జగన్ ముందు జాగ్రత్త?

రోజులన్నీ  మనవి కాదు. అది జగన్ అయినా, బాబు అయినా సరే. అందునా ప్రతిపక్షంలో వుంటూ, ఎన్నాళ్లు పోరాటం సాగించకుండా వుండగలరు. పోరాడితే కచ్చితంగా కసి పెట్టుకుంటారు. అది సోనియా అయినా, బాబు అయినా.…

రోజులన్నీ  మనవి కాదు. అది జగన్ అయినా, బాబు అయినా సరే. అందునా ప్రతిపక్షంలో వుంటూ, ఎన్నాళ్లు పోరాటం సాగించకుండా వుండగలరు. పోరాడితే కచ్చితంగా కసి పెట్టుకుంటారు. అది సోనియా అయినా, బాబు అయినా. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ముందు జాగ్రత్త పడుతున్నారా? తెలుగదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్లు ఆయన మళ్లీ జైలుకు వెళ్లే అవకాశాలున్నాయా? 

నిజానికి ఏదైనా కేసులో ఓ సారి అరెస్టయి, బెయిల్ వచ్చిన తరువాత చార్జిషీట్ లు దాఖలు, కేసు విచారణ, జడ్జిమెంట్ వంటి దశలు వుంటాయి. అప్పుడు నేరం చేసాడని రుజువైతే తప్ప, ఈ లోగా మళ్లీ జైలుకు వెళ్లడం అన్నది సాధారణంగా వుండదు. బెయిల్ రద్దు చేయమని కోరి, ఆ మేరకు న్యాయస్థానం సరే అంటే తప్ప. మరి ఏ ఆధారంతో తెలుగుదేశం జనాలు ఇలా ప్రచారం చేస్తున్నాయో తెలియదు. 

అయితే జగన్ మాత్రం మరో అయిదేళ్ల పాటు పార్టీ పటిష్టంగా వుండడానికి, ముందుగానె చకచకాప్రణాళికలు ఆలోచించి, అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. కీడెంచి మేలెంచాలని, ఎందుకయినా మంచిదని ఈ మేరకు ఆయన అన్నీ సన్నద్ధం చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ముందుగా పార్టీకి ఎక్కడికక్కడ కావాల్సిన యంతాగాన్న్ ఏర్పాటు చేస్తున్నారు. తాను విశ్వసించే విజయసాయి రెడ్డికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. విజయమ్మను మళ్లీ తెరపైకి తెచ్చి తనతో పాటు సమావేశాల్లో కూర్చోబెడుతున్నారు. ఈవిధంగా ఆమె పార్టీ పట్ల అప్ డేట్ సమాచారం వుంటుంది. 

ఇక సాక్షి విషయంలో కూడా ప్రక్షాళన చేపట్టి, సమర్థుడైన రామచంద్రమూర్తి లాంటి వ్యక్తి తెచ్చి అక్క్డడి బాధ్యతలు అప్పగించారు. ఆర్థికంగా జగన్ ఏమీ బలంగా లేరు. అది అందరికీ తెలిసిందే. అందుకే వీలయినంత వరకు ఖర్చులు తగ్గించుకోవడం, నష్టాలు నివారించడం వంటి చర్యలకు సిద్దమవుతున్నారు. 

ఇలా అన్ని విధాలా చకచకా పనులకు పూనుకోవడం జగన్ కు రెండు విధాలా లాభం చేకూరుస్తుంది.తాను బయటే వుంటే అసెంబ్లీపై చంద్రబాబుపై దాడిపై ఎక్కువగా దృష్టి పెట్టడానికి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించడానికి వీలవుతుంది. లేదూ అనుకోని సంఘటన జరిగినా, ఎక్కడి పనులు అక్కడ సజావుగా సాగిపోతాయి. 

