ఇది గతం. ఇక ముందు ఎలా వుంటుంది? సెక్షన్ 8 గురించి ఎడ్వకేట్ జనరల్ సలహా యివ్వడం నిజమేనా? గవర్నరుకు హోం శాఖ సర్వాధికారాలు యిచ్చిందా? నువ్వే చూసుకో అని చేతులు దులిపేసుకుందా? ఎవరి వూహాగానాలు వారివి. జరిగిన విషయాలను క్రోడీకరిస్తూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ 'కాల్పుల విరమణతో కథ కంచికి!?' అని జూన్ 21 న రాసిన వ్యాసంలో సారాంశం యిది – 'మే 20 ప్రాంతంలోనే తెరాస రేవంత్‌పై ఫోకస్ పెట్టింది. అతను ఎంతకైనా తెగిస్తాడని వూహించి కొందరు తెరాస నాయకులు, పోలీసు అధికారులు వ్యూహం అమలు చేశారు. ఫలానా ఫలానా వారి ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయమని సర్వీసు ప్రొవైడర్లకు లిఖితపూర్వకంగా ఆదేశాలు పంపారు. జాబితాలో టిడిపి ఎంపీ, ఎమ్మెల్యే సెబాస్టియన్ నంబర్లతో బాటు కొంతమంది ఉగ్రవాదులు, నక్సలైట్ల నంబర్లు చేర్చారు. ఆ ఆదేశాల ప్రకారం మే 23 నుంచి సర్వీసు ప్రొవైడర్లు ట్యాపింగ్ మొదలెట్టారు. దీనితో పాటు ప్రయివేటు సంస్థల ద్వారా కూడా మరికొంతమంది ఫోన్‌లు ట్యాప్ చేశారు. దాని వలన రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు తెలిశాయి. ఎసిబి ద్వారా పట్టిచ్చారు. సెబాస్టియన్ ఫోన్ నుంచి చంద్రబాబుకి వెళ్లిన ఫోన్ కాల్స్‌ను రికార్డు చేశారు. ఈ క్రమంలోనే ఒక ఎంపీకి, లోకేశ్‌కు జరిగిన సంభాషణలు కూడా రికార్డు చేశారు. నాయిని ప్రస్తావించిన ఆడియోలు యివే! ఆ ప్రకటనతో కంగు తిన్న బాబు మే 23 నుంచి జరిగినవన్నిటి గురించి వాకబు చేసి ఆధారాలు దగ్గర పెట్టుకున్నారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీల ఫోన్లు ట్యాప్ చేయమని అధికారికంగా లేఖ రాసిన పోలీసు అధికారులు సజ్జనార్, శివధర్‌రెడ్డి, అనురాగ్ శర్మ, హోం సెక్రటరీ వెంకటేశంలపై ఫిర్యాదు చేశారు. వారిని విచారించినప్పుడు తాము కెసియార్ ఆదేశాలపై చేశామని చెపితే గతంలో కర్ణాటకలో ట్యాపింగ్ వ్యవహారంలో రామకృష్ణ హెగ్గడే రిజైన్ చేసినట్లే యిప్పుడు తనూ చేయవలసి వుంటుందని అర్థమయ్యాక కెసియార్ జోరు తగ్గించారు. ముందులో వేడుక చూసిన కేంద్రం కూడా శ్రుతి మించితే కొంపలు మునుగుతాయని గుర్తించి గవర్నరు ద్వారా యిద్దర్నీ చల్లబడమని సూచించింది. అందుకే వాతావరణం చల్లబడసాగింది.'
