cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Chanakya

తప్పెవరది బాబాయ్?

ఎక్కడ వుంది లోపం? అప్పు తీరిస్తే అప్పు చేస్తారు..చేయక తప్పదు. పంట పండించాలంటే అప్పు చేయాలి. పండితే అప్పు తీరాలి..పండకుంటే అప్పు తీరదు..ఆత్మహత్యలు తప్పడం లేదు. 

ఇప్పటికి వున్న అప్పులు తీర్చడానికే ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. హామీని నిలబెట్టుకోవడానికి అయిదేళ్లు పడుతోంది. వాయిదాల పద్దతిలో తీరుస్తోంది. మరి ఈ అయిదేళ్లలో మళ్లీ పుట్టుకువచ్చే కొత్త అప్పుల పరిస్థితి.  పైగా ప్రభుత్వం తీరుస్తుంది అని తెలిసిన తరువాత,

రాష్ట్రంలో ఎక్కడ చూడండి..చంద్రన్న విజయాలు అంటూ హోర్డింగ్ లు. వాటి సారాంశం ఒక్కటే..వేల కోట్లు ఖర్చుచేసి, వేలాది మంది రైతుల రుణాలు ప్రభుత్వం తీర్చింది. సంతోషం..ప్రభుత్వం రైతులకు మంచే చేసింది.
ఈరోజు ఒక దినపత్రికలో వార్త, ప్రకాశం జిల్లాలో అప్పు లేని రైతు లేడు. ఆత్మహత్యలు గడచిన వారంలో మూడు. కారణం, పొగాకు పంట రైతు ఇంట మురిగిపోతోంది. పంట కోసం చేసిన అప్పులు తీరడం లేదు. అప్పుచేయని రైతు లేడు.

ఎన్నికలు అంటూ వస్తే రుణ మాఫీ హామీ పలకరిస్తుందని తెలిసాక తీర్చగలిగిన రైతు కూడా తీర్చడు. ఇది రైతులపై నింద వేయడం కాదు. గ్రామాల్లో వుండేవారికి తెలిసిన నికార్సయిన వాస్తవం. ప్రభుత్వం రుణమాఫీ చేసిన తరువాత కూడా, అర్హులం కాదు, తమకు రుణమాఫీ జరగదు అని తెలిసిన వారు కూడా బకాయిలు ఇంకా చెల్లించడం లేదు. వారికి ఇంకా ఆశ మిగిలివుంది. ఏ క్షణమైనా ప్రభుత్వం తమను జాబితాలో చేరుస్తుందని.

ఇలాంటి నేపథ్యంలో మళ్లీ కొత్త అప్పులు, మళ్లీ ఆత్మహత్యలు, ఆపై రాజకీయ నినాదాలు..ఏమిటీ పరిస్థితి..దానికి ఏమిటి పరిష్కారం..అసలు ప్రభుత్వాలు కానీ, పార్టీలు కానీ, రూట్ కాజ్ లోకి వెళ్లి చూస్తున్నాయా? అసలు ప్రతి ఆత్మహత్య కేసును ఇండిపెండెంట్ స్టడీ చేయాల్సి వుంది. ఆత్మహత్యలకు ఏదైనా సారూప్యం వుందా అన్నది పరిశోధించాలి. వరి పండించే రైతుల కన్నా, వాణిజ్య పంటలు పండించే రైతుల ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న విమర్శ ఒకటి వుంది. దాని నిగ్గు తేల్చాలి. కౌలు రైతులు అత్యాశకు పోతుంటే నివారణకు మార్గం చూడాలి.

అసలు ఏయే జిల్లాల్లో ఎక్కువ ఆత్మహత్యలు వుంటున్నాయో, అక్కడే ఎందుకు వుంటున్నాయో శోధించాలి.  రైతు తను తినడానికి సరిపడా లేదా, తనకు కావాల్సిన ఆదాయానికి సరిపడా పండించడానికి ఎంత ఖర్చు అవసరం? ఆ మేరకు రైతుకు వస్తురూపేణా. అంటే ఎరువులు, విత్తనాలు వగైరా కింద సాయం చేయాలి.

అవసరం అయితే కూలీలను కూడా ఉపాథి హామీ మీద అందచేసే అవకాశం వుంటుందా అన్నది చూడాలి. ఇలా అందించిన సాయం అంతా నగదు కింద లెక్కించి, దాన్ని వడ్డీ లేని రుణం కింద మార్చాలి.

ఎన్నికలు, ఓట్లు అన్నవి పక్కన పెట్టి, నిర్మొహమాటంగా వసూలు చేయాలి. లేదా పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి, మిగిలిన మొత్తం చెల్లించాలి. చాలా మంది సాగు చేయని వారు, భూములు కౌలుకు ఇచ్చిన వారు పట్టణాల్లో వుంటూ పంట రుణాలు తీసుకుని, బంగారం కొనుక్కోవడం లేదా పిల్లల చదువులకు ఖర్చు చేయడం జరుగుతోంది. వాళ్లకీ మాఫీ ఫలాలు అందుతున్నాయి. కానీ ఆ భూములు కౌలుకు తీసుకున్నవారు ప్రయివేటు వ్యాపారులను ఆశ్రయిస్తూ, ఆత్మహత్యల పాలవుతున్నారు. అందుకే ప్రభుత్వం కానీ, బ్యాంకులు కానీ రుణాలను నగదు రూపంలో ఇవ్వకూడదు.

ఇంటికి, బండి కొనుక్కోవడానికి రుణం ఇస్తున్న బ్యాంకులు వాటిని నగదు రూపంలో ఇవ్వడం లేదుగా..రైతుకు కూడా ఎరువులు, విత్తనాల సంస్థలకు చెక్కులుగా ఇవ్వాలి. దీనివల్ల రెండు ఉపయోగాలు. వ్యర్థ రుణాలు తగ్గుముఖం పడతాయి. రెండవది ఒకవేళ ప్రభుత్వం రుణమాఫీ చేసినా నిజమైన అర్హులకు అందుతాయి.

ప్రభుత్వం పదేపదే వ్యవసాయాన్ని లాభసాటి చేస్తామంటుంది..ఎలా చేస్తామన్నది మాత్రం చెప్పదు. పొగాకు లాంటి పంటలు పండించి, అమ్మకం కోసం ప్రభుత్వంపై ఆధారపడే కన్నా, కూరగాయలు, పళ్లు, పప్పు దినుసుల పండించి, నేరుగా అమ్ముకునే అవకాశాలు పెంచుకునేలా రైతులను ప్రోత్సహించాలి. సాంప్రదాయ సేద్యం నుంచి రైతును మళ్లించాలి. 

కానీ దురదృష్ట వశాత్తూ, తాత్కాలిక ప్రయోజనం ఇచ్చే రుణమాఫీ వంటి వాటపై వున్న ఆసక్తి, పంటను నిలబెట్టుకోవడం, అమ్ముకోవడం, బతకడం వంటి వాటిపై ఇటు రైతులలోనూ, అటు ప్రభుత్వంలోనూ ఆసక్తి తక్కువే. వాళ్లకి ఓట్లు కావాలి..వీళ్లకి డబ్బులు కావాలి. అంతే..బతుకు అంటే అందరికీ చులకనే.

 


×