ఎలగెలగ.. పవన్‌ సహకరించలేదా.?

పవన్‌కళ్యాణ్‌ తెలుగుదేశం పార్టీకిగానీ, భారతీయ జనతా పార్టీకిగానీ సహకరించలేదట. పవన్‌ ఇవ్వలేకపోయిన సహకారాన్ని జూనియర్‌ ఎన్టీఆర్‌, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇవ్వగలుగుతాడట. అందుని, పవన్‌కళ్యాణ్‌ని 'డంప్‌' చేసి, జూనియర్‌ ఎన్టీఆర్‌ని నారా చంద్రబాబునాయుడు…

పవన్‌కళ్యాణ్‌ తెలుగుదేశం పార్టీకిగానీ, భారతీయ జనతా పార్టీకిగానీ సహకరించలేదట. పవన్‌ ఇవ్వలేకపోయిన సహకారాన్ని జూనియర్‌ ఎన్టీఆర్‌, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇవ్వగలుగుతాడట. అందుని, పవన్‌కళ్యాణ్‌ని 'డంప్‌' చేసి, జూనియర్‌ ఎన్టీఆర్‌ని నారా చంద్రబాబునాయుడు పిలిపించుకున్నారట. కామెడీకి అయినా హద్దుంటుంది.. కానీ, పచ్చ కామెడీకి హద్దూ అదుపూ వుండదంతే.! ఇంతకన్నా పెర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ఇంకేమన్నా కావాలా.? 

'వాడకం'లో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. ఒకప్పుడు, ఎన్టీఆర్‌ని కాలదన్నేశారు.. ఆ తర్వాత ఎన్టీఆర్‌ ఇమేజ్‌తో పబ్లిసిటీ స్టంట్లు చేశారు, చేస్తున్నారు. ఇది సీనియర్‌ ఎన్టీఆర్‌ వ్యవహారం. జూనియర్‌ ఎన్టీఆర్‌ విషయానికొస్తే, 2009 ఎన్నికల్లో 'బుడ్డోడ్ని' ఎడాపెడా వాడేసుకున్నారు చంద్రబాబు. అవసరం తీరాక, ఎడమకాలితో తన్నేశారు. అవును మరి, కొడాలి నాని వ్యవహారంలో, జూనియర్‌ ఎన్టీఆర్‌ని బాలకృష్ణతో తిట్టించిన ఘనత చంద్రబాబుది. ఆ దెబ్బతో, జూనియర్‌ ఎన్టీఆర్‌ టీడీపీకి దూరమయ్యారు. 

మళ్ళీ ఇప్పుడు, జూనియర్‌ ఎన్టీఆర్‌ని టీడీపీ దువ్వుతోందట. దానికి నిదర్శనం, పుష్కరాల కోసం మంత్రులు, జూనియర్‌ ఎన్టీఆర్‌ని ఆహ్వానించడమేనట. 2019 ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌ జనసేన పార్టీని ఒంటరిగా బరిలోకి దింపుతాడు కాబట్టి, ఈలోగా జూనియర్‌ ఎన్టీఆర్‌ని దువ్వాలన్నది చంద్రబాబు స్కెచ్‌ అట. చంద్రబాబు స్కెచ్‌ అదిరింది.. దానికి పచ్చ మీడియా కలర్‌ ఇంకా అదిరింది. అప్పుడు, ఎన్టీఆర్‌ని నిందిస్తూ ఇదే పచ్చమీడియా అల్లిన కథనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడేమో, జూనియర్‌ ఎన్టీఆర్‌ని టీడీపీతో పాటు, పచ్చమీడియా కూడా భుజాన వేసేసుకుంటోంది. 

చరిత్రను మర్చిపోతే ఎలా.? జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన చాలా సినిమాల్ని ఇదే పచ్చ మీడియా తొక్కేసింది. తొక్కేయడమంటే అలా ఇలా కాదు.. బాలయ్య ఫ్యాన్స్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాలు చూడకూడదని నందమూరి అభిమానులు తీర్మానించుకున్నారట.. నాన్సెన్స్‌.. అని ఇతర హీరోల అభిమానులు కూడా అనుకున్నారు అప్పట్లో. ఇవన్నీ జూనియర్‌ ఎన్టీఆర్‌ అంత తేలిగ్గా ఎలా మర్చిపోతాడు.? ఏమో, మర్చిపోతాడేమో.! రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా. 

అన్నట్టు, మొన్నటికి మొన్న జరిగిన టీడీపీ మహానాడులో ఎక్కడా జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తావన లేదు. పైగా, జూనియర్‌ ఎన్టీఆర్‌కి ఏమాత్రం ఛాన్స్‌ ఇచ్చినా, లోకేష్‌ని తొక్కేస్తాడన్న భయం చంద్రబాబులో కనిపిస్తోంది. పచ్చమీడియా సంగతి సరే సరి. 

సరేగానీ, టీడీపీకీ – బీజేపీకి పవన్‌కళ్యాణ్‌ సమర్థించడంలేదని ఎవరన్నారు.? పవన్‌కళ్యాణ్‌ ఎప్పుడన్నా టీడీపీని, బీజేపీని విమర్శించాడా.? లేదే.! రాజధాని భూ సమీకరణ విషయంలో ఆకస్మిక ప్రదర్శనలు (బాధిత రైతుల్ని కన్‌ఫ్యూజన్‌ చేయడానికి పవన్‌ చేసిన పర్యటనలు) ఎలా మర్చిపోగలం.? ప్రత్యేక హోదా గురించి ట్విట్టర్‌లో కామెంటేసి ఊరుకున్నాడు పవన్‌కళ్యాణ్‌. ఇంకెలా సహకరించాలట.? 

చంద్రబాబు చెప్పే కల్లబొల్లి కబుర్లలా ప్రత్యేక హోదా అవసరంలేదు, ఆంధ్రప్రదేశ్‌ అద్భుతంగా అభివృద్ధి చెందేస్తోందని పవన్‌కళ్యాణ్‌ చెప్పాలేమో.! ఇది చంద్రబాబు ఆశలా.? పచ్చ మీడియా ఆలోచనలా.? 

కొసమెరుపు: 2019 నాటికి జనసేన అనే పార్టీ ఒకటుంటుందా? పార్టీ పెట్టి, రెండున్నరేళ్ళు అవుతున్నా.. ఆ పార్టీకి ఇంకా కార్యవర్గమే లేదు.. అసలు రాజకీయాలపై పవన్ కళ్యాణ్ క్లారిటీతోనే లేరు. ఆయనేదో పార్టీని జనంలోకి తీసుకెళ్ళిపోతారని భయపడి, జూనియర్ ఎన్టీఆర్ వైపు దీనంగా చూస్తే అంతకన్నా భావదారిద్ర్యం ఇంకేమన్నా వుంటుందా?