ఇదీ ఆ వ్యాసంలోని ప్రధానాంశం. దీనిలో తెరాస తన ఆపరేషన్ మొదలుపెట్టేముందు జగన్‌తో సమావేశమైంది అని కూడా రాశారు. రాధాకృష్ణకు, జగన్‌కు వున్న వైరాన్ని దృష్టిలో పెట్టుకుంటే దానికి ప్రాధాన్యత యివ్వనక్కర లేదనిపించింది. అటుగాని, యిటు గాని జగన్‌కి ఏ పాత్రా లేదు. బాబుకి వ్యతిరేకంగా ఓ కేసు వస్తే దాన్ని కొండంతలు చేసి వ్యతిరేక ప్రచారం చేద్దామని చూడడం తప్ప వైకాపా చేయగలిగిందేమీ లేదు. పోలీసు అధికారులు, యంత్రాంగం అన్నీ తెరాస చేతిలో వున్నాయి. జగన్ సిఫార్సు, మద్దతు అక్కరలేదు. ఇంతకీ తేలినదేమిటంటే బాబు ఫోన్లు ట్యాప్ కాలేదు. 120 మందివి ట్యాప్ అయ్యాయన్న లెక్క కూడా పొల్లు మాటే అనుకోవాలి. ఎమ్మెల్యే, ఎంపీల ఫోన్లు ట్యాప్ చేసినందుకు తమపై విచారణ జరుగుతుందన్న భయం తెలంగాణ పోలీసు అధికారులకు వుందని, అందుకే సెలవుపై వెళ్లిపోయారని అంటున్నారు. అది నిజమే కావచ్చు. ఏది ఏమైనా బాబు జాగ్రత్తగానే వున్నారు. ట్రూత్ లాబ్స్ గాంధీని ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకోవడమే దానికి నిదర్శనం. పార్టీ సలహాదారుగా పెట్టుకుంటే అదో అందం. ప్రభుత్వసలహాదారుగా పెట్టుకోవడమేమిటి? ఫోరెన్సిక్ లాబ్ రిపోర్టులు ఎలా వచ్చినా సాధారణ ప్రజలకు చింతేముంది? గతంలో మాట ఏమో కానీ, ట్యాపింగ్ చేయడం అనేక ప్రభుత్వాలు చేస్తున్న పనే అని యింతకు ముందే రాశాను. పైగా ట్యాపింగ్ జరిపినది తెలంగాణ పౌరులపై. ఫిర్యాదు చేస్తే వారు చేయాలి. ఆంధ్ర ప్రభుత్వం కాదు. దాన్నీ రేవంత్ లంచాన్ని ఒకే త్రాసులో తూచలేం.
అందువలన రాజీ టెర్మ్‌స్ ఎటువైపు మొగ్గాయో వూహించవచ్చు. తెలుగు యూనివర్శిటీ, ఓపెన్ యూనివర్శిటీల నిర్వహణా భారంలో 58% భరించడానికి ఆంధ్ర ప్రభుత్వం ఒప్పుకుందని పేపర్లో వచ్చింది. మరి ఆస్తుల్లో 58% వాటా వస్తుందా? ఇలాటి ఒప్పందం వలన ఆంధ్రకు నష్టమే కదా! తమిళనాడులో యూనివర్శిటీతో కూడా యిలాటి ఒప్పందమే పెట్టుకోవచ్చు. ఉమ్మడి రాజధాని సౌకర్యం పొంది లాభమేముంది? 'సంస్థను నెలకొల్పినది ఉమ్మడి రాష్ట్ర నిధులతోనే అయినా యిక యీ సంస్థ తెలంగాణదే, దాని నిర్వహణ, అజమాయిషీ, దానిలో సిబ్బంది ఎవరుండాలి యిత్యాది విషయాలన్నిటిలో తెలంగాణకే సర్వాధికారం. నిర్వహణా వ్యయంలో ఎక్కువ భాగం మాత్రం ఆంధ్ర భరించాలి' అని తెలంగాణ ప్రభుత్వం చేసిన వాదనను ఆంధ్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇదేనా హక్కుల కోసం పోరాటం? ఇది రాజీ పడడం కాదా? ఎడ్మిషన్లు కోరే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒప్పుకున్నాం అని యిప్పుడు సంజాయిషీ చెప్పవచ్చు, యీ పరిస్థితి ఎందుకు రానిచ్చారు? ఏడాది లోపున ఆస్తుల, అప్పుల పంపకాలు చేసుకోవాలి అని విభజన చట్టం చెప్పినా ఎందుకు వూరుకున్నారు?
