Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: మృచ్ఛకటికమ్‌- 11

ఆ సమయంలో స్థావరకుడనే శకారుడి బండివాడు బండితో సహా ఆ వీధిలోకి వచ్చాడు. పుష్పరండకం ఉద్యానవనంలో వుంటాను రమ్మనమని శకారుడు అతని చెప్పాడు. ఉజ్జయినికి యితర ప్రాంతాల నుంచి వచ్చిన బళ్లవాళ్లతో వీధంతా నిండిపోయి వుండి అతను ముందుకు వెళ్లలేకపోతున్నాడు. 'ఒరేయ్‌ పల్లెటూరి బైతుల్లారా, ఇది ఎవరి బండి అనుకుంటున్నారురా? సంస్థానకుడు (శకారుడు పదవి పేరు) గారి బండి. దారి వదలకపోతే ఎలా? ఆయన అక్కడ నా గురించి కాచుకుని వున్నాడు.' అని దబాయిస్తున్నాడు. అంతలో అతని కంటికి చాటుచాటుగా తప్పుకుంటున్న వ్యక్తి కనబడ్డాడు. అప్పులాళ్ల నుంచి తప్పించుకుని పారిపోతున్నట్లున్నాడే అనుకున్నాడు, అంతలోనే నాకెందుకు వాడి గోల అనుకున్నాడు. (ఇతను నిజానికి చెఱసాల నుంచి తప్పించుకుని పారిపోతున్న ఆర్యకుడు). ఇంతలో ఎదురుగా వస్తున్న బళ్లల్లో ఒకదాని చక్రం బురదలో యిరుక్కుపోయింది. చక్రాన్ని బయటకు లాగడంలో సాయం చేయమని యితన్ని అడిగారు. విసుక్కుంటూనే సరే అన్నాడు. దారి మధ్యలో ఆపితే వాహనాలు మరింతగా యిరుక్కుపోతాయని, బండిని పక్క వీధిలో ఖాళీ వున్నచోటికి తీసుకుని వెళ్లి ఆపాడు. అది సరిగ్గా చారుదత్తుడి పెరటిగుమ్మం తలుపు దగ్గర, యిందాకా వర్ధమానకుడు బండి ఆపిన చోటే అయింది. బండి ఆపి మరో బండివాడికి సాయపడడానికి వెళ్లాడు.

మళ్లీ బండి చప్పుడు వినబడడంతో వసంతసేన దాసి తివాచీ వేసుకుని వచ్చిన చారుదత్తుడి బండే అనుకుంది. వసంతసేనతో బండి వచ్చేసిందని చెప్పింది. వసంతసేన వచ్చి బండి ఎక్కబోతూ వుంటే ఆమె కుడికన్ను అదిరింది. ఇదేం అపశకునం అనుకుని, చారుదత్తుడి వంటి సజ్జనుణ్ని చూడగానే యీ దుష్ఫలం తొలగిపోతుందిలే అనుకుంది. స్థావరకుడు తిరిగి వచ్చి బండి తోలసాగాడు. బరడి బరువెక్కిందా అని అనుమానం వచ్చింది కానీ చక్రం ఎత్తడం వలన కలిగిన అలసట వలన అలా అనిపిస్తోందనుకుని సమాధానం చెప్పుకున్నాడు. 

ఆ బండి వెళ్లగానే వర్ధమానకుడు తివాచీ వేయించుకుని బండిని తెచ్చాడు. ఈ లోపున ఆర్యకుడు అటుగా వచ్చాడు. అతన్ని ఖైదు నుంచి శర్విలకుడు విడిపించాడు. కాలికి గొలుసులతోనే యితను బయటపడి ముసుగు వేసుకుని పరిగెట్టుకుంటూ పోతున్నాడు. అతన్ని కాపలావాళ్లు వెంటాడుతున్నారు. వాళ్ల చూపు తప్పించుకోవడానికి చారుదత్తుడి పెరటిగుమ్మం సందులోకి దూరాడు. అక్కడ వసంతసేన కోసం ఆగిన బండి కంటపడింది. వర్ధమానకుడు రదనికను ఉద్దేశించి బండి వచ్చిందంటూ కేక పెట్టాడు. ఆర్యకుడు బండి వెనక్కాలకు నడిచి వచ్చాడు. అతన్ని చూడకుండా శృంఖలాల చప్పుడు మాత్రం విన్న  వర్ధమానకుడు అది వసంతసేన కాలి అందెల చప్పుడనుకున్నాడు. ముందు నుంచి ఎక్కితే ఎద్దులు పొడిచేట్లున్నాయి, వెనకనుంచి ఎక్కండి అన్నాడు. ఆర్యకుడు వెనక్కాల నుంచి బండిలోకి ఎక్కి దాగున్నాడు. బండి బయలుదేరింది.

