనికవర్గాల వారే ఆమెకు వ్యతిరేకంగా నిలబడ్డారని, ఆమెకు బలాన్ని అందించి, వారిని అదుపు చేయాలని వాళ్లు కోరుకున్నారు, సాధించారు.
1983 నాటి ఎన్టీయార్ నాటి రాజకీయాల గురించి చెప్తానంటూ 1972 నాటి రాజకీయాల గురించి యింత విపులంగా ఎందుకు చెప్తున్నా ననుకుంటున్నారా? ఆంధ్రలో తెలుగుదేశం ఆవిర్భవించాక ఏ వర్గాలు దాని వెనుక నిలిచి కాంగ్రెసుపై, సరిగ్గా చెప్పాలంటే ఇందిరపై కసి తీర్చుకున్నాయో చెప్పడానికే యిదంతా. ఇది తెలుసుకోకుండా, కేవలం ముఖ్యమంత్రులను మార్చారనో, తెలుగువాడి ఆత్మాభిమానం దెబ్బ తిందనో, ఎన్టీయార్ సాక్షాత్తూ కృష్ణుడే అని వెర్రి జనాలు నమ్మారనో తీర్మానాలు చేసేస్తే సరియైన చిత్రం గోచరించదు. ఎన్నికల తర్వాత కొందరు పివిని తీసేయాలని పట్టుబట్టారు కానీ ఇందిర వాళ్లను అదలించి నోరు నొక్కారు. ఎందుకంటే ఆమె ఎజెండా యింకా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో భూస్వామి వర్గాలను రాజకీయంగా దెబ్బ తీస్తే సరిపోదని, ఆర్థికంగా కూడా దెబ్బ తీస్తే కానీ అణగరని ఆమె భావించారు. అందుకే దేశంలో తక్కిన చోట్ల చేయకపోయినా ఆంధ్రలో భూసంస్కరణలు అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.
పివి కాక మరొక ముఖ్యమంత్రైతే అది రాజకీయంగా అది రిస్కని అడ్డుపడేవారు. కానీ పివికి అలా అడ్డుపడేటంత స్తోమత లేదు. పైగా ఆయన సిద్ధాంతరీత్యా యీ సంస్కరణలకు అనుకూలుడు. అందువలన సరేనన్నాడు. 1972 సెప్టెంబరులో భూసంస్కరణల బిల్లు పాసయింది. అంతకు ముందు జులైలో అర్బన్ లాండ్ సీలింగ్ చట్టం వచ్చింది. రెడ్డి, కమ్మ, క్షత్రియ వంటి భూస్వామ్య కులాలన్నీ పివిపై, ఇందిరపై పగబట్టాయి. బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యాయి. పివి ఆదర్శం మంచిదే కానీ, దాన్ని అమలు చేయడానికి, యీ శక్తులను ఎదుర్కొనడానికి తగిన రాజకీయ శక్తి ఆయనకి లేకపోయింది. పైగా తన ప్రతిక్షకులకు ఆయనే స్వయంగా ఒక ఆయుధాన్ని అందించారు. తెలంగాణలో స్థానికులకు రిజర్వేషన్ కల్పించే ముల్కీ నిబంధనలపై కేసు సుప్రీంకోర్టులో నలుగుతోంది. ముల్కీ నిబంధనలు చెల్లుతాయని కోర్టు తీర్పు రాగానే పివి హర్షం ప్రకటిస్తూ 'ముల్కీ సమస్యకు యిదే తుది పరిష్కారం' అన్నారు.
అది ఆంధ్ర ప్రాంతపు భూస్వామ్య వర్గాలకు అందివచ్చింది. భూ సంస్కరణలు వచ్చిన నెలలోపే పివి తెలంగాణ పక్షపాతి అని ఆరోపిస్తూ విద్యార్థుల ఉద్యమం ప్రారంభమైంది. పివి ఏలూరులో ఒక సభకు వస్తే అవమానించి పంపించారు. అక్టోబరు 24 నుంచి ఎన్జిఓలు సమ్మె మొదలుపెట్టారు. మొదట్లో ముల్కీ రద్దు, లేదా రాష్ట్ర విభజన అన్నారు. తర్వాత్తర్వాత రాష్ట్ర విభజన తప్పనిసరి అన్నారు. 1972 చివరకు వచ్చేసరికి జై ఆంధ్ర ఉద్యమం పరాకాష్టకు చేరింది. పివి పంచాయితీ రాజ్, జిల్లా పరిషత్తులు రద్దు చేయడానికి సమకట్టడం వలన స్థానిక కాంగ్రెసు నాయకులందరూ ఆయనపై కత్తి కట్టారు. ఇందిర రాష్ట్రవిభజన ససేమిరా కుదరదన్నారు. ఇక్కడ తమాషా ఏమిటంటే జై ఆంధ్ర ఉద్యమాన్ని నడిపించినది, ఎదిరించినదీ కూడా కాంగ్రెసు నాయకులే. అటూయిటూ వాళ్లే.
