నిన్నమొన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సాధించిన అరుదైన, అపూర్వమైన ఘనవిజయాన్ని చూశాం. ఒకేసారి నూటనాలుగు ఉపగ్రహాలను మోసుకెళ్లిన రాకెట్ వాటిని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అగ్రరాజ్యమైన అమెరికాకు చెందిన ఉపగ్రహాలు కూడా వాటిల్లో ఉన్నాయి. ఇస్రో సాహసం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. అంతరిక్షంలో అద్భుత విజయాలు సాధిస్తున్న భారతీయులు 125 అడుగుల విగ్రహాన్ని తయారుచేయలేరా? ఒకసారి చరిత్రలోకి వెళితే అద్భుతమైన, కళ్లుచెదిరే శిల్పసంపదతో కూడిన భారీ దేవాలయాలు, ఇతర నిర్మాణాలు కనబడతాయి. భారతీయుల ప్రతిభకు పట్టం కట్టే నిర్మాణాలెన్నో ఉన్నాయి. అయినా ఇప్పటి పాలకులు భారీ విగ్రహాలు తయారుచేయాలంటే విదేశాల వైపే చూస్తున్నారు. ఈ విషయంలో మన పొరుగు దేశమైన చైనాకు అగ్రతాంబూలం ఇస్తున్నారు. ఈ తాంబూలం ఇచ్చేవారిలో తెలుగు పాలకులూ అగ్రస్థానంలోనే ఉన్నారు. చైనా మనకు విదేశమైనా మరోవిధంగా చూస్తే అది దేశంలో భాగమేనేమోననిపిస్తుంది.
మన మార్కెట్లో ఎక్కడ చూసినా చైనా ఉత్పత్తులే కనిపిస్తాయి. కొంతకాలం క్రితం చైనా బియ్యం కూడా దిగుమతయ్యాయి. సరిహద్దుల్లోనే కాదు, దేశంలోకి చొచ్చుకొస్తున్న చైనాను మన పాలకులు నెత్తిన పెట్టుకొని మన నాయకుల విగ్రహాలనే కాదు దేవుళ్ల ప్రతిమలు కూడా వారినే తయారుచేయంటున్నారు. భారత దేశంలో భారీ విగ్రహాలు తయారుచేసే శిల్పులు లేరా? ఉన్నా వారిపై పాలకులకు చిన్నచూపా? వివిధ రాష్ట్రాల పాలకులకు భారీ విగ్రహాల పిచ్చి బాగా తలకెక్కింది. పే…ద్ద విగ్రహాలు నెలకొల్పి ఆ విగ్రహాలకు సంబంధించిన సామాజిక వర్గాలను ఆకట్టుకొని ఓట్లు సంపాదించాలలనేది రాజకీయ నాయకుల వ్యూహం. దేవుడి విగ్రహాలు ప్రజల్లో సెంటిమెంటును పెంచడానికి దోహదం చేస్తాయి. ఇక అసలు విషయానికొస్తే…తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని నెలకొల్పాలని చాలాకాలం క్రితమే నిర్ణయించింది. అమరావతిలోనూ ఇదే పని చేయబోతోంది ఏపీ ప్రభుత్వం. అంబేద్కర్ విగ్రహాన్ని తయారుచేసే శిల్పులు కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణలోనే కాదు ఇండియాలోనే కనబడలేదు. అందుకే చైనావాళ్లతో తయారుచేయాలని నిర్ణయించింది.
చైనాలో భారీ విగ్రహాలు తయారుచేసే ఏరోసన్ కంపెనీ ఉంది. ఆ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకునేందుకు ప్రభుత్వం డిప్యూటీ సీఎం కమ్ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నేతృత్వంలో ఓ బృందాన్ని పంపింది. ఆ కంపెనీతో ఎన్ని కోట్ల ఒప్పందం కుదుర్చుకుంటారో…! కేసీఆర్ ప్రభుత్వం చైనావాళ్లతో మరో భారీ విగ్రహం చేయించాలని ఇదివరకే నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి. ఇది ఆంజనేయస్వామి విగ్రహం. యాదాద్రిని (యాదగిరి గుట్ట) తిరుమల మాదిరిగా చేయాలని, అంతటి ప్రాశస్త్యం కల్పించాలని, దానికి అంతర్జాతీయంగా ఆధ్యాత్మికపరమైన ఇమేజ్ తీసుకురావాలని అధికారంలోకి వచ్చినప్పటినుంచి కేసీఆర్ తాపత్రయపడుతున్నారు. మంచిదే. ఎవ్వరూ కాదనడంలేదు. ప్రజాసమస్యల పరిష్కారానికి చూపనంతటి శ్రద్ధ యాదాద్రి అభివృద్ధి మీద చూపిస్తున్నారు. ఆలయాలను, పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేస్తే ప్రజలు సంతోషిస్తారని కేసీఆర్‌కు తెలుసు.
తిరుమలవంటి ఆలయం తెలంగాణలో ఉందంటే అది కేసీఆర్ పుణ్యమేనని ప్రజలు తరతరాలకు చెప్పుకుంటారు. మతపరమైన, ఆధ్యాత్మికపరమైన సెంటిమెంట్లను నిరంతరం కాపాడుతుంటే రాజకీయంగా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అందులో భాగమే ప్రభుత్వపరంగా పుష్కరాలు, బోనాలు, బతుకమ్మలు వగైరాలు నిర్వహించడం. యాదాద్రిని ఆకర్షణీయంగా తయారుచేయడంలో భాగంగా అత్యంత ఎత్తయిన (108 అడుగులు) ఆంజనేయస్వామి విగ్రహాన్ని నెలకొల్పాలని కేసీఆర్ సంకల్పించారు. ఈ భారీ విగ్రహాన్ని చైనా శిల్పుల చేత తయారుచేయించాలని నిర్ణయించారు. గుజరాత్‌లో తొలి భారత హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని (182 మీటర్లు) 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' పేరుతో నెలకొల్పాలని సంకల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ ప్రాజెక్టును కూడా చైనాకే అప్పగించారు. ఒకప్పుడు గొప్ప శిల్పులకు కాణాచి అయిన భారత్‌లో ఇప్పుడు అలాంటివారు లేరని పాలకులు ఎందుకు భావిస్తున్నారో…!