క్రికెట్ లెజెండ్స్ అందరినీ మరిపిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ మరో అద్భుత ఘనతను సాధించాడు. గత కొన్నేళ్లుగా అద్భుతమైన ఫామ్ తో కొనసాగుతున్న ఈ క్లాస్ ఆటగాడు.. మరో గొప్ప ఫీట్ ను సాధించాడు. వన్డే క్రికెట్లో అత్యధిక వేగంగా పదివేల పరుగులను పూర్తి చేసి విరాట్ రికార్డుల పుటల్లో కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేశాడు. వన్డేల్లో పదివేల పరుగులు చేయడమే అత్యంత అరుదైన అంశం. అందులోనూ ఫాస్టెస్ట్ టెన్ థౌజెండ్ రన్స్ అంటే.. విరాట్ రేంజ్ ఏమిటో చెబుతోంది.
తన 205 వన్డే ఇన్నింగ్స్ లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు కొహ్లీ. ఈ ఘనత సాధించిన ఐదో భారత బ్యాట్స్ మన్ విరాట్. కొహ్లీ కన్నా మునుపు ఇండియాకు సంబంధించి సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, మహేంద్ర సింగ్ ధోనీలు వన్డేల్లో పదివేల పరుగులు, అంతకు మించి సాధించారు. అయితే వారందరికన్నా వేగంగా పదివేల పరుగులను పూర్తిచేశాడు విరాట్.
పదివేల పరుగులను సాధించడానికి సచిన్ కు 259 ఇన్నింగ్స్ లు పట్టాయి. గంగూలీకి 263 ఇన్నింగ్స్ లు పట్టాయి. రికీపాంటింగ్ 266వ ఇన్నింగ్స్ తో పదివేల పరుగులను పూర్తిచేశాడు. కలీస్ 272వ ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ ను పూర్తిచేశాడు. ఆ లెజెండ్స్ రికార్డులను అధిగమనిస్తూ.. అతి తక్కువ ఇన్నింగ్స్ లలో పదివేల రన్నులను పూర్తిచేసి విరాట్ క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.
ఇక ఈరోజు విండీస్ తో జరిగిన రెండోవన్డేతో ఈ ఫీట్ ను పూర్తిచేసిన విరాట్ ఇదే సమయంలో తన కెరీర్ లో 37వ వన్డే సెంచరీని కూడా కంప్లీట్ చేశాడు. విరాట్ దూకుడు చూస్తూ ఉంటే… సచిన్ పేరుతో ఉన్న అత్యధిక వన్డే సెంచరీల రికార్డును తన పేరు మీదకు మార్చుకోవడానికి మరెంతో సమయం తీసుకునేలా లేడు!