సంస్కరణల ప్లాను ఇందిరదే ఐనా, అమలు చేసినది పివి కాబట్టి, ఆయనను ముఖ్యమంత్రిగా తీసేయాలని ఆంధ్ర కాంగ్రెసు నాయకులు, భూస్వామ్యవర్గాలు పట్టుబట్టాయి. భవిష్యత్తులో యిక ఏ ముఖ్యమంత్రీ యింతటి తీవ్రనిర్ణయాలు తీసుకోకుండా చేయాలని ప్రయత్నం కాబోలు. నిజంగా ఆ తర్వాత ఆ వర్గాల జోలికి ఎవరూ వెళ్లలేదు – ఉద్యోగుల విషయంలో తీవ్రనిర్ణయాలు తీసుకున్నారు, కొన్ని సందర్భాలలో కొన్ని వ్యాపారవర్గాల పట్ల తీసుకున్నారు తప్ప! భూసంస్కరణలు నామమాత్రంగా మిగిలాయి. 1973 జనవరిలో పివిని ముఖ్యమంత్రిగా తీసివేసి, గవర్నరు పాలన పెట్టడంతో యీ భూస్వామి వర్గాలు క్రమేపీ చల్లారాయి. కాంగ్రెసు వాళ్లకి లోపల్లోపల బేరాలు కుదిరిపోయాయి. ఆరుసూత్రాల పథకం అని పెట్టి ఉద్యమాన్ని నీరు కార్చేశారు. ఉద్యమానికి విరాళాలు యిచ్చేవారు లేకపోయారు. 1973 ఫిబ్రవరిలో కమ్మ కులస్తుడైన కొత్త రఘురామయ్యను కేంద్ర కాబినెట్‌లోకి ఇందిర తీసుకోవడంతో కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఉద్యమం ఉధృతి తగ్గింది. అప్పటిదాకా ఉద్యమానికి మద్దతిచ్చిన ఎన్జి రంగా అనుయాయులు కూడా ఇందిరను సమర్థించ సాగారు. 1973 ఏప్రిల్ నాటికి ఉద్యమం నామమాత్రంగా మిగిలింది.
గవర్నరు పాలన 11 నెలలు గడిచాక, పివి స్థానంలో మరో ముఖ్యమంత్రిని నియమించ వలసిన అవసరం వచ్చింది. తెలంగాణ వ్యక్తి పదవీకాలం పూర్తి కాలేదు కాబట్టి, యింకో తెలంగాణ నాయకుడికే అధికారం యివ్వాలి. రెడ్డి లేదా కమ్మ పాలన తెచ్చే ఉద్దేశం ఇందిరకు లేదు. అందువలన వాళ్లిద్దరూ కాకుండా వెలమ కులానికి చెందిన జలగం వెంగళరావుకి యిచ్చారు. రెడ్డి కాడు కాబట్టి కమ్మలు వెంగళరావుకి అండగా నిలిచారు. వెంగళరావు 1973 డిసెంబరులో అధికారంలోకి వచ్చి 1978 మార్చి వరకు పాలించారు. ఈయన అందరికీ ఆప్తుడిగానే మెలిగాడు. పెద్దగా అసమ్మతిని ఎదుర్కోలేదు కూడా. ఎందుకంటే బ్రహ్మానందరెడ్డి కేంద్రమంత్రి అయిపోయారు. చెన్నారెడ్డి యుపి గవర్నరుగా వెళ్లిపోయారు. అయితే పివి మాత్రం కేంద్రమంత్రిగా వెళ్లి ఇందిరకు సన్నిహితుడిగా మెలగుతూ, వెంగళరావుకు వ్యతిరేకంగా పని చేసిన బసిరెడ్డిని ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఏది ఏమైనా 1975 జూన్‌లో ఎమర్జన్సీ విధించడంతో, వెంగళరావుకి ముప్పు లేకుండా పోయింది. ఉత్తరాదితో పోలిస్తే ఎమర్జన్సీ అత్యాచారాలు ఆంధ్రలో తక్కువే జరిగాయి.
1977లో ఎమర్జన్సీ ఎత్తివేసి ఎన్నికలకు వెళితే జనతా పార్టీ ఉత్తరాదిన బ్రహ్మాండమైన విజయం సాధించింది. దాంతో యిక్కడ కూడా జనతా పార్టీ వెలిసింది. ఇందిర కారణంగానే కాంగ్రెసు పార్టీ ఘోరంగా ఓడిపోయిందంటూ ఆమెను పార్టీలోంచి బహిష్కరించారు. పార్టీ చీలింది. బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షుడిగా కాంగ్రెసు (ఆర్) అనే పార్టీ ఏర్పడితే వెంగళరావు దానిలో చేరారు. ఇందిర తను అధ్యక్షురాలిగా కాంగ్రెసు (ఐ) ఏర్పరిస్తే గవర్నరుగా పదవి పోయిన చెన్నారెడ్డి వచ్చి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యారు. 1978 అసెంబ్లీ ఎన్నికలలో ఈ కాంగ్రెసు (ఆర్), కాంగ్రెసు (ఐ), జనతా పార్టీ పోటీ పడ్డాయి.
(ఫోటో – జలగం వెంగళరావు)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2019)
[email protected]
ఎమ్బీయస్: ఎన్టీయార్ – 01 ఎమ్బీయస్: ఎన్టీయార్ – 02 ఎమ్బీయస్: ఎన్టీయార్ – 03
ఎమ్బీయస్: ఎన్టీయార్ – 04 ఎమ్బీయస్: ఎన్టీయార్ – 05 ఎమ్బీయస్: ఎన్టీయార్ – 06
ఎమ్బీయస్: ఎన్టీయార్ – 07 ఎమ్బీయస్: ఎన్టీయార్ – 08 ఎమ్బీయస్: ఎన్టీయార్ – 09
ఎమ్బీయస్: ఎన్టీయార్ – 10 ఎమ్బీయస్: ఎన్టీయార్ – 11 ఎమ్బీయస్: ఎన్టీయార్ – 12
ఎమ్బీయస్: ఎన్టీయార్ – 13 ఎమ్బీయస్: ఎన్టీయార్- 14 ఎమ్బీయస్: ఎన్టీయార్- 15