Advertisement


Home > Articles - Kapilamuni
‘‘వెంకన్నా.. నీ సన్నిధిలో మేం ఎట్టా బతకాల?’’

అయ్యా ఏడుకొండల సామీ...

నీకేంలే సామీ.. నిత్యపూజల మధ్య అంతులేని సంపదలతో తులతూగతా ఉంటావు. కాలాలూ రుతువుల్తో సంబంధం లేకుండా రోజుకు యెకాయెకిన లక్ష మందైనా వొచ్చి నిన్ను సేవించుకుని పోతా ఉంటారాయె. అందరినీ చల్లగా జూసుకుంటా నువ్వు సక్కంగానే ఉంటావు. మరి నిన్నే నమ్ముకోని.. నీ సన్నిధిలో ఏదో రవ్వంత పొట్టపోసుకోడానికి చిన్నచిన్న పనులు చేసుకుంటూ ఉండే మేం ఎట్ట బతకాల!

చూడు యెంకటేసులు సామీ... దేశం మొత్తమ్మీద హిందువుగా పుట్టిన పెతివోడూ.. జన్మలో ఒక్కసారైనా నిన్న చూడాల అనుకుంటాడు. ఎక్కడెక్కడినుంచో నిన్ను చూడ్డానికి ఎగబడి వొస్తా వుంటారు. నీ దర్శనం దొరికితే అచ్చంగా క్షణమే అయినా.. జన్మ ధన్యమైపోయిందని సంబరంగా పోతావుంటారు. మరి.. నీ దర్శనానికి ఉన్నంత విలువ నా ప్రసాదానికి కూడా ఉండాది కదా.

కొండ లడ్డూ అంటే.. ఎవురో ఊరికొక్కరు తిరపతి కొండకు పొయ్యేసొస్తే.. తెచ్చిన లడ్డూ ప్రసాదానికి ఇంట్లో పూజలు చేసి.. ఊరంతా ఒక్కొక్క ముక్క పంచిపెట్టేది. ఇయ్యాల జనం దగ్గర డబ్బులెక్కువైపోయి.. ఎన్ని దొరికితే అన్ని లడ్డూలు తీసుకోని పోతున్నారనుకో. మరి నీ గుడి యవ్వరాలు చూసే టీటీడీ వోళ్లు గూడా.. నీ ప్రసాదాన్ని అంగడి లడ్డూలాగా  మార్చేసి.. దండిగా లడ్డూలు కావాలంటే పాతిక లెక్కన అమ్ముతూ ఉంటిరి. పాతిక లెక్కన గూడా అడిగినోళ్లందరికీ యియ్యకుండా.. సిఫారసు ఉత్తరాలకి మాత్రమే యిస్తుంటిరి.

మరేదో నాబోటోళ్లు ఆపీసర్ల దగ్గర నాలుగు లెటర్లు తెచ్చుకోని.. ఆటి మీద పాతిక లెక్కన లడ్డూలు కొనుక్కోని.. కావాల్సినోళ్లకి యాబై లెక్కన... ఎర్రోడు ఎవుడైనా దొరికితే వంద లెక్కన అమ్ముకుంటా.. నీ సన్నిదానంలో సల్లంగా బతికిపోతా ఉండాము. ఇప్పుడు నీ టీటీడీవోళ్లు ఏకంగా ఆ లడ్డూల దరను యాబై రూపాయలకు పెంచేస్తే ఎట్టా సామీ.. మేం ఎట్టా బతకాల?

నీ ప్రసాదాన్ని అమ్మడమే యాబై అయితే.. మేం బ్లాకులో ఎంతకు అమ్ముకోవాల? అంతలేసి సొమ్ములు గుమ్మరించి కొనుక్కొనేంత భక్తులు ఎవురుంటారు? అలాంటోళ్లు రోజూ ఉంటారని.. మా బుట్టలో పడతారని.. మా భోషాణం నింపుకోవచ్చని గ్యారంటీ ఏంది? ఏదో నిన్ను నమ్ముకోని తిరుమల కొండ యీదుల్లో బతుకు గడిపేస్తా ఉంటే.. ఇట్టాంటి పనిజేసినావేంది యెంకటేసులు సామీ. నీ కిదేమైనా నేయంగా ఉండాదా?

రేటు పెంచి పారేస్తే.. నాబోటోళ్లు ఏమైపోవాల? రోజు నీ లడ్డూల్ని మారు బేరానికి అమ్ముకోడానికి నా పెట్టుబడి ఎంత పెరిగిపోవాల? నా లాభాలు ఎట్టా గిట్టుబాటు కావాల? నిన్నతా ఆశ్రిత వత్సలుడు అంటారే.. నమ్ముకున్నోళ్లకు నువు జేసేది ఇదేనా సామీ.

అయినా పోన్లే.. లడ్డూ దర యాబై చేస్తే జేసినావు గానీ.. ఆ రేటుకైనా సరే.. అడిగిన భక్తులందరికీ ఇయ్యకుండా... సిఫారసు ఉత్తరాలకు మాత్రమే అని కండీషను పెట్టినావు గదా.. అంతవరకు థాంక్సు సామీ.. ఎందుకంటే.. అట్టాంటి పితలాటకం ఉంటే తప్ప నాబోటోళ్లు బతకలేరు గదా..! వొచ్చిన పెతి వోడికీ అడిగినన్ని లడ్డూలు అమ్మేస్తే.. ఇక మా మారుబేరం యాపారం సాగేదెట్టా? కాబట్టి అంతవరకూ నిన్ను నమ్ముకున్నందుకు నీకు దండాలు సామీ. సిఫారసు ఉత్తరాల ఊసు ఎత్తేసే ఆలోచన అదికార్లకు ఇయ్యబాక సామీ.. ఇదే మా వేడుకోలు. ఎందుకంటే అలా జరిగితి మా పొట్ట కొట్టినట్టే. మా నోటికాడ దందా లాగేసినట్టే.

సామీ నీ మీద జనానికి భక్తి ఇంకా పెరగాల. మా యాపారం కూడా సల్లంగా సాగాల...

ఇట్లు..

నీమీద.. నీ లడ్డూల మీద భక్తితో..

ఒక  లడ్డూ దళారీ...