ఎమ్బీయస్‌: నూతిలోంచి సూదెలా వస్తుంది?

మేం పిల్లలుగా వుండగా మావయ్యో, బాబయ్యో కథ చెప్తానని మొదలెట్టేవారు.  Advertisement ''ఒక నూతి గట్టు మీద ఒక ముసలమ్మ కూర్చుని బొంత కుట్టుకుంటోంది,  ఏం?'' – ''ఊఁ'' ''..అంతలో సూది నూతిలో పడిపోయింది.''…

మేం పిల్లలుగా వుండగా మావయ్యో, బాబయ్యో కథ చెప్తానని మొదలెట్టేవారు. 

''ఒక నూతి గట్టు మీద ఒక ముసలమ్మ కూర్చుని బొంత కుట్టుకుంటోంది,  ఏం?'' – ''ఊఁ''

''..అంతలో సూది నూతిలో పడిపోయింది.'' –  ''ఊఁ''

''ఊఁ అంటే బయటకు వస్తుందా?'' – ''రాదు''

''రాదు అంటే వస్తుందా?'' – ''రాదని చెప్పానుగా..''

''రాదని చెప్పానుగా – అంటే వస్తుందా?'' – ''ఎహె, కథ చెప్పు''

''ఎహె, కథ చెప్పు – అంటే వస్తుందా?''

..ఇలా సాగేది. మనకి కోపం వచ్చేసి మీదపడి రక్కేసి, కరిచేసేదాకా యీ ప్రశ్నల పరంపర సాగేది.

ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనకబడిన ప్రాంతాలకు కేంద్రసాయం, వైజాగ్‌ రైల్వే జోన్‌, రాజధానికి నిధులు – యిలా దేని గురించి మాట్లాడినా నాకు యీ కథ గుర్తుకు వస్తుంది. ప్రత్యేక హోదా యివ్వం అని కేంద్రం అనదు, యిప్పించలేం అని రాష్ట్రప్రభుత్వం అనదు. వస్తోంది, వచ్చేస్తోంది. హోదా కాకపోయినా దానితో సమానమైన.. తప్పుతప్పు.. దాని కంటె ఎక్కువ ప్రయోజనకరమైన నిధులు వర్షంలా కురుస్తాయి అంటూ వచ్చారు. ఇప్పుడు విదిల్చిన నిధులు హోదాకు ఎక్కువైనవా? తక్కువైనవా? సమానమైనవా? ఎంత శాతము? ఏ సుజనా చౌదరిగారో లెక్కేసి చెపితే తెలుసుకుంటాం. కొత్త రాష్ట్రం కాబట్టి బజెట్‌ లోటు తీరుస్తారు, ప్రత్యేక ప్యాకేజీలు యిస్తారు, పన్ను రాయితీలు యిస్తారు, వైజాగ్‌ రైల్వే జోన్‌, జిల్లాకో పది సంస్థలు.. యిలా కొల్లేటి చాంతాడంత లిస్టు చెపుతూ వచ్చారు టిడిపి నాయకులు. చివరకి ఏమిచ్చారో, రేదర్‌.. ఏమివ్వలేదో హైస్కూలు కుర్రవాడు కూడా చెప్పగలడు.

నా చిన్నప్పటినుంచి రైల్వే, సాధారణ బజెట్‌ సమర్పించిన మర్నాటి పేపర్లలో ఒకటే హెడ్‌లైన్‌ – 'ఈ సారి రాష్ట్రానికి మొండిచెయ్యి!' అని. కాంగ్రెసు అధికారంలో వుంటే ఆ చెయ్యి అనేదానికి అటూయిటూ యిన్వెర్టెడ్‌ కామాలు పెట్టేవారు. గత రెండేళ్లగా హెడ్‌లైన్స్‌లో కాస్త మార్పు. రాష్ట్రానికి బదులు 'తెలుగు రాష్ట్రాలకు' అంటున్నారు. సారాంశం ఒకటే. ఈసారీ తెలంగాణకూ ఏమీ ఒరగబెట్టలేదు. కానీ యిప్పటికే వున్న యిన్‌ఫ్రాస్ట్రక్చర్‌ చూసి కాస్తకాస్త పెట్టుబడులు వస్తున్నాయి, బండి నడిచిపోతోంది. కెసియార్‌ చూపించే కలలకు, వాస్తవానికి హస్తిమశకాంతరం వుంది కానీ, ఉన్నది చెడగొట్టకుండా నడుపుకుపోతే భుక్తికి లోటు లేదు. కానీ ఆంధ్ర పరిస్థితి కృత్యాద్యవస్థ. తాడూ, బొంగరం ఏమీ లేదు. కేంద్రం ఏమీ యివ్వటం లేదు. ఇవ్వాల్సిన చోట కూడా ఎండగడుతోంది. లాలా లజపతిరాయ్‌, దీన్‌దయాళ్‌ జయంతులకు యిచ్చినదీ, పోలవరం ప్రాజెక్టుకి యిచ్చినదీ సమానమే అంటే నమ్మబుద్ధి కావటం లేదు. వైజాగ్‌ మెట్రోకు బొత్తిగా మూడు లక్షలంటే జోకా? అనిపించింది. 3 లక్షల కేటాయింపు కూడా కేంద్ర బజెట్‌లో ప్రస్తావిస్తారని నాకు తెలియదు. ఉన్నత విద్యకు చాలా ప్రాముఖ్యత యిస్తున్నాం అంటూ డప్పు కొట్టి సెంట్రల్‌ వర్శిటీకి, గిరిజిన వర్శిటీకి చెరో కోటి, పెట్రోలియం వర్శిటీకి రెండూ యిచ్చారు. విభజన చట్టంలో వున్న హామీలు నెరవేరుస్తాం అన్నారు యీ బజెట్‌లో కానీ వాటి గురించి నిధులు కేటాయించలేదు. అనగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో నెరవేరుస్తారని అనుకోవాలి. దాని తర్వాత యింకో ఏడాది పోతే ఎన్నికలే. రెండేళ్లలో ఆ హామీలన్నీ ఎలా నెరవేరతాయి? అప్పటిదాకా ఆంధ్ర రాష్ట్రం నిలదొక్కుకోవడం ఎలా?

మోదీ అంటే అభిమానంతో చొక్కా చింపుకునే ఆంధ్ర ప్రజలు కూడా మోదీ రాష్ట్రానికి ఏమీ యివ్వటం లేదని ఒప్పుకోక తప్పని పరిస్థితి. బిహార్‌ కశ్మీరులకి సాయం ప్రకటించిన తీరుతో అమరావతి శంకుస్థాపన మట్టి, నీళ్లు తేవడాన్ని పోల్చి చూస్తే ఆంధ్రుల ఆర్తనాదాలకు అర్థం తెలుస్తుంది. నిధులు లేని ఆంధ్ర గతి అధోగతే. మరి ఏం చేస్తే నిధులు వస్తాయి? బతిమాలితే వస్తాయా? బెదిరిస్తే వస్తాయా? మిత్రపక్షంగా వుండడం మానేసి, శత్రుపక్షం అయిపోతే వస్తాయా? వరసపెట్టి ఆత్మహత్యలు చేసుకుంటే వస్తాయా? అఖిలపక్షాన్ని వెంటేసుకుని ఢిల్లీలో నిరసనలు చేస్తే వస్తాయా?  – యిలా ప్రశ్నలు వేసుకుంటూ పోతే మొదట్లో చెప్పిన కథ బాపతే అవుతుంది. ఏం చేస్తే వస్తుందో తెలియదు కానీ మోదీకి ఆంధ్రపై కక్షకు మూలకారణం ఏమిటో అన్వేషిస్తే..? టీవీ చర్చల్లోనే కాదు, కాలర్స్‌ కూడా చెపుతున్న విషయమేమిటంటే – మోదీకి, బాబుకి ఎప్పణ్నుంచో పడదు. గోధ్రా అల్లర్ల సమయంలో బాబు మోదీని తీవ్రంగా తప్పుపట్టి ఆయన సాకు చెప్పి ఎన్‌డిఏ నుంచి వైదొలగి, ఆయనను అవమానించారు. అందుని మోదీ యిప్పుడు బాబుకి తన తడాఖా చూపిస్తున్నాడు! కాస్సేపు యిది నిజమే అనుకుందాం. దాని గురించి ఎవరు మాత్రం ఏం చేయగలరు? మోదీ ప్రధాని అని బాబు ఒప్పుకోక తప్పదు, బాబు ముఖ్యమంత్రి అని మోదీ ఒప్పుకోక తప్పదు. మోదీకి కొత్తగా తయారైన శత్రువులు – నితీశ్‌, అరవింద్‌ లాటి వాళ్లు వున్నారు కదా. కెసియార్‌ రెండేళ్ల క్రితమే సన్నాసి అన్నారు కదా. బాబు ఎప్పుడో చేసినదాన్ని యిప్పటిదాకా గుర్తు పెట్టుకోవడం దేనికి? గతం మర్చిపోయి బాబు యిప్పుడు తన భజన చేస్తున్నపుడు, తనూ మర్చిపోవచ్చు కదా! ఆంధ్ర భారతదేశంలో భాగం కాదా? ఆంధ్రులు పన్నులు చెల్లించటం లేదా? బాబు కారణంగా నాలుగున్నర కోట్ల ఆంధ్రులకు శిక్ష వేయడమేమిటి? వాళ్లు ఉసురు తగులుతుందన్న భయం లేదా?

కొంతమంది గెస్‌ యింకోలా వుంది. బాబు చాణక్యుడు. గతంలో యునైటెడ్‌ ఫ్రంట్‌కు కన్వీనరుగా వుంటూ రాత్రికి రాత్రి ఎన్డీఏ కన్వీనరు అయిపోయారు. అలాగే 2019 నాటికి తన హవా కాస్త తగ్గేసరికి, నితీశ్‌, మమతా, జయలలిత వంటి ప్రాంతీయనాయకులను, లెఫ్ట్‌ పార్టీలను వెంటేసుకుని మూడో ఫ్రంట్‌కు ప్రాణం పోసి, ప్రధాని పోస్టుకి తనతో పోటీ పడతాడని మోదీకి భయం వుందట. అందువలన నవరాష్ట్రస్రష్టగా బాబుకి పేరు రాకుండా తొక్కేద్దామనే డబ్బు బిగపడుతున్నాట్ట. ఇది నిజమే అయితే యీ అనుమానాన్ని దూరం చేయడం ఎలా? భవిష్యత్తులో ఏం చేస్తారో బాబు మాత్రం ఏం చెప్పగలరు? ఎన్నికలకు ముందు తన పార్టీలోంచి అంతమంది వెళ్లిపోతారని ఆయన అనుకున్నారా? అయిన రెండేళ్లకు మళ్లీ అందరూ వెనక్కి వస్తారని, వస్తూ వస్తూ మరి కొందర్ని వెంటపెట్టుకుని వస్తారని కలగన్నారా? కలగని వుంటే 'సంతలో పశువుల్లా కొంటున్నారు' అనే స్టేటుమెంటు యిచ్చి వుండేవారు కాదు కదా! మోదీకి మరీ అంత సందేహంగా వుంటే 'నేను లెఫ్ట్‌ వాళ్లతో కలవను, మీరు వద్దంటే ఎడమవైపు తిరిగి పడుక్కోను కూడా' అని హామీ యివ్వడం మినహా ఏం చేయగలరు? ఆయన నిజంగా మూడో ఫ్రంట్‌ వైపు వెళదామనుకుంటే 'బిజెపిని నమ్ముకుని మోసపోయాను, రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయాను, నా కోసం కాదు, మీ కోసం యీ సారి మూడో ఫ్రంట్‌లోకి వెళుతున్నాను' అని కాన్వాస్‌ చేసుకునే అవకాశం మోదీయే కల్పించినట్టవుతుంది. 

మోదీ నిధులివ్వకపోవడానికి మరో కారణం కూడా చెప్తున్నారు. బాబు గొప్పలు చెప్పుకునే మనిషి కాబట్టి, ప్రతీ పనినీ తన ఖాతాలో వేసుకుంటారు కాబట్టి 'ఆంధ్రకు యిస్తే నాకేంటంట? రాష్ట్రంలో బిజెపి బలపడి, ఖ్యాతి తన ఖాతాలో వేసుకునే వరకూ యివ్వకూడదు' అన్న లెక్క వేసుకుని మోదీ చేయి విదల్చటం లేదట. 'రాష్ట్రం నిత్యం, కేంద్రం మిథ్య' అని ఎన్టీయార్‌ ఎప్పుడో కొటేషించారు. రాష్ట్రానికి ఏలుకోవడానికి ఒక ప్రాంతం వుంది, కేంద్రానికి ఆలాటిదేమీ లేదు, (కేంద్రపాలిత ప్రాంతాలు వదిలేయండి) రాష్ట్రాల ద్వారానే పాలన సాగించాలి కాబట్టి ఆయన ఆ పోలిక తెచ్చారు. మిథ్య అయినా కేంద్రమే రాష్ట్రానికి వూపిరి పోస్తూ వుంటుంది. నరుడు కనబడతాడు, హరుడు కనబడడు. అయినా చీమను కుట్టమని అడిగినా హరుడి ఆర్డరేది? అంటోంది. కేంద్ర పథకాల్లో మోదీ ఫోటో వుంటుంది. మరి రాష్ట్ర పథకాల్లో సిఎం బొమ్మ లేకపోతే ఎలా? ఎక్కడో యుపిలో ఒక పథకం మొదలెడితే దేశం మొత్తమంతా ఫుల్‌ పేజీ యాడ్స్‌ యిస్తారు – మనమంతా చూసి అఖిలేష్‌ గట్టివాడే సుమీ అనుకోవాలన్నమాట. ఢిల్లీలాటి అర్ధరాష్ట్రంలో పావు ముఖ్యమంత్రి అర్ధణా స్కీము పెడితే మన తెలుగు టీవీ ఛానెల్స్‌లో కూడా యాడ్స్‌ యిస్తారు. మీడియా రిపోర్టులు చూసి అరవింద్‌ వట్టి జగడాలమారి, పేచీకోరు, వాచాలుడు మాత్రమే అనుకున్నాం, ఏదో కాస్త పని కూడా చేస్తున్నాడు సుమా అని మనం అనుకోవాలని అతని తాపత్రయం. ఇలా ప్రతి సిఎం ఎంతో కొంత పబ్లిసిటీకై పాకులాడుతారు. జిఎచ్‌ఎమ్‌సి చౌక భోజనం పథకం హోర్డింగులపై కెసియార్‌ బొమ్మ ఎందుకుంది అని అడగ్గలమా? మరి బాబు ఒక్కడిపైనే ఎందుకింత కినుక? 

ఏ మాట కామాట చెప్పాలంటే బాబు భగవద్గీతలో కృష్ణుడి లెవెల్లో సర్వం తానే అనేస్తూంటారు. హైదరాబాదుకు బ్రాండ్‌ యిమేజి నేను తెచ్చినదే, నేను కట్టినదే అంటే కాదని చెప్పడానికి ప్రస్తుతం నిజాం లేడు. కొన్నాళ్లకు బాబు ఏమనుకున్నారో ఏమో 'హైదరాబాదు నిజాం కట్టాడు, సికింద్రాబాదు ఇంగ్లీషువాళ్లు కట్టారు, సైబరాబాదు నేను కట్టాను' అనసాగారు. ఇంగ్లీషు వాళ్లు 1947లో వెళ్లారు. బాబు 1995లో సిఎం అయ్యారు. మధ్యలో వున్న 48 ఏళ్లలో మరి మేం కట్టిన బిఎచ్‌ఇఎల్‌, ఐడిపిఎల్‌, ఇసిఐఎల్‌, డిఫెన్సు లాబ్స్‌ వంటి వందలాది సంస్థల మాటేమిటి అని అడిగేందుకు కాంగ్రెసు వారు నోరూ, వాయి లేనివారయ్యారు. సైబరాబాదుకి మూలం అయిన హైటెక్‌ సిటీకి పునాది వేసిన నేదురుమల్లి దిగి వచ్చి అడగరు. రాజీవ్‌ టెక్‌ పార్కుకు హైటెక్‌ సిటీ అని పేరు మార్చి తన స్టాంపు కొట్టేసి, భూనభోంతరాళాలు బద్దలయ్యేట్టు ప్రచారం చేయడంతో బాబు పబ్లిసిటీ కాంపెయిన్‌ అంటే అందరికీ దడ పట్టుకుంది. మొన్న జిఎచ్‌ఎంసి ఎన్నికల ప్రచారంలో కూడా తన పార్టీ అభ్యర్థి ఎలాటివాడో చెప్పడం మానేసి, హైదరాబాదు నేను కట్టాను అనే డప్పే వేశారు. అందుకే ఓటర్లు ఆ అభ్యర్థుల మొహం చూడలేదు. ఇచ్ఛాపురం నుంచి హిందూపురం దాకా వూడ్చుకుంటూ యిదే బాకా వూదుకోండి అని బాబును పంపించివేశారు. 

'బాబు మీడియాను బాగా మేనేజ్‌ చేస్తారు. పని ఏమీ జరగకపోయినా ఏదో జరుగుతున్నట్లు ప్రజలను మభ్యపెట్టిస్తారు.' అనే మాట కూడా వుంది. ఇప్పుడు కేంద్రం ఏమీ యివ్వలేదు అని తేటతెల్లమై పోయిన తర్వాత కూడా వదిలిపెట్టరు. ప్రత్యేక హామీ గురించి జైట్లీ ఆలోచిస్తున్నారు అని మీడియాలో వస్తుంది, 'పోలవరానికి వేల కోట్లు యిద్దామని తోలుబ్యాగ్‌లో పెట్టి దాచి వుంచారు, బాబు ఢిల్లీ రాగానే చంకలో పెట్టి పంపిద్దామని కాచుకుని వున్నారు' అని లీకు వస్తుంది. 'ఇలా ఏదో ఒక అబద్ధం చెప్పి వూరిస్తూ వుండకపోతే నిరాశానిస్పృహలతో ఆంధ్ర యువత ఆత్మహత్యలు చేసుకుంటుంది కాబట్టి పాపం అలా చేయిస్తున్నారు' అని కొందరు వాదిస్తే వాదించవచ్చు కానీ యీ తరహా కథనాలు రెండేళ్లగా చాలా చదివి చదివి 'నాన్నా, పులి' కథలా అయిపోయింది. 2009 నుంచి ఆంధ్ర కాంగ్రెసు నాయకులు యిలాగే మభ్యపెడుతూ వచ్చారు. 'మేం వెళ్లి సోనియాకు సమైక్యవాదం వినిపించాం. ఆవిడ శ్రద్ధగా విని, తల వూపారు.' అని చెప్పేవారు. మీడియాలో ఆ మేరకు కథనాలు రాయించేవారు. కానీ జరగాల్సింది జరిగే తీరింది. ఇప్పుడు కేంద్రసాయం గురించి యిలాటి కథనాలే వస్తూంటే ఎవరు నమ్ముతారు? దీనివలన బాబుకి ఏమైనా లాభం ఏమైనా వుందో లేదో కానీ ఆంధ్ర ప్రజలకు నష్టం కలుగుతోంది. ఈ మీడియా మేనేజ్‌మెంట్‌తో చిర్రెత్తిన మోదీ బిర్రబిగిసిపోయారట.

తను ముఖ్యమంత్రిగా వున్న రాష్ట్రానికి ఏదైనా మేలు జరగాలంటే బాబు సవరణ చర్యలు చేపట్టాలి. గోధ్రా సమయంలో అన్న మాటలను వెనక్కి తీసుకోలేరు కానీ, ప్రస్తుతపు ప్రచారం తగ్గించడం, మీడియా మేనేజ్‌మెంట్‌ మానేయడం ఆయన చేతిలో వుంది. పథకాలకు ఎన్టీయార్‌ పేరు పెట్టకుండా మోదీ తల్లి పేరో, తండ్రి పేరో, దీన్‌దయాళ్‌, శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ, నానాజీ దేశ్‌ముఖ్‌.. లాటి పేర్లు పెడతానని కబురు పెడితే మోదీ ప్రసన్నుడు కావచ్చు. 2019 ఎన్నికల వరకు కాస్త తగ్గి వుండి రాష్ట్రానికి నిధులు పట్టుకుని వచ్చి, పనులు జరిపించి కావాలంటే జస్ట్‌ ఎన్నికల ముందు 'అంతా నాదే, మోదీది ఏమీ లేదు' అని చెప్పుకున్నా నష్టం లేదు. బాబు చేసిన పనులే ఆయన్ను గెలిపిస్తాయి. పవన్‌ కళ్యాణ్‌ను షూటింగు నుంచి స్పెషల్‌ ప్లేన్‌లో తెప్పించే ఖర్చులూ మిగులుతాయి. 

ఇక్కడే యింకో పాయింటు కూడా వుంది. కేంద్రంలో వున్న మీ పార్టీ రాష్ట్రానికి నిధులెందుకు యివ్వటం లేదు అని అడిగితే ఆంధ్ర బిజెపి నాయకులు 'ఆంధ్రులపై కక్షేమీ లేదు, రాష్ట్రం సరిగ్గా నివేదికలు పంపటం లేదు. ఇచ్చినవాటికి లెక్కలు చూపటం లేదు. రాజధానికి యిచ్చిన నిధులు యితరత్రా ఖర్చుపెట్టేశారు. రాజధానికి ప్లాన్‌ లేదు, పాడు లేదు, డిపిఆర్‌ యివ్వటం లేదు, ఏం చూసి నిధులు విడుదల చేయాలి?' అంటున్నారు. నిజానిజాలు మాకు తెలియవు. పాలనాదక్షులుగా, అధికారుల పట్ల చండశాసనుడిగా పేరున్న బాబుగారికే తెలియాలి. అలాటి నివేదికలు వెళ్లకపోతే అధికారులదే తప్పు, బాబుగారిదేమీ కాదని మాకు తెలుసు. దాని గురించి మళ్లీ మీడియాలో లీకులవీ ఏమీ యివ్వనక్కరలేదు. ఆ అధికారులను బెదిరించడానికి ఒక్కటే మార్గం – 'తక్షణం విజయవాడ బదిలీ చేస్తాం, మీ యింటద్దె మీరే కట్టుకోవాలి' అని బెదిరిస్తే చాలు. 

వీటన్నిటితో బాటు యింకొక్క చిన్న సూచన – యిలాటి సూచన చేసినందుకు టీవీ9 వారు మూఢనమ్మకాలు ప్రోత్సహిస్తున్నందుకు నన్ను మందలిస్తారని తెలుసు, అయినా ఆంధ్రరాష్ట్ర హితాన్ని కోరి చెప్తున్నమాట. అమరావతి శంకుస్థాపన ముహూర్తం సరిగ్గా పెట్టలేదేమో, అందువల్లనే డబ్బులు రాక పని ముందుకు సాగటం లేదనే సందేహం మనసులో మెదులుతోంది. ఎవరైనా తెలిసున్నవారిని అడిగి చూసి, అవసరమైతే.. అవసరమైతేనే సుమా.. మళ్లీ యింకో శంకుస్థాపన.. మళ్లీ అదే పేరుతో పెడితే బాగుండదేమో – గతంలో భూమిపూజ అయిపోయింది, శంకుస్థాపన అయిపోయింది, యీసారి గణపతిపూజ లేక క్లిష్టకష్టనివారిణీపూజ లాటి పేరుతో యింకో భారీ మహోత్సవం నిర్వహిస్తే… మోదీ గారు యీసారి లంకెబిందెలు తెస్తారేమో!  

ప్రశ్నలతో మొదలుపెట్టాను కాబట్టి చివరా ఒక ప్రశ్న –  'బాబు మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకంతోనే పార్టీ మారాను' అంటూ చాలామంది మారారు, యింకా మారుతున్నారు. కేంద్రం యిలా ఎండగడుతూ వుంటే, జీతాలకే లేకుండా మాడ్చి చంపుతూ వుంటే బాబు వాటన్నిటినీ ఏవెట్టి చేస్తారు అభి-వృద్ధి!?

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2016) 

[email protected]