cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Chanakya

'మా'లో ఇంత కుళ్లు..కంపు దాగున్నాయా?

'మా'లో ఇంత కుళ్లు..కంపు దాగున్నాయా?

సినిమాలు చూసిన వారికి హీరోలను చూస్తే మతి పోతుంది. ఇంతటి దయామూర్తులు, ఇంతటి ధీరోదాత్తులు, ఇంతటి సాహస వీరులు ఎవరూ లేరనిపిస్తుంది. కానీ తెరవెనుక హీరోలైతేనేం, నటులైతేనేం కొట్టుకుంటున్న తీరు చూస్తే..హవ్వ..వీరా తెరపైకి వచ్చి నీతులు వల్లించేది అనిపిస్తుంది.

మా..అంటూ సినిమా నటుల కోసం సంఘం పెట్టి, ఇప్పుడు దానిపై ఆధిపత్యం కోసం కొట్లాడుతున్న తీరు, ఈ రోజు హీరో రాజేంద్ర ప్రసాద్, ఆయన మద్దతు దారులు బట్టబయలు చేసారు. మా ఎన్నికల వెనుక ఎంతటి గత్తర దాగి వుందో వారు వెల్లడించారు.

వారి మాటల ప్రకారం, ఇప్పటి దాకా మా పై ఆధిపత్యం చెలాయించిన మురళీ మోహన్ ఈ సారి తాను పోటీ చేయనని, ఇంకెవర్నయినా చూసుకోండని చెప్పారు. ఆ మేరకు శివాజీ రాజా తదితరులు చాలా మంది హీరోలను అప్రోచ్ అయ్యారు. వారెవరు తమకు వీలు పడదన్నారు.  దాంతో చెన్నయ్ ప్రాంతంలో షూటింగ్ వున్నపుడు రాజేంద్రప్రసాద్ ను సంప్రదిస్తే, ఆయన సై అన్నారు.

కానీ ఈ విషయం తెలిసాక..మురళీ మోహన్.. స్వయంగా నాగేంద్ర బాబుతో, మా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి రాజేంద్రప్రసాద్ కు స్టేచర్ సరిపోదని అన్నారట. ( ఈ వైనం నాగేంద్రబాబు ఇప్పుడు వెల్లడించారు కానీ, గ్రేట్ ఆంధ్ర ముందే బయటపెట్టింది). మరి మురళీ మోహన్ దృష్టిలో స్టేచర్ అంటే ఏమిటో? ఇప్పుడు మా ఎన్నికల రాజకీయం ముదిరింది. ఎంత ముదిరింది అంటే, ఎన్నికలు నిర్వహించేవారినే నటుడు శివాజీ రాజా తూలనాడే వరకు, ఇలాంటి దుర్మార్గులు వున్న చోటికి తాను రెండేళ్ల వరకు రాను అని అనేవరకు. 

లక్ష రూపాయిలట

మా లో సభ్యత్వం కావాలంటే లక్ష రూపాయిలు చెల్లించాలట. అంటే హీరోలు, పెద్ద నటులు తప్ప వేరే వారికి అవకాశం వుండదన్న మాట. మా లో మూడు కోట్లకు పైగా నిధులు మూలుగుతున్నాయట. కానీ ఏ పేద కళాకారుడికి చేయి విదిలించిన పాపాన పోవడం లేదట. ఒకే ఒక్కరికి నెలకు వెయ్యి రూపాయిలు ఇస్తున్నారట. ఇన్ని కోట్లు వున్న మా సంఘానికి స్వంత కార్యాలయం కూడా లేదట. మా పెద్దలను ఎదిరించిన పాపానికి ఎన్నిసార్లు ఎన్ని దెబ్బలు తిన్నామో..చొక్కా విప్పితే తెలుస్తుందని నటుడు కాదంబరి కిరణ్ కుమార్ అన్నారంటే సిని'మా' సంఘం ఎంతటి రాజకీయాలో చేస్తోందో అర్థం అవుతుంది. 

