ద్రోహులెవ‌రో తేల్చుకుందాం…బాబుకు స‌వాల్‌!

రాయ‌ల‌సీమ ద్రోహులెవ‌రో, న్యాయం చేసిందెవ‌రో తేల్చుకుందామ‌ని చంద్ర‌బాబునాయుడికి మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి స‌వాల్ విసిరారు. సాగునీటి ప్రాజెక్టుల సంద‌ర్శ‌న కోసం సీమ‌లో చంద్ర‌బాబు ఇవాళ్టి నుంచి ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పెద్దిరెడ్డి…

రాయ‌ల‌సీమ ద్రోహులెవ‌రో, న్యాయం చేసిందెవ‌రో తేల్చుకుందామ‌ని చంద్ర‌బాబునాయుడికి మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి స‌వాల్ విసిరారు. సాగునీటి ప్రాజెక్టుల సంద‌ర్శ‌న కోసం సీమ‌లో చంద్ర‌బాబు ఇవాళ్టి నుంచి ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. చంద్ర‌బాబు క‌నీసం త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గాన్ని కూడా ప‌ట్టించుకోలేద‌ని విమ‌ర్శించారు.

రాయ‌ల‌సీమ‌కు దివంగ‌త వైఎస్సార్‌, ఆ త‌ర్వాత ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్ పాల‌న‌లోనే న్యాయం జ‌రిగింద‌ని మంత్రి తెలిపారు. సీమ‌కు సాగునీటిని అందించే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేట‌ర్ సామ‌ర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కుల‌కు వైఎస్సార్ హ‌యాంలో పెంచార‌ని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. దీన్ని 80 వేల క్యూసెక్కుల‌కు పెంచేందుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు. సీమ‌లో సాగునీటి ప్రాజెక్టుల ప‌నులు కొన‌సాగుతున్నాయ‌న్నారు. ఇవేవీ చంద్ర‌బాబుకు క‌న‌ప‌డ‌వ‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

చంద్ర‌బాబు ముందుగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఎవ‌రి పాల‌న‌లో ఏం జ‌రిగిందో చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాల్ విసిరారు. ఆ త‌ర్వాత సాగునీటి ప్రాజెక్టుల సంద‌ర్శ‌న‌కు వెళ్లాల‌ని ఆయ‌న సూచించారు. కుప్పంలో సైతం ఆయ‌న‌తో చ‌ర్చ‌కు రెడీ అని పెద్దిరెడ్డి సంసిద్ధ‌త వ్య‌క్తం చేశారు. క‌నీసం త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గానికి సాగు, తాగునీటిని ఇవ్వ‌ని నాయ‌కుడు చంద్ర‌బాబు అని విమ‌ర్శించారు.

రాయ‌ల‌సీమ‌పై ఏ మాత్రం మ‌మ‌కారం లేని వ్య‌క్తి చంద్ర‌బాబు అని ఆయ‌న దెప్పి పొడిచారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే చంద్ర‌బాబుకు సీమ గుర్తుకు రావ‌డం ఆశ్చ‌ర్యం క‌లుగుతోంద‌న్నారు. చిత్తూరు జిల్లాలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకోబోమ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.