ఆర్యకుడు తప్పించుకుని పారిపోతున్నాడన్న సంగతి వూరంతా పాకింది కాబట్టి రక్షకభటులు వీధివీధీ గాలించసాగారు. ప్రతీ వాహనాన్ని ఆపి లోపలకు తొంగి చూడసాగారు. చందనకుడు, వీరకుడు అనే ఇద్దరు దండనాథులు చారుదత్తుని వీధికి వచ్చారు. ఆర్యకుడి కాలికి గొలుసు వుంది. దాన్ని బట్టి సులభంగా గుర్తు పట్టవచ్చు అంటూ భటులను హెచ్చరిస్తున్నారు. అంతలో వర్ధమానకుడి గూడుబండి అటుగా వచ్చింది. ఎవరిదని అడిగితే చారుదత్తుడి బండి అని, లోపల వసంతసేన వుందని పుష్కరండక వనానికి వెళుతోందని బండివాడు చెప్పాడు. చారుదత్తుడిపై గౌరవం వున్న చందనకుడు బండిని వెళ్లిపోనిద్దామా అన్నాడు. లోపల చూడకుండానా అని వీరకుడు అడ్డుపడ్డాడు. వాళ్లిద్దరూ సమానస్థాయి దండనాథులు. ఇద్దరి మధ్య స్పర్ధ వుంది. చారుదత్తుడి గురించి, వసంతసేన గురించి నీకు తెలియదా? అని చందనకుడు వాదించాడు. 'నేను రాజకార్యంలో వుండగా మా నాన్న కూడా నాకు తెలియదు. బండిలోకి ఎక్కి చూడవలసినదే. నేను ఎడ్లు పట్టుకుంటాను. నువ్వు లోపలకి వెళ్లి చూడు.' అన్నాడు వీరకుడు. 'నేను చూసినా నువ్వు నమ్మవేమో, నువ్వే చూసుకో' అన్నాడు చందనకుడు అలకతో. చివరకు వీరకుడి ఘోష భరించలేక తనే బండి ఎక్కాడు.

లోపలుండి వీళ్ల సంభాషణ వింటూన్న ఆర్యకుడు లోపలకి వచ్చినవాళ్లతో ప్రాణాలకు తెగించి పోరాడడానికి నిశ్చయించుకున్నాడు. వాళ్లిద్దరిలో చందనకుడు తన పట్ల జాలి చూపుతున్నట్లు గ్రహించాడు కాబట్టి అతను లోపలకి రావడంతో శరణు కోరుతున్నాను అని అభ్యర్థించాడు. అభయం యిస్తున్నాను అన్నాడు చందనకుడు. ఇవాళ్టి నీ ఉపకారాన్ని ఎప్పటికీ మర్చిపోను అన్నాడు ఆర్యకుడు. ''నేను అమితంగా గౌరవించే చారుదత్తుడి బండిలో వున్నావు. నాకు మిత్రుడైన శర్విలకుడి (శర్విలకుడు దొంగ, యితను దండనాథుడు!) చేత విడిపించబడ్డావు. నేను రాజోద్యోగిని. ఇప్పుడు సంకటంలో పడ్డాను. అయినా ఏమైతే అది అవుతుంది. నీకు మాట యిచ్చేశాను.'' అన్నాడు చందనకుడు. 

కిందకు దిగి ''లోపల వసంతసేన ఉన్నాడు.. ఉంది. చారుదత్తుడి కోసం వెళ్తున్నదానిని మీరు యిలా అవమానించడం భావ్యం కాదు అంది.'' అన్నాడు. అతని తడబాటుతో వీరకుడికి అనుమానం వచ్చింది. ''ముందు ఉన్నాడు, అన్నావు తర్వాత ఉంది అంటున్నావు. నీ కంఠస్వరం కూడా మారింది.'' అన్నాడు. 

