సరదాకి: విశ్వ విజేత మన ‘నిప్పు’

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దోమలపై యుద్ధం ప్రకటించారు. ఇంకేముంది, ఎక్కడి దోమలు అక్కడే ఆత్మహత్య చేసేసుకోవాలి. లేదంటే, చంద్రబాబు దోమల భరతం పట్టేస్తారు. ఎందుకంటే, ఆయన విశ్వ విజేత,…

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దోమలపై యుద్ధం ప్రకటించారు. ఇంకేముంది, ఎక్కడి దోమలు అక్కడే ఆత్మహత్య చేసేసుకోవాలి. లేదంటే, చంద్రబాబు దోమల భరతం పట్టేస్తారు. ఎందుకంటే, ఆయన విశ్వ విజేత, ఓటమి ఎరుగని పోరాటయోధుడు. 

హైద్రాబాద్‌ని నిర్మించిందెవరు.? నారా చంద్రబాబునాయుడు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాన్ని కనిపెట్టిందెవరు.? నారా చంద్రబాబునాయుడు. క్రికెట్‌ని కనిపెట్టిందెవరు.? నారా చంద్రబాబునాయుడు. ఒబామాకి పాఠాలు చెప్పిందీ, హిట్లర్‌కి రాజకీయ వ్యూహాలు నేర్పిందీ.. అన్నీ చంద్రబాబే. అవును, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. అందుకే, ముందస్తు హెచ్చరిక.. దోమలు వున్నపళంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి మాయమైపోవాల్సిందే. ఆ తర్వాత ఆయన ఆ మిషన్‌ని దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ, ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అమలు చేసేసి, దోమలపై పోరులో విశ్వ విజేతగా నిలిచిపోతారు. 

కామెడీ కాకపోతే దోమల మీద కొత్తగా చంద్రబాబు చేసే యుద్ధమేంటి.? చిన్నప్పుడు, భుజాన క్యాన్లు వేసుకుని, వాటితో మురికి కాల్వలపై దోమల లార్వాల్ని అరికట్టేందుకు మందుల్ని పిచికారీ చేసేవారు. వీధుల్లో పొగ గొట్టాలు మామూలే. కానీ, అప్పట్లో ఈ స్థాయిలో దోమల కారణంగా రోగాలు లేవు. ఇప్పుడే కొత్తగా వచ్చి పడ్డాయి డెంగ్యూ, చికున్‌ గన్యా లాంటి రోగాలు. దోమ కన్పిస్తే భయపడాల్సిన రోజులివి. 

మరి, దోమల్ని అరికట్టడానికి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు ఏంటట.? అనడక్కండి. అదంతే. గట్టిగా అడిగారో, ఓ వంద కోట్లో, వెయ్యి కోట్లో దోమల ఖాతాలో వేసేసుకుని, తమ జేబులు నిపేసుకుంటారు. దోమలపై దండయాత్ర కూడా అలాంటి గొప్ప పధకమే. కోట్లు గాల్లో కలిసిపోతాయ్‌.. దోమలు మాత్రం వృద్ధి చెందుతాయ్‌.. మనుషులు మాత్రం మటాషైపోవాల్సిందే. ఇదీ చంద్రబాబుగారి దోమలపై దండయాత్ర పధకం తాలూకు ఉద్దేశ్యం. 

హుద్‌ హుద్‌ తుపాను నుంచి విశాఖ కోలుకుందట. ఏదీ ఎక్కడ.? అని విశాఖ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆనాటి గాయానికి దెబ్బతిన్న సామాన్యులు ఇంకా కోలుకోలేదు. కోలుకున్నాకే విశాఖ నుంచి వెళ్తానని చెప్పిన చంద్రబాబు, మమ అన్పించేశారంతే. అలా ఆయన నాలుగైదు రోజులకే హుద్‌హుద్‌ దెబ్బ నుంచి కోలుకున్నారు. అఫ్‌కోర్స్‌.. ఆయనకు అసలు ఆ దెబ్బ తగిలితే కదా.! ఇప్పుడు దోమలపై దండయాత్ర కూడా అంతే. ఆయన దోమలపై దండయాత్ర చేసేస్తారు.. దోమలు మాత్రం ప్రజలపై దండయాత్ర చేస్తూనే వుంటాయి. ఎనీ డౌట్స్‌.?