cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

MBS:17 ఎన్టీయార్‌కు దోహదపడిన ఆంధ్రరాజకీయాలు

MBS:17 ఎన్టీయార్‌కు దోహదపడిన ఆంధ్రరాజకీయాలు

కాంగ్రెసులోని ముఠా రాజకీయాల గురించి నేను రాస్తున్నది చదివి ఒక పాఠకుడు రెడ్లలో ఐకమత్యం లేదని వాపోయారు. రెడ్లు అనేకాదు, రాజకీయపరంగా ఏ కులంలోనూ ఐకమత్యం ఉండదు. ప్రతివ్యక్తి స్వార్థపరుడే. నేను ఎమ్మేల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, గెలవడం తథ్యం కాబట్టి మంత్రిపదవి ఆశిస్తున్నాను అనుకోండి. కాబినెట్‌ కూర్పులో నా కులస్తుడు ఒకడికే మంత్రిపదవి దక్కుతుందని లెక్క ఉంది కాబట్టి, నా స్థాయిలో ఉన్న నా కులస్తుడు వేరెవ్వడూ గెలవకుండా ఉంటే బాగుండునని ఆశిస్తాను. అలాగే జిల్లాకు ఒక పదవే అనుకుంటే, నా జిల్లాలో నా స్థాయిలో నా పార్టీ వాడు వేరొకడు గెలవకూడదని ఆశిస్తాను. వీలైతే వాళ్ల ఓటమికి ప్రయత్నిస్తాను. ఈ లాజిక్‌ గ్రహించకుండా మనం సాధారణంగా జనరలైజ్‌ చేసేస్తాం - 'ఫలానా కులం/ప్రాంతం వాళ్లు వాళ్లవాళ్లకే చేసుకుంటారు, అదే మా వాళ్లయితైనా ఒకరికొకరు ఛస్తే సాయపడరు' అని.

ఈ మాట తెలుగువాళ్లు తమిళుల గురించి అనగా విన్నాను, తమిళులు మలయాళీల గురించి అనగా విన్నాను. మలయాళీలు మార్వాడీల గురించి, మార్వాడీలు గుజరాతీల గురించి, గుజరాతీలు పంజాబీల గురించి.. యిది అనంతం. నేను గమనించిన దేమిటంటే యీ దురభిమానం వ్యక్తిగతమే తప్ప, సామూహికంగా అప్లయి చేసి చెప్పలేం. అదీ కొంతకాలమే ఉంటుంది. మనం నిరుద్యోగులుగా వుండగా మన కులస్తులు మనకు సాయం చేయాలని ఎదురు చూస్తాం. అదే మనం ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగాక మన కులస్తులనే వెతకం, టాలెంట్‌ ఎవరికి ఉంటే వాళ్లకే ఉద్యోగమిస్తాం. అనేక సందర్భాల్లో అయినవాళ్లే, బంధువులే, సాటి కులస్తులే మోసం చేస్తూ ఉంటారు. అందువలన కులాభిమానమనే జాడ్యం వయసు వస్తున్న కొద్దీ నీరసపడుతుంది.

కాంగ్రెసులో సంజీవరెడ్డి, గోపాలరెడ్డి, బ్రహ్మానందరెడ్డి.. యిలా ఒకరి మీద మరొకరు గోతులు తీసుకున్నారు కాబట్టి రెడ్ల మధ్య ఐకమత్యం లేదన్నారా పాఠకుడు. మరి రాజాజీ, ప్రకాశం, కళా వెంకటరావు, పట్టాభి సీతారామయ్య ఒకరిపై మరొకరు కుట్రలు పన్నలేదా? వారంతా బ్రాహ్మలే కదా! అలాగే ఎన్టీయార్‌కు వెన్నుపోటు పొడిచిన యిద్దరూ కమ్మలే కదా! రేపు ఓ కాపు ముఖ్యమంత్రి అయితే వ్యతిరేకంగా ముఠా కట్టేవాడు కూడా కాపే కావచ్చు. ఉద్యోగాల్లో ప్రమోషన్‌, వ్యాపారం, రాజకీయాల్లో పదవి - యిలాటి వాటిల్లో రక్తబంధువులను కూడా తొక్కేసి తాము పైకి వద్దామని చూడడం మానవనైజం. ఇది ఒక కులానికో, ప్రాంతానికో పరిమితం కాదు. ప్రత్యేక తెలంగాణ సాధిస్తే మా తెలంగాణవాళ్లమంతూ ఐక్యంగా ఉండి ప్రజా తెలంగాణ సాధించుకుంటాం అని ఉద్యమ సమయంలో వివిధ పార్టీల తెలంగాణ నాయకులందరూ అలాయ్‌-బలాయ్‌లో వాగ్దానాలు చేశారు. తెలంగాణ వచ్చాక పార్టీల వారీగా, పార్టీలో ముఠాల వారీగా చీలిపోయి ఒకరి నొకరు ఎంతలేసి మాటలనుకుంటున్నారు!