ఆ మాత్రం ముందు జాగ్రత్త వుండడం అవసరమే. కానీ ఒక్కటేసమస్య. ఇంకా జగన్ పొల్లులు, పుచ్చులు పట్టుకునే దేవులాడుతున్నారు. లేకుంటే లక్ష్మీ పార్వతి లాంటి వారికి ప్రధాన కార్యదర్శి లాంటి కీలక పదవులు ఇవ్వడం ఏమిటి? ఏదో పేరుకే, వారు చేసేదేమీ వుండదు..అంతా విజయసాయి రెడ్డే అని అనుకుంటే అనుకోవచ్చు. కానీ శ్రేణులకు ఉత్సాహం కలిగించనేవారు వుంటే అది వేరుగా వుంటుంది కదా. అంతే తప్ప టీవీ మైకుల ముందొ, జగన ఇంటికో వచ్చిపోయేవారికి ఇస్తే ఏం లాభం?

బాబు  కూడా సోనియాలాగే

జగన్ పార్టీని,సోనియాను థిక్కరించగానే సోనియా సిబఐ ని రంగంలోకి దింపినట్లు అందరికీ తెలుసు. జగన్ తప్పు చేసినా, చేయకున్నా అంతవరకు మాత్రం ఏమీ మాట్లాడలేదు. సిబిఐ ద్వారానే జగన్ ను దారిలోకి తెచ్చుకోవాలనో, లేదా కసి తీర్చుకోవాలనో చూసారు. ఇప్పుడు బాబు అండ్ కో కూడా అలాగే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 
జగన్ సమస్యలపై పోరు అనగానే బాబు అండ్ కో జగన్ అవినీతిని, కేసులను ఏకరవు పెడుతున్నారు. నానా యాగీ చేస్తున్నారు. ఇక్కడ అర్థం కానిది ఒకటే. జగన్ పై కేసులు తేలేవరకు ఆయన తెలుగుదేశం పార్టీ విధానాలపై కానీ, ప్రజా సమస్యలపై కానీ పోరు సలపకూడదన్నది అతగాడిపై దాడికి దిగుతున్నవారి ఉద్దేశమా? 

రుణమాఫీ పై జగన్ పోరు కార్యక్రమం ప్రకటించగానే, తెలుగుదేశం పార్టీ మీడియా వింగ్ రెడీ అయిపోయింది. జగన్ కేసులు, వాటి వైనం, ముద్దాయిలు అంటూ పేద్ద నోట్ తయారు చేసి, శ్రేణులకు ఆయుధాలు గా అందించేసింది. దాన్ని రాత్రంతా బట్టీ పట్టి ఇక మీడియా ముందు అప్పచెప్పి, అధినేత మార్కులు కొట్టేయడనే ఇక వారి వంతు. ఇప్పటికే నిన్న ఒకరిద్దరు నేతలు మైకుల ముందు అప్పుడే గొంతు చించేసుకున్నారు.  ఇంతలా గొంతు చించుకున్నవారు చెప్పనిది ఒకటే ఇంతకీ రుణమాఫీ చేసారా? ఇంకా చేయాలా? చేయాల్సి వుంటే ఎప్పుడు చేస్తారు? 

ఆ ఒక్కటీ తప్ప జగన్ కేసుల గురించి మాత్రం ఎంతయినా మాట్లాడతారు. ఎందుకుంటే ఆ మేరకే వారికి మీడియా విభాగం నుంచి తర్ఫీదు వుంటుంది కాబట్టి.

ఇదెక్కడి ప్రజాస్వామ్యమో..మన రాష్ట్రంలో. ప్రతిపక్ష నేత సమస్యలు ఏకరవు పెడితే వాటికి సమాధానం చెప్పడం మాని, నువు దొంగవి..దగుల్బాజీవి అనడం ఏమిటో? అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ఏమయినా జరగొచ్చనే కావచ్చు..జగన్ ముందు జాగ్రత్తం పడుతున్నట్లుంది.

చాణక్య

[email protected]