దాణా కుంభకోణ నిందితుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఎట్టకేలకు చట్టానికి చిక్కి నాలుగేళ్ల శిక్ష అనుభవించడానికి జైలుకి వెళ్లడం విస్మయం కలిగించింది. అది జరిగిన తీరుతెన్నులు యీ పాటికి అందరికీ తెలుసు. క్లుప్తంగా చెప్పాలంటే – పశువుల దాణాకై బజెట్‌లో ఓ 45 కోట్ల రూ.లు ఎలాట్ చేసేవారు.
కానీ ఏడాది చివరకు వచ్చేసరికి 200 కోట్ల రూ.లు అయ్యేది. అయ్యో యింత అవుతోంది కదాని మరుసటి ఏడాది ఏ 250 కోట్లో ఎలాట్ చేసేవారు కారు. మళ్లీ 48 కోట్లు.. అంతే! బజెట్ సెషన్‌లో యీ అంకెలే చూసేవారు తప్ప నిజానికి ఎంత ఖర్చవుతోంది అనేది పట్టించుకునేవారు. ఏడాది పొడుగూతా జరిగే కార్యక్రమం ఏమిటంటే – పట్నా సెక్రటేరియట్‌లో వున్న ఏనిమల్ హజ్బెండరీ (పశు సంవర్ధక) శాఖ నుండి బజెట్ కేటాయింపులతో నిమిత్తం లేకుండా ఒక దొంగ ఎలాట్‌మెంట్ లెటర్ జిల్లా స్థాయి కార్యాలయానికి వెళ్లేది. అది పెట్టుకుని జిల్లా అధికారి లేని పశువులను చూపించి వాటి మేతకోసం, మందులకోసం, యంత్రసామగ్రికోసం ఆర్డర్లు తయారుచేసేవాడు. అవి డెలివర్ చేసినట్టుగా దొంగ రసీదులు తయారుచేసేవారు. ట్రక్కు రిజిస్ట్రేషన్ నెంబర్లు వేయాల్సిన జాగాలో స్కూటర్‌ల నెంబర్లు వేసేవారు. ఆ ఆర్డర్ల ఆధారంగా చలాన్లు తయారయ్యేవి. సరుకు ముట్టినట్టుగా స్టాఫ్ దొంగ రసీదులు తయారుచేశేవారు.
అవి రావడం వలన స్టాకు పెరిగినట్లు రిజిస్టరులో రాసేవారు. ఈ రసీదుల ఆధారంగా పేమెంటు ఆర్డర్లు తయారయ్యేవి. వాటిని ట్రెజరీ డిపార్టుమెంటు క్యాష్‌లో చెల్లించేది. ఈ విధంగా పశు సంవర్ధక శాఖలో అందరూ బాగా డబ్బు చేసుకున్నారు. వారికి రాజకీయనాయకులు మద్దతు యిస్తూ వచ్చారు. వాటాలు పంచుకున్నారు.
సెక్రటేరియట్‌లోని పశు సంవర్ధక శాఖలో పని చేసే ఒక గుమాస్తా టూర్లు గమనిస్తే విషయం బోధపడుతుంది. పట్నా నుండి అతను బస్సెక్కి మర్నాడు ఉదయం రాంచీలో చేరేవాడు. ఈ కుంభకోణానికి రాంచీ కేంద్రస్థానంగా వుంది. అతను ట్రెజరీ శాఖనుండి సప్లయర్ల పేర తయారుచేసిన చెక్కులు తీసుకుని మధ్యాహ్నం ఢిల్లీ విమానం ఎక్కేవాడు. సాయంత్రం అక్కడ దిగేవాడు. ఆ చెక్కులు వాళ్ల కిచ్చేసి ఆ రాత్రే ఢిల్లీ నుండి మగధ ఎక్స్‌ప్రెస్ ఎక్కి పొద్దున్న పట్నాలో దిగేవాడు. ప్రతీ రెండు నెలలకు క్రమం తప్పకుండా యిలాగే తిరిగేవాడు. మామూలుగా అయితే దీన్ని కనిపెట్టడం కష్టమే కానీ, చాలా ఏళ్లకు ఎక్కవుంట్స్ కంప్యూటరైజ్ చేయడంతో ఎ.జి.(ఎక్కౌంటెంట్ జనరల్) ఆఫీసువారికి యీ పేటర్న్ తెలిసిపోయింది. ఆ గుమాస్తాను పట్టుకుని ‘నీకు రాంచీ, ఢిల్లీ లలో ఏం పని? విమానంలో వెళ్లడానికి నీకు డబ్బెవరిచ్చారు?’ అని నిలదీశారు. అతను సంగతంతా చెప్పేశాడు. విషయం బయటపడిరది.
