సినిమా రివ్యూ: కాటమరాయుడు

రివ్యూ: కాటమరాయుడు రేటింగ్‌: 2.5/5 బ్యానర్‌: నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. తారాగణం: పవన్‌కళ్యాణ్‌, శృతిహాసన్‌, రావు రమేష్‌, తరుణ్‌ అరోరా, అజయ్‌, శివబాలాజీ, అలీ, చైతన్యకృష్ణ, కమల్‌ కామరాజు, నాజర్‌, పృధ్వీ తదితరులు కథ:…

రివ్యూ: కాటమరాయుడు
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌:
నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి.
తారాగణం: పవన్‌కళ్యాణ్‌, శృతిహాసన్‌, రావు రమేష్‌, తరుణ్‌ అరోరా, అజయ్‌, శివబాలాజీ, అలీ, చైతన్యకృష్ణ, కమల్‌ కామరాజు, నాజర్‌, పృధ్వీ తదితరులు
కథ: శివ, భూపతిరాజా
కథనం: వేమారెడ్డి
మాటలు: శ్రీనివాస్‌రెడ్డి
కూర్పు: గౌతంరాజు
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మురెళ్ళ
నిర్మాత: శరత్‌ మరార్‌
దర్శకత్వం: కిషోర్‌కుమార్‌ పార్ధసాని
విడుదల తేదీ: మార్చి 24, 2017

తెలుగులోకి అనువాదమై, విడుదలైన 'వీరమ్‌' చిత్రాన్ని పవన్‌కళ్యాణ్‌ రీమేక్‌ చేయాలని నిర్ణయించుకోవడం ఆశ్చర్యపరచింది. అయితే ఎప్పుడూ యంగ్‌ క్యారెక్టర్లు చేస్తుండే పవన్‌ని నలుగురు తమ్ముళ్ల అన్నయ్యగా, ఫ్యాక్షన్‌ లీడర్‌గా చూడబోతున్నామనేది ఎక్సయిట్‌ చేసింది. 'వీరమ్‌' ఇతివృత్తాన్ని తీసుకుని పవన్‌ ఇమేజ్‌కి అనుగుణంగా మార్పుచేర్పులైతే చేసారు కానీ 'అవుట్‌డేటెడ్‌' అయిపోయిన ఆ సబ్జెక్ట్‌ని కొత్తగా మాత్రం ప్రెజెంట్‌ చేయలేకపోయారు. కొత్తదనం లేకపోయినా కనీసం హీరోని పవర్‌ఫుల్‌గా చూపించి, మాస్‌ని ఎక్సయిట్‌ చేసే సన్నివేశాలతో నడిపించి వున్నా మిగతాది పవన్‌ చూసుకునేవాడు. 

'కాటమరాయుడు' మొదటి సీన్‌లో ఎంత పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడో, ఆ తర్వాతి సీన్‌కి వెళ్లేసరికి అంత మెత్తబడిపోతాడు. ఫస్ట్‌ సీన్‌లో చూపించిన పవర్‌… మళ్లీ అతడి పేరు చెబితేనే ఒకడు బెదిరిపోయి స్కూలు బిల్డింగ్‌ పట్టాలు చేతిలో పెట్టినప్పుడు కానీ కనిపించదు. మొదటి సీన్‌ సినిమా మొదట్లో వస్తే, రెండో సీన్‌ సెకండాఫ్‌ సగంలో వస్తుంది. మధ్యలో కాటమరాయుడు కండబలం చూపించే ఫైట్లు రెండు, మూడు వచ్చిపోతాయి కానీ ఆ క్యారెక్టర్‌ తాలూకు పవర్‌ తెలిసే సన్నివేశాలేం వుండవు. 

ఆడవాళ్లంటే పడని అన్నయ్యకి పెళ్లి చేస్తే తప్ప తమ జీవితాలు ప్రేమించిన వాళ్లతో సెటిల్‌ కావని తమ్ముళ్లు అన్నయ్యని ప్రేమలో పడేయాలని ప్లాన్‌ చేస్తారు. వాళ్లు అనుకున్న అమ్మాయితో కాకుండా కాటమరాయుడు మరొక యువతితో (శృతి) కనెక్ట్‌ అవుతాడు. స్త్రీ ద్వేషి అయిన కాటమరాయుడు ఆమెని ప్రేమించడానికి బలమైన కారణాలేమీ చూపించరు. ఆమెకి, ఆమె తండ్రికి హింస అంటేనే పడదు. కాటమరాయుడుకి కత్తి పట్టకపోతే పని జరగదు. ఈ కాన్‌ఫ్లిక్ట్‌ని ఎలా జయించి ఆమె కుటుంబానికి దగ్గరవుతాడనేది కథ. 

ప్రథమార్ధం అన్నీ రొటీన్‌ సన్నివేశాలతోనే సాగినప్పటికీ సాఫీగానే వెళ్లిపోతుంది. ద్వితీయార్ధం పూర్తిగా గాడి తప్పుతుంది. హీరోయిన్‌ని తిరిగి గెలుచుకోవడానికి హీరో ఆమె ఇంటికి వెళ్లడం, వాళ్ల ఫ్యామిలీకి సమస్య వుండడంతో అది వాళ్లకి తెలియనివ్వకుండా అతడే పరిష్కరించడం, ఈ క్రమంలో వాళ్లు అతడిని అపార్ధం చేసుకుని వెళ్లిపొమ్మనడం, చివరకు నిజం తెలుసుకుని అతడిని తమతో కలుపుకోవడం ఇలా చాలా చప్పగా, రొటీన్‌గా వెళుతూ విసిగిస్తుంది. ఇలాంటి రొటీన్‌ వ్యవహారాలు తప్పనప్పుడు కామెడీతో కప్పిపుచ్చుకోవడం చేస్తుంటారు. కానీ ఇందులో అలా కవర్‌ చేసే కామెడీ లేకపోవడంతో పూర్తిగా యాక్షన్‌ ఎపిసోడ్స్‌ మీదే డిపెండ్‌ అయ్యారు. అలీ, పృధ్వీ వున్నప్పటికీ హాయిగా నవ్వించే కామెడీ సీన్‌ ఒక్కటీ లేకపోయింది. చివరకు కామెడీకి సైతం పవన్‌ మీదే ఆధారపడాల్సి వచ్చింది. ప్రేమను వ్యక్తపరచడం రాని కాటమరాయుడు తన లవ్‌ ప్రపోజ్‌ చేసే సీన్‌, తనని కాదనుకుని ఆమె వెళ్లిపోయిన తర్వాత తిరిగి ఆమెని మెప్పించడానికి చేసే ప్రయత్నాలు సరదాగా అనిపిస్తాయి. 

కథలోకి లీనం చేసే కాన్‌ఫ్లిక్ట్‌ లేకపోవడానికి తోడు బలహీనంగా సాగే కథనం, అంతకంటే బలహీనమైన విలన్స్‌ ఏ దశలోను కాటమరాయుడు పట్ల ఆసక్తి కలిగించవు. మాస్‌ సినిమాల్లో, అందునా హీరోది అంతటి పవర్‌ఫుల్‌ క్యారెక్టరు అయినప్పుడు గుర్తుండిపోయే సన్నివేశాలు కనీసం రెండు, మూడయినా వుంటాయి. ఇందులో రిపీట్‌ వేల్యూ వున్న సీన్‌ ఒక్కటీ లేకపోవడం విచిత్రం. వినాయక్‌, బోయపాటి శ్రీను లాంటి డైరెక్టర్లు ఇలాంటి రొటీన్‌ కథలని జనరంజకంగా ప్రెజెంట్‌ చేస్తుంటారు. కిషోర్‌ కుమార్‌ పార్ధసాని దర్శకుడిగా అలాంటి అడిషనల్‌ మెరుపులేమీ జోడించలేదు. స్క్రిప్టు పరంగా ఉన్న బలహీనతల్ని వినోదభరిత సన్నివేశాలతోనో, ఉద్వేగపూరిత సంభాషణలతోనో కవర్‌ చేయడానికి సహజంగా దర్శకులు ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్‌ పెడుతుంటారు. కానీ కాటమరాయుడు బలహీనతలన్నీ పవన్‌కళ్యాణే కవర్‌ చేసేస్తాడన్నట్టు అతడి మీదే వాలిపోయి కంప్లీట్‌గా పవన్‌ స్టార్‌ పవర్‌ మీదే ఆధారపడిపోయారు. పవన్‌కళ్యాణ్‌ తన అభిమానుల్ని అయితే అలరిస్తాడు కానీ ఒక సాధారణ స్క్రిప్టుతో మిగిలిన వారిని ఎంతవరకు శాటిస్‌ఫై చేయగలడు? ఎంత పెద్ద స్టార్‌ ఉన్నప్పటికీ అల్టిమేట్‌గా స్క్రిప్టులో మేటర్‌ ఉండాలనేది ఎందుకు తెలుసుకోరు? 

