కాశ్మీర్ లోయ గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో భగ్గుమంటోందంటే దానికి కారణం బుర్హాన్ వనీ మరణమే. చిన్న వయసులోనే కరడుగట్టిన తీవ్రవాదిగా మారిన బుర్హాన్ వనీ, ఏడాది క్రితం ఎన్కౌంటర్లో మృతి చెందాడు.
అప్పటిదాకా కాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు కాస్త అటూ ఇటూగా వున్నా, బుర్హాన్ వనీ మరణంతో పరిస్థితి చెయ్యిదాటిపోయింది. యువత పెద్దయెత్తున రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేయడం, భద్రతాదళాలపై దాడులకు తెగబడ్డం చూస్తూనే వున్నాం.
బుర్హాన్ వనీ మరణం తర్వాత కాశ్మీర్లో జరిగిన అల్లర్లలో పెద్ద సంఖ్యలో యువత ప్రాణాలు కోల్పోయారు. సైన్యం సంగతి సరే సరి. అటు సైన్యం, ఇటు యువత.. నెత్తురోడారు కాశ్మీర్లో. అయినా కాశ్మీర్లో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. తాజాగా బుర్హాన్ వనీ వర్ధంతి సందర్భంగానూ కాశ్మీర్లో అల్లర్లు చోటుచేసుకున్నాయి.
అయితే, బుర్హాన్ వనీ తండ్రి ముజఫర్ అహ్మద్ వనీ మాత్రం కాశ్మీర్లోయలోని యువతకు శాంతి సందేశం పంపించారు. తన కుమారుడి వర్ధంతి రోజున రక్తపాతం వద్దంటూ యువతకు పిలుపునిచ్చారాయన. ఓ తీవ్రవాది తండ్రి, శాంతి సందేశం పంపడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు.
బుర్హాన్ వనీ తండ్రి పిలుపు పట్ల భద్రతా దళాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని దుష్ట శక్తుల కారణంగా కాశ్మీర్ యువత పెడతోవన నడుస్తోందనీ, కాశ్మీర్ ప్రజలకు రక్షణగా నిలవడమే తమ బాధ్యత అనీ, అయితే యువత మాత్రం తమను శతృవులుగా చూస్తోందని సైన్యం చెబుతోంది.
బుర్హాన్ వనీ వర్దంతి రోజున కాశ్మీర్ అట్టుడికిపోవాలంటూ పాకిస్తాన్ ప్రేరేపిత వేర్పాటువాదులు కాశ్మీర్ లోయలో పోస్టర్లు అంటించగా, అలాంటివారికి బుర్హాన్ వనీ తండ్రి శాంతి సందేశం చెంపపెట్టులా మారింది.