1970లలో జగన్నాథ్ మిశ్రా ముఖ్యమంత్రిగా వుండే రోజుల నుండి యీ భాగోతం జరుగుతూ వచ్చింది. అది ముఖ్యమంత్రికి తెలిసినా వూరుకునేవారు. పోనుపోను అది శ్రుతి మించింది. 1985లో కాగ్ వారు దీన్ని బిహారు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు కానీ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. అతనే కాదు, ఆ తర్వాత వచ్చిన ఏ ముఖ్యమంత్రీ పట్టించుకోలేదు. ఆడిటర్ జనరల్ ఆఫీసువాళ్లు అడుగడుగునా హెచ్చరిస్తూనే వున్నారు. అయినా వినేవాడే లేడు. ఈ అవినీతి లాలూ హయాంలో మితిమీరింది. తన అవినీతి గురించి ఆధారాలు బయటపడుతున్నా లాలూ పట్టించుకోలేదు. ఇవన్నీ నిరూపించడం కష్టం అనుకుని అహంకరించాడు. పత్రికలు హెచ్చరిస్తున్నా మొండిగా వ్యవహరిస్తూ తనకేం కాదని దబాయించాడు. ఆ ధీమాయే అతన్ని కొంపముంచింది. జైలుకి పంపింది. జైలుకి వెళ్లి వచ్చాక లాలూకి బుద్ధి వచ్చింది. రైల్వే మంత్రిగా పని చేసిన ఐదేళ్లూ (2004-09) అవినీతి ఆరోపణలు రాకుండా జాగ్రత్త పడ్డాడు. అంతేకాదు, రైల్వే రవాణా విభాగాన్ని కంప్యూటరైజ్ చేయించి, అక్కడ జరుగుతున్న అండర్ యిన్వాయిసింగ్ (రవాణా చేసిన సరుకుల బరువు తక్కువగా చూపడం) వంటి నేరాలను అరికట్టాడు. కానీ చివరకు పాతనేరం నీడ వెంటపడి కాటేసింది.
‘లక్ష కోట్ల అవినీతి అనేదాన్ని అతి చులాగ్గా మాట్లాడేస్తున్న యీ రోజుల్లో ఆ అవినీతి పన్నెండు వందల కోట్లే. ఆ మాత్రానికే యింత శిక్షా? ఈ మాత్రం దానికి శిక్షేం పడుతుంది? ఈ నాయకులు సులభంగా బయటపడతారు’ అనుకున్నాం. కానీ తప్పించుకోవడానికి వీలులేకుండా పకడ్బందీగా కేసు తయారు చేసిన అప్పటి సిబిఐ తూర్పు విభాగానికి జాయింటు డైరక్టరుగా వున్న ఉపేన్ బిశ్వాస్, అతని బృందం కారణంగానే యిది సాధ్యపడిరది. మరి అతనిపై ఒత్తిళ్లు రాలేదా? వస్తే ఎలా తట్టుకున్నాడు? ఇవన్నీ ఆసక్తి కలిగించే ప్రశ్నలు. ఇవన్నీ సాధారణంగా బయటకు రావు. కానీ ఉత్తమ్ సేన్‌గుప్త అనే ‘ఔట్‌లుక్’’ డిప్యూటీ డైరక్టరు చాలా విషయాలు ‘‘ఔట్‌లుక్’’ పాఠకులతో పంచుకున్నారు. అప్పట్లో ఆయన ‘‘టైమ్స్ ఆఫ్ ఇండియా’’ పట్నా బ్రాంచ్‌కు రెసిడెంట్ ఎడిటర్. ఆయన రాసిన కొన్ని విషయాలను (సౌజన్యం – ‘‘ఔట్‌లుక్’’) మనకు యిప్పటిదాకా తెలిసినవాటితో కలిపి చూస్తే … 1990 మార్చిలో జనతాదళ్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది.