కెసియార్, బాబుల మధ్య రాజీ కుదిరిందో లేదో తెలియదు కానీ రేవంత్ మళ్లీ రాజీ పడ్డట్టు లేదు. ఆయన జైలు నుంచి బయటకు వస్తూనే అట్టహాసం చేశాడు. ఏ మాత్రం పశ్చాత్తాపం చూపకుండా, ఏదో ఘనకార్యం చేసినట్లు ప్రలాపాలు పలికాడు. కెసియార్ ప్రభుత్వం ఆయన మీద పగబట్టి, తన పరువు తీసుకుంది. బెయిల్ ఎలాగైనా రాకుండా చేయాలని ప్రయత్నించి, భంగపడి, యిచ్చిన బెయిలు రద్దు చేయమని సుప్రీం కోర్టుని కోరి, చివాట్లు కూడా తింది. విభజన పుణ్యమాని తెలుగువాళ్లు అందరి చేత సుద్దులు వినాల్సి వస్తోంది. దారుణమైౖన మతకలహాలు జరిగిన రాష్ట్రం నుండి వచ్చిన రాష్ట్రపతి కూడా 'పొరుగును ఎంచుకోలేం, భరించండి' అని నీతులు చెప్పారు. మనకు సిగ్గుండాలి. ముక్తాయింపుగా చెప్పవలసిన దేమిటంటే – రాజీ కుదిరింది కదాని టిడిపి సెక్షన్ 8 పై చర్చ ఆపేయకూడదు. నోటు-ఓటు వ్యవహారాన్ని, సెక్షన్ 8 కు ముడిపెట్టడం మానేసి, తెలంగాణలో వున్న అన్ని ప్రాంతాల వారి భద్రత, పౌరహక్కుల రక్షణ కోసం అంటూ సెక్షన్ 8 అమలుకై ఉద్యమించాలి. కెసియార్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని అందరికీ తెలుసు. తన పార్టీలో చేరడానికి యిచ్చగించనివారిపై కేసులు బనాయించే ప్రమాదం కూడా పొంచి వుంది. ఆయన పాలనపై ఘాటుగా విమర్శలు చేస్తున్నందుకే రేవంత్‌పై పగ పెంచుకున్నాడన్న విషయంలో సందేహమే లేదు. రేవంత్, కొంతవరకు కిషన్ రెడ్డి, యీ మధ్య విక్రమార్క కెసియార్‌కు అడ్డుకట్ట వేస్తున్నారు తప్ప తక్కిన నాయకులు, మీడియా అంతా దాసోహమనేసింది. అలాటి రేవంత్ యీ రకంగా కేసులో పట్టుబడడం తెలంగాణలో ప్రజాస్వామ్యానికి చేటు.
సెక్షన్ 8 గురించి ఉద్యమించడం టిడిపి సొంతంగా చేయలేదు. ఎందుకంటే దానికి యిప్పటికే మచ్చ అంటింది. తన రాష్ట్రంలో అఖిలపక్షం ఏర్పరచి, అందర్నీ కలుపుకుని పోతూ తీర్మానాలు చేస్తూ, కేంద్రానికి హెచ్చరికలు పంపుతూ వుండాలి. అంతేకాదు, తెలంగాణలోని అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు కూడా సెక్షన్ 8 గురించి పట్టుబట్టేట్లా చేయాలి. ప్రతీ పార్టీలోను ఆంధ్ర శాఖ ఒకలా, తెలంగాణ శాఖ ఒకలా మాట్లాడితే దానికి అర్థం వుండదు. విభజన చట్టంలో వుంది, దాన్ని అమలు చేయాలి, అమలు చేయడంలో హద్దు మీరితే అప్పుడే అభ్యంతర పెడదాం అనే అవగాహన అందరికీ స్పష్టంగా వుండాలి. ఈ పనికి పూనుకోవలసిన బాధ్యత ఆంధ్ర ముఖ్యమంత్రిగా బాబుపై వుంది. మిగతా వాళ్లతో పనేముంది, నేను ఒక్కణ్నే ఆంధ్రరక్షకుడిగా వెలుగుతాను అనుకుంటే జనం నమ్మరు. టెన్త్ షెడ్యూల్ ఆస్తులు ఏ పాటి రక్షించారో జనాలు గమనించారు. రేవంత్ అంశం రాకపోతే సెక్షన్ 8ని కూడా పట్టించుకోలేదనీ గమనించారు. కెసియార్‌ను అప్రజాస్వామిక వాది అని నిందించేముందు, తను అలాటి తప్పులు చేయకుండా వుండాలి. తను పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ, అఖిలపక్షాన్ని పిలవకుండా యిక్కడ మాత్రం ఆ కారణాలు చూపి సెక్షన్ 8 అమలు కోసం అడిగితే ఆ డిమాండ్‌కు విలువ వుండదు.
