గాంధీని బిచ్చగాడ్ని చేసేశాం.!

స్వతంత్ర భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుతోందంటే అది మహాత్ముడి పుణ్యమే. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడానికి అనేకమంది ప్రాణ త్యాగం చేశారు. అలా చాలామంది మహనీయులన్పించుకున్నారు.. కానీ మనమేం చేస్తున్నాం.? మహనీయుల్ని స్మరించుకోవడం మర్చిపోయాం.. అడపా…

స్వతంత్ర భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుతోందంటే అది మహాత్ముడి పుణ్యమే. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడానికి అనేకమంది ప్రాణ త్యాగం చేశారు. అలా చాలామంది మహనీయులన్పించుకున్నారు.. కానీ మనమేం చేస్తున్నాం.? మహనీయుల్ని స్మరించుకోవడం మర్చిపోయాం.. అడపా దడపా స్మరించుకుంటున్నా దాన్నో ఫ్యాషన్‌గా మార్చేసుకున్నాం. ఇక, మహాత్ముడి విషయానికొస్తే.. విదేశాల్లో మహాత్ముడ్ని గౌరవిస్తోంటే.. మన దేశంలో మహాత్ముడ్ని బిచ్చగాడిని చేసేశాం.

దేశంలో ఏ మూలకెళ్ళినా మహాత్ముడి వేషధారణలో బిచ్చగాళ్ళు కన్పిస్తారు. ‘గాంధీ అంటే ఇతనేనా.?’ అని చిన్న పిల్లలు తమ తల్లిదండ్రుల్ని ప్రశ్నిస్తోంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడంలేదు చాలామందికి. హైద్రాబాద్‌లో ఒకాయనకు ఇలాగే ఒళ్ళు మండింది. గాంధీ వేషంలో బిక్షాటన చేస్తున్న ఓ వ్యక్తి పొగతాగుతుండడంతో సదరు న్యాయవాదికి కోపం కట్టలు తెంచుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దాంతో పోలీసులు ఆ బిచ్చగాడ్ని అరెస్టు చేశారు.

పొట్టకూటి కోసం గాంధీ వేషధారణ అనేది సర్వసాధారణంగా మారిపోయిందిప్పుడు. చిన్న పిల్లలు కూడా సిల్వర్‌ కలర్‌ శరీరానికి పూసేసుకుని, విగ్రహాల్లా నడింోడ్డుమీద.. మండుతున్న ఎండల్లో నిల్చుండిపోతున్నారు.. కాసిన్ని కాసుల కోసం. అలాంటి వారిని చూస్తే చాలామందికి ఆవేదన కలుగుతోంది. గాంధీకి బిచ్చమేయడమా.? అని కొందరు అనుమానపడ్తోంటే.. దేశం ఇలా తగలడింది.. అని మరికొందరు ఆవేదన చెందుతున్నారు.

‘ఇలాక్కూడా బిచ్చమెత్తుకోనివ్వరా.?’ అని తాజా అరెస్టు ఘటనతో గాంధీ వేషధారులైన బిచ్చగాళ్ళు వాపోవాల్సి వస్తుంది. అదే సమయంలో పాలకులూ కళ్ళు తెరవాల్సిన అవసరం ఎంతైనా వుంది. బిచ్చగాళ్ళు లేని నగరాలుగా మార్చేస్తాం.. అని నాయకులు చాలా ప్రగల్భాలు పలికారు ఇప్పటిదాకా దేశంలో.. రాష్ట్రంలో. కానీ బిచ్చగాళ్ళు వివిధ రూపాల్లో యాచనను కొనసాగిస్తూనే వున్నారు. మిగతావారి విషయమెలా వున్నా, గాంధీ వేషధారి బిచ్చమెత్తుకోవడం అంటే మహాత్ముడ్ని బిచ్చగాడిగా మార్చేసినట్టే.. ఆ పాపం పాలకులదే.