కాటమరాయుడి గెటప్‌లో పవన్‌కళ్యాణ్‌ చాలా బాగున్నాడు. తను రెగ్యులర్‌గా చేసే యూత్‌ఫుల్‌ క్యారెక్టర్స్‌కి భిన్నంగా మెచ్యూర్డ్‌గా కనిపించిన పవన్‌ కొత్తగా అనిపిస్తాడు. అతని నటన, హావభావాలు, హాస్య చతురత ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. శృతిహాసన్‌ ఎందుకో ఒకింత ఆడ్‌గా కనిపించింది. ఆమె స్టయిలింగ్‌ కూడా ఆకట్టుకోలేదు. తమ్ముళ్లలో అజయ్‌, శివబాలాజీ ఉనికి నిలుపుకుంటారు. రావు రమేష్‌ పాత్రకి డెకరేషన్లు వున్నాయి కానీ కథలో ఎఫెక్టివ్‌ రోల్‌ లేదు. తరుణ్‌ అరోరా తేలిపోయాడు. అలీ, పృధ్వీకి నవ్వించే స్కోప్‌ ఇవ్వలేదు. నాజర్‌ రెగ్యులర్‌ క్యారెక్టర్‌లోనే కనిపించారు. 

మాస్‌ సినిమాకి రిపీట్‌ వేల్యూ తెచ్చిపెట్టాల్సిన పాటలు స్కోర్‌ చేయడంలో అనూప్‌ ఫెయిలయ్యాడు. టైటిల్‌ సాంగ్‌ మినహా ఏదీ ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం ఒకింత ఫర్వాలేదు కానీ టాప్‌ రేటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. సంభాషణల పరంగాను స్టార్‌ రైటర్‌ లేని వెలితి బాగా తెలిసింది. సినిమాటోగ్రఫీ బాగానే వుంది. రామ్‌ లక్ష్మణ్‌ పోరాటాలని తీర్చిదిద్దిన విధానం బాగుంది. పవన్‌ తర్వాత ఈ చిత్రానికి ఫైట్లే ప్రధానాకర్షణగా నిలిచాయి. నిర్మాణ విలువలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ పరంగా శ్రద్ధ తీసుకోవాల్సింది. ఒక సూపర్‌స్టార్‌ సినిమాకుండాల్సిన లుక్‌ అండ్‌ ఫీల్‌ మిస్‌ అయ్యాయి. 

ఓవరాల్‌గా 'కాటమరాయుడు' రొటీన్‌ కథ, కథనాలతో పవన్‌ ఫాన్స్‌ని, మాస్‌ ఆడియన్స్‌ని టేకిట్‌ ఫర్‌ గ్రాంటెడ్‌గా తీసుకుని చేసేసిన అటెంప్ట్‌లా అనిపిస్తుంది. రాతలోను, తీతలోను 'పాస్‌ అయిపోతుందిలే' అనే ధోరణి తప్ప 'గుర్తుండిపోవాలి' అంటూ పెట్టిన ఎఫర్ట్స్‌ కనిపించవు. పవన్‌ అభిమానులు ఒకింత శాటిస్‌ఫై అయినప్పటికీ సగటు సినీ ప్రేక్షకుడికి మాత్రం టికెట్‌కి సరిపడా వినోదాన్ని ఇవ్వడంలో కాటమరాయుడు సక్సెస్‌ అవలేదు.

బాటమ్‌ లైన్‌: కష్టం రాయుడూ!

గణేష్‌ రావూరి