సీరీస్ ముగించేముందు కొన్ని వ్యాఖ్యలపై జవాబులు – 1) తెలంగాణ నాయకులు తమ వైఫల్యాలకు ఆంధ్రులను బాధ్యుల్ని చేస్తూనే వుంటారని, వాళ్లని అనవసరంగా యిరికిస్తూంటారని అని నేను రాసినదానికి ఒక పాఠకుడు అభ్యంతరం తెలిపారు. తాజాగా ఒక ఉదాహరణ – జెఎన్‌టియు యిటీవల ఇంజనీరింగు కాలేజీల క్షాళన పేరుతో మంచి పని చేస్తోంది. అఫ్‌కోర్సు, దానిలోనూ పక్షపాతాలు లేకపోలేదు, కానీ కనీస వసతులు లేని కాలేజీలో సీట్లు రద్దు చేస్తున్నారు. నాణ్యతాలేమి కారణంగా సీట్లు పోగొట్టుకున్న తెలంగాణ కాలేజీ యజమానుల సంఘం చేసిన ఆరోపణ ఏమిటో తెలుసా? – ఆ కమిటీలో అందరూ ఆంధ్రులుండడం చేత తమకు అన్యాయం జరిగిందట! 2) చట్టం తెలియని సామాన్యుణ్ని నేను అనడంలో పొరపాటేముంది? ఎప్పుడైనా సెక్షన్లు, ఫలానా వెర్సస్ ఫలానా కేసులు కోట్ చేశానా? అటువంటివి రాసినప్పుడు -ట చేరుస్తాను. జగన్‌పై ఆర్టికల్స్‌లో సెక్షన్‌లు వల్లించానా? క్విడ్ ప్రో కో నిరూపించడం కష్టం అంటూ బ్యాంకు మేనేజరు కొడుక్కి యిండస్ట్రియలిస్టు ఉద్యోగం యివ్వడం, యిండస్ట్రియలిస్టుకు బ్యాంకు మేనేజరు లోను యివ్వడం వంటి సాధారణ ఉదాహరణలే యిచ్చాను. రేవంత్ అంశంపై (ఒక పాఠకుడు ఎత్తిచూపినట్లు) న్యాయకోవిదులు తలోరకంగా మాట్లాడుతున్నారని ఎత్తి చూపాను. ఓటు అమ్ముకోవడం తప్పు కాదని కోర్టులు చెప్పాయంటే రేపు జనరల్ ఎలక్షన్‌లో నా ఓటుకు నేను ఆన్‌లైన్ ఆక్షన్ నిర్వహించుకోవచ్చా అని కామన్ సెన్సుతో అడగవచ్చుగా?
పట్టిచ్చినందుకు స్టీఫెన్‌సన్‌ది దురుద్దేశం అని ఆంధ్ర ప్రభుత్వాధికారి అన్నారు. మరి యీ నెలలో సెన్సారు ఆఫీసరును ఒక నిర్మాత యిదే రీతిలో పట్టిచ్చారు. ఆయనదీ దురుద్దేశమేనా? మేధావులు చేసే వితండ వాదనను ఎత్తిచూపడమే నా లక్ష్యం. రేవంత్ దొరికిన దొంగ, అతన్నీ వదిలేస్తే దొరకని దొంగలకు మరింత ధైర్యం వస్తుంది, మంచివారినీ దొంగతనాలకు ప్రేరేపిస్తుంది. ఇక సమైక్యాంధ్రకు జనాల్లో ప్రజాదరణ వుందా లేదా అన్నది తెలుసుకోవడానికి 2014 ఎన్నికలు సూచిక కానే కాదు. అప్పటికే విభజన బిల్లు పాస్ అయిపోయింది. 2009లో వైయస్సార్ సమైక్యానికే నిలబడి గెలిచారు. టిడిపి, కమ్యూనిస్టులు విభజనవాది తెరాసను అక్కున చేర్చుకుని ఓడిపోయాయి. 2004లో టిడిపి సమైక్యవాదం చేత ఓడలేదు. బాబు పాలనలో గ్రామీణప్రాంతాల ఆర్థిక స్థితి దెబ్బ తినడం వలన ఓడింది. ఉమ్మడి రాష్ట్రంలో సాధారణ ఎన్నికలలో తెరాస ఒంటరిగా పోరాటం చేసే సాహసం చేయలేకపోయింది. కొన్ని ప్రాంతాల్లోనే గెలుస్తూ, రాజీనామా చేస్తూ అక్కణ్నుంచే మళ్లీ పోటీ చేస్తూ వచ్చింది. విభజన జరగ్గానే తెలంగాణలో విద్యుత్ కొరత రావడం వాస్తవం. ఆనాటి పేపర్లు చూస్తే తెలుస్తుంది. ఈ సీజన్‌లో వ్యవసాయానికి భారీగా కోత పెట్టి, పరిశ్రమలకు యిచ్చారు. కేంద్రం నుంచి కొంత తెచ్చారు, మరి కొంత కొన్నారు. తెలంగాణలో చాలినంత విద్యుత్ యిప్పటికూడా కూడా లేదు. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2015)