సెహ్వాగ్.. బ్రిటిషర్ కు ఇంకో పంచ్!

క్రికెట్ మైదానంలో ఎంత డ్యాషింగ్ గా వ్యవహరించేవాడో.. రిటైర్మెంట్ అనంతరం ట్విటర్ ఫీల్డ్ లో అంతే స్థాయి ఫామ్ ను కనబరుస్తున్న వీరేంద్ర సెహ్వాగ్ ఇప్పుడు బ్రిటిషర్ పీర్స్ మోర్గన్ కు మరో పంచ్…

క్రికెట్ మైదానంలో ఎంత డ్యాషింగ్ గా వ్యవహరించేవాడో.. రిటైర్మెంట్ అనంతరం ట్విటర్ ఫీల్డ్ లో అంతే స్థాయి ఫామ్ ను కనబరుస్తున్న వీరేంద్ర సెహ్వాగ్ ఇప్పుడు బ్రిటిషర్ పీర్స్ మోర్గన్ కు మరో పంచ్ ఇచ్చాడు. టీమిండియా కబడ్డీ ప్రపంచకప్ ను గెలిచిన నేపథ్యంలో ఆ ఇంగ్లండ్ జర్నలిస్టును టార్గెట్ చేశాడు వీరూ.

వీరిద్దరికీ ట్విటర్ లో కొనసాగుతున్న మాటల యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. ఒలింపిక్స్ లో ఇండియా ప్రదర్శనను కించపరుచూస్తూ  మోర్గాన్ మొదలుపెట్టాడు. అనుచితమైన మాటలు మాట్లాడిన ఆ బ్రిటిషర్ కు వీరూ తన ట్వీట్ల ద్వారా సమాధానం ఇచ్చాడు. ఒలింపిక్స్ ఇండియా ప్రదర్శనను పేర్లు పెడుతున్న మోర్గన్ క్రికెట్ లో తమ జట్టు ప్రదర్శన గురించి ఆలోచించుకోవాలని వీరూ నొక్కి చెప్పాడు. ఆ తర్వాత వీళ్ల మాటల యుద్ధం కొనసాగుతోంది.

ఇటీవల కబడ్డీ మ్యాచ్ లో ఇండియా ఇంగ్లండ్ ను ఓడించడంపై వీరూ స్పందిస్తూ.. ఇంగ్లండ్ మరోసారి ఓడిపోయిందని అన్నాడు. ఆ ట్వీట్ లో వీరూ.. “లూజ్(ఓటమి)’’ పదానికి స్పెల్లింగ్ తప్పుగా రాశాడని మోర్గాన్ కౌంటరిచ్చాడు. అక్కడే అతడు దొరికిపోయాడు.  ‘అవును.. ఆ మాటకు బ్రిటిషర్లకు మాత్రమే స్పెల్లింగ్ చాలా కరెక్టుగా తెలుస్తుంది.. ఎందుకంటే.. ఓడిపోవడం వాళ్లకు బాగా అలవాటు..’ అంటూ ట్విటిజనులు మోర్గన్ కు పంచ్ లేశారు!

ఈ పరంపరలో.. కబడ్డీ ప్రపంచకప్ లో ఇండియా విజయానంతరం వీరూ స్పందిస్తూ..”ఇండియా కబడ్డీని ఇన్వెంట్ చేసింది… ప్రపంచకప్ ను ఎనిమిదోసారి గెలిచింది.. క్రికెట్ ను కనుగొన్న దేశస్థులు మాత్రం స్పెల్లింగ్ తప్పులను చూస్తూ గడుపుతున్నారు..’’ అంటూ మోర్గాన్ కు  మనశ్శాంతి లేకుండా చేశాడు. దీనిపై మోర్గాన్ స్పందించాడు. కబడ్డీ అసలు క్రీడే కాదు.. అంటూ తొండి వాదన చేస్తున్నాడు. మరి కబడ్డీ క్రీడే కానప్పుడు.. ఇంగ్లండ్ ఎందుకు తన జట్టును ఈ ప్రపంచకప్ కు పంపినట్టు? ఈ మాటకు ఆ బ్రిటిషర్ సమాధానం ఇవ్వగలడా?!