Advertisement

Advertisement

indiaclicks

Home > Articles - Kapilamuni

మన జేబులో డబ్బులకు చిల్లెట్టే అవిడియా!

మన జేబులో డబ్బులకు చిల్లెట్టే అవిడియా!

గవుర్మెంటన్నాక.. మన జేబులోకి నాలుగుకాసులు రాలే అవిడియాలు జెయ్యాల. దానర్థం.. స్కీములనీ, చింతకాయలనీ, భృతి అనీ.. మన మొహాన ముస్టి యెయ్యడం గాదు.. మన బతుకులు బాగుపడి మనమే నాలుగు డబ్బులు కల్లజూసే మాదిరిగా మనల్ని తయారుజెయ్యాల.. అట్టాంటి అవకాశాల్ని ఆళ్లు మనకి కలిగించాల.

అంటే యేంటి జెయ్యాల.. మంచి మంచి బళ్లూ, కాలేజీలు బెట్టాల.. మన బిడ్డల్ని సావగొట్టి, సంపుకుతినే కాలేజీలు గాకుండా.. సదువులు జెప్పే కాలేజీలు బెట్టించాల... డిగ్రీల కాయితాలు పంచే యూనివర్సిటీలు గాకుండా మన బుర్రల్లో కాసింత గుజ్జును నింపి పంపే యూనివర్సిటీలను బెట్టించాల.. ఆణ్నించి బయటికొచ్చినాక పన్జేసుకుని బతికేదానికి నాలుగు ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు బెట్టించాల.

ఇయ్యన్నీ మేం జేసేస్తండాంలే.. యిదిగో అదిగో లచ్చల కోట్ల ఇండస్ట్రీలు వొచ్చేస్తన్నాయీ.. అని గవుర్మెంటు అంటాది. ఏంటో మరి.. అయి ఏదార్లో ఉండాయో.. గోదార్లో ఉండాయో మనకు తెల్దుగానీ.. మన వాకిటి దాకా వొచ్చేసరికి మన బతుకులు తెల్లారిపోయేట్టే ఉండాది.

కాపోతే.. మన జేబులో నాలుగు డబ్బులు బెట్టే అవిడియాలు పక్కన బెట్టేసి.. మన జేబుకు చిల్లెట్టి ఉండే డబ్బులు కాజేసే అయిడియాల్ని మాత్తరం గవుర్మెంటోళ్లు అర్జంటుగా నడిపించేస్తండారు. మనూళ్లల్లో పెద్దపెద్ద సినిమా కొట్టాయిలు అదే సినిమా హాళ్లు గడతారంట. మామూలుయి గాదులే ... అయిద్రాబాదులో వుండేమాదిరివి. ఆటిలో ఇంకా మన ఫ్యామిలీ మొత్తం ఎంటర్ టైన్ మెంటు అయిపోడానికి శానా శానా ఉంటాయంట. 

అంటే.. ఒక్కసారి గనక మన కుటుంబం మొత్తాన్నీ యేసుకోని ఆడికి బొయినామంటే.. మన జీతాలు, జీవితాలు మొత్తం ఖాలీ జేసేసుకోవాలన్నమాట. యీటికోసం.. అంటే మనకు ఎంటర్ టైన్మెంటు ప్రసాదించి.. మన కాసులకు కత్తిరేసే యవ్వారానికి మన సర్కారోళ్లు.. అదేదో కంపెనీ వోళ్లకి సవగ్గా మనూళ్లో బూములిచ్చేసి.. సర్కారు డబ్బుల్నే.. అంటే మన డబ్బుల్నే తొలుత పెట్టుబడులు గూడా బెట్టి.. ఎంకరేజింగు జేస్తారంటే.

ఓయబ్బో.. మన ఎంటర్ టైన్మెంటు, యినోదం కోసం సర్కారుకు ఎంత ప్రేమ పుట్టుకొచ్చేస్తండాదో గదా!

-కపిలముని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?