ముఖ్యమంత్రి పదవికై ముగ్గురు అభ్యర్థులు పోటీ పడ్డారు. వారిలో లాలూ నెగ్గారు. అప్పుడు ఉత్తమ్ అతన్ని ఇంటర్వ్యూ చేస్తే ‘‘మా నాన్న వెటర్నరీ కాలేజీలో బంట్రోతు. నాల్గవ తరగతి ఉద్యోగుల క్వార్టర్స్‌లోనే నేను పెరిగాను. ముఖ్యమంత్రి అయినా అక్కడే నివసిస్తాను.’’ అని చెప్పాడు. కానీ అతి త్వరలో అధికారిక నివాసమైన బంగళాలోకి మారిపోయాడు. రెండేళ్లు గడిచేసరికి లాలూ చాలా పాప్యులర్ అయిపోయాడు. రథయాత్ర సందర్భంగా ఆడ్వానీని అరెస్టు చేసి మతతత్వవాదులను కట్టడి చేసినందుకు మీడియా అతన్ని ఆకాశానికి ఎత్తేసింది. వచ్చే 20 ఏళ్ల దాకా నేను రాష్ట్రాన్ని పాలిస్తాను అని లాలూ చెప్పుకునేవాడు.
బిహార్ యాంటీ కరప్షన్ బ్యూరోలో ఇనస్పెక్టర్‌గా పని చేసే బిధు భూషన్ ద్వివేది అనే అతను 1992లో దాణా కుంభకోణం గురించి వివరంగా నివేదిక తయారు చేశాడు. తమ శాఖ డైరక్టర్ జనరల్‌నుండి ముఖ్యమంత్రి స్థాయిదాకా అవినీతి పాకిపోయిందని రాశాడు. వెంటనే అతన్ని వేరే యానిట్‌కు బదిలీ చేసి, ఆ పై సస్పెండ్ చేసేశారు. (1996లో హైకోర్టు ఆదేశాల మేరకు అతని ఉద్యోగం అతనికి దక్కింది. కేసులో అతను ఒక ముఖ్యమైన సాక్షి.) అదే సంవత్సరం రాంచీ ఎయిర్‌పోర్టులో ఢల్లీి వెళ్లే ఇండియన్ ఎయిర్‌లైన్సు విమానం బయలుదేరబోతూండగా ఇన్‌కమ్‌టాక్స్ అధికారులు వెళ్లి ఆపారు.
పశు సంవర్ధక శాఖ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు నల్లడబ్బుతో వెళుతున్నారని వాళ్లకు సమాచారం అందింది. విమానం నుండి దింపి తనిఖీ చేయడానికి రమ్మనమంటే పట్టుబడతామన్న భయంతో వాళ్లు చెకింగ్ పాయింటుకి వెళ్లే దారిలోనే తమ హ్యేండ్ బ్యాగ్‌ల్లోంచి, బ్రీఫ్ కేసుల్లోంచి నోట్లకట్టలు, నగలు తీసి కిందపడేసి చెకింగ్‌కు వెళ్లారని కళ్లారా చూసినవాళ్లు చెప్పారు. అది స్థానిక దినపత్రికల్లో వచ్చింది. కానీ పెద్ద పత్రికలు దాన్ని పట్టించుకోలేదు. ఇన్‌కమ్‌టాక్స్ డిపార్టుమెంటు కూడా గప్‌చుప్‌గా కూర్చుంది. ఇక అందరూ దాని గురించి మర్చిపోయా . -(సశేషం)
ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]