''ఒరేయ్‌ వీరకా! మేం దాక్షిణాత్యులం. పది రకాల మ్లేచ్ఛభాషలు తెలిసినవాళ్లం. మా భాష అందుకే అలా వుంటుంది. ఒక్కోప్పుడు లింగభేదం పాటించం. మా యాసకీి, నేను చెప్పినదానికి సంబంధం ఏమిటి?''

''నేను రాజభక్తుణ్ని. బండిలో ఎవరున్నారో నేను వెళ్లి చూస్తాను. నువ్వు ఎడ్లు పట్టుకో.''

''అంటే నేను రాజభక్తుణ్ని కానా?''

''నీ సంగతి నాకెందుకు? ప్రతి బండిని శోధించమని రాజాజ్ఞ'' అని వీరకుడు అనడంతో చందనకుడికి భయం వేసింది. ఏదో ఒక కర్ణాటకలహం (కావాలని తగవు పెట్టుకోవడం) వేసుకుని యితన్ని ఆపకపోతే తనకే ముప్పు అనుకున్నాడు. ''నేను శోధించినదాన్ని నువ్వు మళ్లీ శోధిస్తావా? ఎవడవురా నువ్వు? నీ జాతి ఏదో మరచావా?''

''నువ్వు చెప్పు చూదాం''

''నీ జాతి పేరు చెప్పడమే అపవిత్రం'' అంటూ ఎడమ అరచేతిలో కుడి తర్జని అటూయిటూ ఆడించి క్షురకర్మ చేసేవాడని సూచించాడు. ఆపై ''మీరంతా దండనాథులై పోయారు'' అని యీసడించాడు చందనకుడు.

వీరకుడికి కసి రేగింది. ''నీది మాత్రం ఏం జాతిరా? నీ తల్లి మద్దెల, నీ తండ్రి ఢంకా. నువ్వూ దండనాయకుడివి అయిపోయావు కదా'' అని వెక్కిరించాడు. 

''నేను చర్మకారుణ్నే. అయితే ఏముంది? నేను వెతికిన బండిని మళ్లీ నువ్వు వెతుకు ఏమవుతుందో తడాఖా చూపిస్తాను.'' అని సవాలు విసిరాడు చందనకుడు. 

చూపించు అంటూ వీరకుడు బండి ఎక్కబోయాడు. అప్పుడు చందనకుడు అతన్ని జుట్టు పట్టుకుని కిందకు లాగి పడేసి, కాలితో తన్నాడు. దాంతో వీరకుడికి వీరావేశం వచ్చింది. రాజవిధినిర్వహణలో వున్న నన్ను కొడతావా? ఉండు నిన్ను న్యాయస్థానానికి యీడ్వకపోతే నా పేరు మార్చుకుంటాను అంటూ వెళ్లిపోయాడు. అతనలా వెళ్లగానే చందనకుడు బండి దగ్గరకు వచ్చి 'ఓ వసంత సేనా, దారిలో నిన్ను ఎవరైనా ఆపితే చందనక, వీరకులు యిప్పటికే శోధించారని చెప్పు. గుర్తుగా యిదిగో నా ఖడ్గాన్ని చూపు' అంటూ కత్తిని గూడులోకి అందించాడు. చేతికి ఆయుధం వచ్చినందుకు ఆర్యకుడు సంతోషించాడు. 

ఆ తర్వాత చందనకుడు 'ఈ వీరకుడు రాజుకి వెళ్లి ఫిర్యాదు చేస్తాడు. రాజు నాకు దండన వేస్తాడు. అంతకంటె కుటుంబసభ్యులతో సహా యీ ఆర్యకుడి పక్షంలో చేరిపోతాను' అనుకుని అక్కణ్నుంచి వెళ్లిపోయాడు.  (సశేషం)

మృచ్ఛకటికమ్‌ పాత్రల పరిచయం

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు  2015)

[email protected]

Click Here For Archives

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా