cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Chanakya

జగన్ తొందరపడుతున్నారా?

జగన్ తొందరపడుతున్నారా?

రైతుల సమస్యలపై రణభేరి మోగిస్తున్నారు ప్రతిపక్ష నేత జగన్. అయిదవ తేదీన ఆయన రాష్ట్రవ్యాప్త నిరసన, ధర్నా, దీక్షల వంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం కీలకమైన రుణమాఫీపై చేస్తున్న తాత్సారానికి నిరసన ఇది.

కారణం సరైనదే. నిర్ణయం సహేతుకమైనదే. కానీ ఇంకా ఆరునెలలు కాకుండా జగన్ ప్రభుత్వంపై రణ భేరి మోగించడం ఏమిటి అని అధికార పక్షం నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో చూస్తే..

ఆరునెలలు సమయం తక్కువా..ఎక్కువా అనే కన్నా, తొలిసంతకం చేస్తాను అని హామీ ఇచ్చారంటే అర్థమేమిటి? గద్దెనెక్కగానే చేస్తాననే కదా? అప్పుడు ఆరునెలలు అన్న ఆలోచన ఏదీ లేనట్లేగా? అలాంటపుడు చేయాల్సిన సంతకం దేనిమీద? ఎటువంటి ముందు, వెనుక ఆలోచన లేకుండా, ఎటువంటి షరతులు లేకుండా రాష్ట్రంలోని రైతులందరి రుణాలు మాఫీ చేసాం అనే ఒక్క లైన్ వున్న దస్త్రం మీద. లేదు కాస్త కండిషన్లు పెట్టాలంటే, ఇంత మొత్తం లోపు, కేవలం పంటకోసం తీసుకున్న రుణాలు అని చేర్చవచ్చు. 

కానీ బాబు అలా చేయలేదు. అసలు రుణాల నిగ్గు తేల్చడానికి ఓ కమిటీ అని కథ ప్రారంభించారు. పోనీ ఈ కథ ఎప్పటికి క్లయిమాక్స్ కు చేరుతుందన్నది ఎవరికీ తెలియదు. ఎందుకంటే కమిటీ సీన్ పూర్తయ్యాక, ఆర్బీఐ సీన్ మొదలయింది. ఆర్బిఐ సీన్ అయ్యాక, వాయిదాల పర్వం ప్రారంభమయింది. వాయిదాల పర్వం ముగిసేసరికి, వడపోత అనివార్యమయింది. అక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్ పడింది. ఇది కీలకం ఎందుకంటే ఇక్కడదాకా ఎంతయినా దాగుడు మూతలు ఆడొచ్చు. 

కానీ ఇక్కడ మరింక రైతుల దగ్గర దాచడానికి, నమ్మబలకడానికి ఏమీ వుండదు. ఎందుకంటే ఒకటే పాయింట్..జాబితాలో తమ పేరు వుందా? లేదా? అన్నదే. రైతు..రుణం..మాఫీ అని చంద్రబాబు ప్రకటించినపుడే, ఈ విధి విధానాలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, లిమిటేషన్ లు అన్నీ కూడా ప్రస్తావించి వుంటే, రైతులు జాగ్రత్త పడేవారు, వాటి పరిథిలోకి రాని వారు తమ రుణాలు తామే తీర్చేసి వుండేవారు. లేదా ఆ ప్రయత్నం చేసే వారు. కానీ బాబు ఓట్ల వేట రంథిలో పడి అలా చేయలేదు. ఇప్పుడు ఇది పీకలమీదకు వచ్చేసరికి, వైకాపా నేత జగన్ పై తిట్ల దండంకం, కేసులు ఏకరవు తప్ప మరో సమాధానం వుండడం లేదు.

మొన్నటికి మొన్న మంత్రి పుల్లారావు, జపాన్ పర్యటన నుంచి చంద్రబాబు రాగానే రుణమాఫీ పని మొదలవుతుందన్నారు. కానీ ఇప్పుడు ఆ మాటే మరిచారు. కేవలం అయిదువేల కోట్లతో పని కానిద్దామన్నది ప్రభుత్వ ఆలోచన. అందరికీ రుణమాఫీ చేయాలంటే, విడతల వారీగా చూసుకున్నా కనీసం 20వేల కోట్లు కావాలి. అది సాధ్యం కాని పని. ఎందుకంటే ఈ అయిదువేల కోట్లు తేవడానికే ప్రభుత్వం మొత్తం అన్ని ప్రభుత్వం శాఖలకు కోత పెట్టింది. బడ్జెట్ లో కేటాయించిన నిధులకు వాత పెట్టింది. మరి బడ్జెట్ కు ఏం విలువ వున్నట్లు? ప్రవేశపెట్టిన రోజు, భజన పత్రికలు..సూపర్...అని చెప్పుకోవడానికి తప్ప?

అయినా..ఇలా జరుగుతున్నా కూడా జగన్ పార్టీ ముందుకు అడుగు వేయకూడదు.

ఒక విధంగా అదే మంచిదేమో కూడా. అసలు రైతులకు ఇలా జరుగుతోంది అని జగన్ పార్టీ ఎందుకు చెప్పాలి? వారికి తెలియదా? ఓటేసినపుడు, రుణమాఫీ అసాధ్యం అని జగన్ చెప్పారు. కానీ రైతులు విన్నారా? లేదుకదా? మరి ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పడం. వారి ఇంగితం వారికి వుంటుంది కదా? రాష్ట్రంలో 80లక్షల మేరకు రుణాలు తీసుకున్న రైతులకు తమ రుణం మాఫీ అయిందో లేదో, వడ్డీ పేరుకుంటోందో లేదో తెలియదా? బ్యాంకులు నోటీసులివ్వడం వారికి తెలియనిదా? 

ఇప్పుడు జగన్ ఎందుకు అరిచి గోలచేయడం. రైతులను వారంతట వారిని తెలుసకోనివ్వండి. ఒకరు చెపితే పాఠం అవుతుంది..వారు నేర్చుకుంటే గుణపాఠం అవుతుంది. పాఠం కన్నా, గుణపాఠం గట్టిది. అది మనసులో నాటుకుపోతుంది. దాన్ని అంతసులువుగా మరిచిపోవడం సాధ్యం కాదు. చంద్రబాబును నమ్మి మోసపోయాం (ఒకవేళ నిజంగా మోసపోతే) అనే గుణపాఠమే జగన్ పార్టీకి ఎక్కువ మేలు చేస్తుంది. 

అందువల్ల జగన్ పార్టీ కొన్నాళ్లు కేవలం పరిస్థితులను గమనిస్తూ, పార్టీని బలోపేతం చేసుకుంటూ, ప్రకటనలకు పరిమితమవుతూ, సమస్యలను ప్రజలు తమంతట తాము తెలుసుకునే వరకు ఓపిక పడితే మంచిదే. బహుశా ఈ దృష్టితోనే అధికార పక్ష నాయకులు కూడా జగన్ తొందరపడుతున్నాడని అంటున్నారేమో?

 


×