మీరు పోటీ చేస్తే, తాను పోటీ చేయను అని ముందే చెప్పిన ఆలీ కూడా మాట తప్పి, పోటీ చేస్తున్నారని శివాజీ రాజా వెల్లడించారు. తాము గట్టిగా ఏమైనా మాట్లాడితే బెదిరించామని అంటారన్నారు. దుర్మార్గులు దుష్టుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. వాళ్లు వుండగా తాను మా గడప తొక్కనన్నారు. ఇంతకీ ఎవరో ఆ దుర్మార్గులు, దుష్టులు

నాగేంద్ర బాబు మాట్లాడుతూ, కనీసం వందమంది పేద కళాకారులకైనా మెడి క్లెయిమ్ పాలసీ ఉచితంగా మా సంస్థ అందించలేదా? ఏం చేసుకుంటారు..సంఘానికి పోగయిన కోట్ల సొమ్ముతో అని ప్రశ్నించారు. 

అధ్యక్షపదవికి పోటీ చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, తన కన్నా స్టేచర్, అర్హత వున్న వారు ఎవరూ మా సభ్యులలో లేరని సవాల్ విసిరారు. పోయేటపుడు ఈ ఆస్తులు, స్టేచర్ లు వెంటరావన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, కోట్లు వెంటరావని మురళీమోహన్ ను పరోక్షంగా దెప్పి పొడిచారు. తను మాత్రమే ఏడుకొండలవాడి సమక్షంలో ఇంత స్థలం సంపాదించి, రాజేంద్రప్రసాదం అని సత్రం కట్టించగలిగానన్నారు. తెలుగువాడిని కావడం వల్ల, తను నటించిన అంతర్జాతీయ సినిమా కారణంగా సరైన గౌరవాన్ని అందుకోలేకపోయానన్నారు. 

మరో భాష నటుడైతే అలాంటి సినిమా చేసినందుకు ఏ రేంజ్ లో వుండేదో హడావుడి అన్నారు. తాను మాత్రమే నవ్వు అనే వరం ద్వారా, సినిమాకు వచ్చిన ప్రేక్షకుడికి నవ్వుల మూట ఇచ్చి వెనక్కు పంపానన్నారు. వారి గుండెల్లో సంపాదించిన స్థానం తనకుచాలన్నారు. తనకు మురళీమోహన్, జయసుధ శతృవులు కారని, వారంటే గౌరవం వుందని పేర్లు ప్రస్తావించకుండానే చెప్పారు. తాను ఓట్ల కోసం మొబైళ్లు పంచుతున్నానని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. 

బయటికి వచ్చిన రాజకీయాలు

మొత్తానికి ఈ ఎన్నికలు మా సంఘంలో వున్న ఆధిపత్య ధోరణిని, అపసవ్య విధానాలను బయటకు తెచ్చాయి. లక్ష రూపాయిల నుంచి సభ్యత్వ రుసుము తగ్గిస్తే, ఒక్క సినిమా, రెండు సినిమాలు చేసిన వారికి కూడా సభ్యత్వాలు దక్కుతాయి. దాంతో సభ్యులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతారు. అప్పుడు మా సంఘంపై ఆధిపత్యం చెలాయించడం కష్టం అవుతుంది. ఇదీ ఇప్పుడు బయటకు వచ్చిన నిజం. 

అలాగే మా తరపున షో లు నిర్వహించి జనం నుంచి మూడు కోట్లకు పైగా పోగేసారు. కానీ కళాకారుల కోసం పైసా ఖర్చు చేయకుండా అలా మూలన పెట్టారు. పేదకళాకారులను ఆదుకుంటామని చెప్పి, ఒక్కరికి మాత్రమే పింఛను ఇస్తున్నారు. తిరిగి మెడీ క్లయిమ్ పాలసీ అని ముక్కు పిండి వసూళ్లు సాగిస్తున్నారు.

మరి ఏడువందల పైచిలుకు సభ్యులు మురళీ మోహన్ అండ్ కో అధికార కాంక్షకు తలవొగ్గుతారో, లేక మా ను సంస్కరించాలని రాజేంద్ర పసాద్ కు ఓటేస్తారో? చూడాలి.

 


×