రాజకీయాలు ఇలా బయటపడ్తున్నాయ్‌.!

మాలో మేం ఎన్నయినా అనుకుంటాం.. చివరిగా మేమంతా తెలుగు సినీ కళామతల్లి బిడ్డలం.. అని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సందర్భానుసారం చెప్పుకోవాల్సి వచ్చింది. గతంలో పరిస్థితి ఇలా వుండేది కాదు.…

మాలో మేం ఎన్నయినా అనుకుంటాం.. చివరిగా మేమంతా తెలుగు సినీ కళామతల్లి బిడ్డలం.. అని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సందర్భానుసారం చెప్పుకోవాల్సి వచ్చింది. గతంలో పరిస్థితి ఇలా వుండేది కాదు. ఈ స్థాయిలో అంతర్గత విభేదాలూ వుండేవి కాదు. గతంలో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం వుండేది. ఇప్పుడు రాజకీయాలు సినీ రంగాన్ని శాసిస్తున్నాయి.

‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ (మా) అధ్యక్ష ఎన్నికల్లో జయసుధ ప్యానల్‌కీ, రాజేంద్రప్రసాద్‌ ప్యానల్‌కీ మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్‌, బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాననీ, వేరేవారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నానని ప్రకటించగానే, ముందుగా తెరపైకొచ్చింది రాజేంద్రప్రసాద్‌ పేరు. సీనియర్‌ నటుడైన రాజేంద్రప్రసాద్‌ తనకు ‘మా’ అధ్యక్షుడిగా పనిచేయాలని వున్నట్లు వెల్లడించారు.

రాజేంద్రప్రసాద్‌ ‘మా’ అధ్యక్షుడైతే మాకెవరికీ అభ్యంతరం లేదు.. అని సినీ ప్రముఖుల్లో చాలామంది తొలుత వ్యాఖ్యానించారు. ఇప్పుడేమో పరిస్థితులు మారిపోయాయి. చివరి నిమిషంలో జయసుధ పేరు తెరపైకొచ్చింది. ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్‌, జయసుధ పేరుని ప్రతిపాదించారు. అంతే, రాజకీయాల్లో చేసుకునే విమర్శల స్థాయిలో సినీ రాజకీయం విమర్శలు షురూ చేసింది. మహిళా కార్డుని తెరపైకి తెచ్చిన జయసుధ, కొన్ని రాజకీయ శక్తులు తనకు అడ్డం తగులుతున్నాయనేశారు.

దాంతో, రాజేంద్రప్రసాద్‌ మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఆయనా, తనదైన స్టయిల్లో ఏవో రాజకీయ విమర్శలు చేసేయడంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ‘మా’ అధ్యక్ష పదవికి అంత డిమాండ్‌ ఏంటి.? అని అందరూ చర్చించుకోవాల్సి వస్తోందిప్పుడు. తాను పదవిలో వుండటంలేదని చెప్పినప్పుడే మురళీమోహన్‌, జయసుధ పేరు తెరపైకి తెచ్చి వుంటే ఈ గందరగోళం వుండేది కాదేమో. ఎంతైనా ఎంపీ అయ్యారు కదా.. రాజకీయాల్లో తలపండిన ఆయన ఆ రాజకీయ చాతుర్యాన్ని సినీ రంగంలో ఉపయోగించారన్న వాదనలు విన్పిస్తున్నాయి.

ఎవరు గెలుస్తారు.? అన్న విషయం పక్కన పెడితే, సినీ పరిశ్రమలో విభేదాలు ‘మా’ అధ్యక్షు ఎన్నికల సాక్షిగా బట్టబయలయ్యాయన్నది నిష్టురసత్యం.