ఇక 1983కు పూర్వం నడిచిన రాజకీయాల గురించి, కొన్ని వర్గాల వారికి ఇందిర పట్ల వ్యతిరేకత ఎందుకు కలిగిందో దాని గురించి రాస్తూ ఉంటే యిదంతా ఎన్టీయార్‌ ఘనతను తగ్గించి చూపడానికి చేస్తున్న ప్రయత్నంగా కొందరు భావిస్తున్నారు. చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూలు టీచరు 'మహాత్మా గాంధీ ఆంగ్లేయులతో పోరాడి మనకు స్వాతంత్య్రం తెచ్చెను' అని చెప్తే విని అదేదో అటక మీద మూట లాటిదేమో, తన చేతి కర్ర ఝళిపించి ఆంగ్లేయులను దడిపించి తెచ్చాడేమో అనుకునేవాణ్ని. పెద్దయ్యాక తెలిసింది - గాంధీ రంగం మీదకు రావడానికి ముందే చాలా సమరం జరిగిందని. గాంధీ విజయుడయ్యాడంటే ఎన్నో పరిస్థితులు దోహదపడ్డాయి. 1857లోనే గాంధీ ఉండి ఉంటే స్వాతంత్య్రం వచ్చేసి ఉండేది అనుకుంటే ఏమీ చెయ్యలేం. రెండవ ప్రపంచయుద్ధంలో బ్రిటన్‌ నష్టపోకుండా వుండి వుంటే, చర్చిల్‌ ఓడిపోయి, లేబరు ప్రభుత్వం అధికారంలోకి రాకుండా వుంటే, స్వాతంత్య్రం 1947లో వచ్చేదా?

ఎన్టీయార్‌ దివి నుంచి దిగివచ్చి అద్భుతం చేసేశాడని నమ్మదలచినవారు నమ్మవచ్చు. కానీ అద్భుతం జరగడానికి దోహదపడిన పరిస్థితులు ఏమిటో తెలుసుకోవాలి. అప్పుడే 1989లో అవి ఎందుకు రివర్స్‌ అయ్యాయో తెలుస్తుంది. తెలుగుదేశం ఆవిర్భవించిన 9 నెలల్లోనే అంటే 1982 మార్చిలో పార్టీ పుడితే 1983 జనవరికి అధికారంలోకి వచ్చింది అని గొప్పగా చెపుతాం. కానీ అసాం గణ పరిషద్‌ ఏర్పడిన 2 నెలల్లోనే అధికారంలోకి వచ్చింది, దీని కంటె అది గొప్పది అని ఎవరైనా వాదించవచ్చు. అప్పుడు అది ఏర్పడడానికి ముందు ఆసు (ఆల్‌ అసాం స్టూడెంట్స్‌ యూనియన్‌) 6 ఏళ్ల క్రితమే ఏర్పడి ఉద్యమాన్ని చేసింది సుమా అని గుర్తు చేస్తే కోపం తెచ్చుకుంటే ఎలా?

ఇక 1977 తర్వాత ఎమర్జన్సీ తదనంతర రాజకీయాలను పరామర్శించ బోతే - ఇందిర ఎన్నికలకు వెళదామని నిశ్చయించుకుని ప్రతిపక్ష నాయకుల్ని జైల్లోంచి విడుదల చేయగానే సోషలిస్టు పార్టీ, జనసంఘ్‌,  పాత కాంగ్రెసు, లోకదళ్‌ కలిసి జనతా పార్టీగా ఏర్పడ్డాయి. ఎన్నికలు దగ్గరకు పడుతూండగా సిఎఫ్‌డి (కాంగ్రెస్‌ ఫర్‌ డెమోక్రసీ) కూడా వచ్చి కలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాపార్టీకి మిగిలిన ఏకైక నాయకుడు తెన్నేటి విశ్వనాథం గారిని అధ్యక్షుణ్ని చేశారు. ఆయన వృద్ధుడే అయినా విశాఖ ఉక్కు, జై ఆంధ్ర ఉద్యమాల ద్వారా జనాలకు బాగా చేరువయ్యారు. ఇందిర దెబ్బకు రాజకీయాలు వదిలి కాడి పట్టిన సంజీవరెడ్డి, మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి పార్లమెంటు ఎన్నికలలో నంద్యాల నుంచి పోటీ చేశారు.

ఉత్తరాదిన జనతా ప్రభంజనం ఎంత బలంగా వీచినా, ఇక్కడ మాత్రం సంజీవరెడ్డి ఒక్కరే నెగ్గారు. తక్కిన 41 కాంగ్రెసుకే! 57% ఓట్లు వచ్చాయి. బడుగు వర్గాలతో బాటు ఎమర్జన్సీ అత్యాచారాల గురించి పూర్తి సమాచారం అందని మధ్యతరగతి వాళ్లు కూడా కాంగ్రెసుకే ఓట్లేశారు. జనతా పార్టీలో భాగస్వాములైన పార్టీలు వేటికీ యిక్కడ బలం లేదు. అయినా ఓట్లలో 32% వచ్చాయి, దీనికి కారణం ఇందిర ఆర్థికవిధానాలపై భూస్వామి వర్గాల వారు కోపగించుకోవడం. పార్లమెంటు ఎన్నికల అనంతరం జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఎమర్జన్సీ అత్యాచారాలన్నీ వెలుగులోకి రాసాగాయి. కాంగ్రెసు పార్టీ ఇందిరా గాంధీని ఒక భారంగా ఎంచి, ఆమెను పార్టీలోంచి బహిష్కరించింది.

రెడ్డి కాంగ్రెసుకు బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షుడు. ఇందిర తన వర్గానికి కాంగ్రెసు (ఐ) అని పేరు పెట్టుకుంది. వెంగళరావు రెడ్డి కాంగ్రెసు వైపే మొగ్గారు. తన పరిపాలనాకాలంలో సమర్థపాలన అందించినందుకు, సంక్షేమ పథకాలు అమలు చేసినందుకు ప్రజలు తననే మళ్లీ ఎన్నుకుంటారని ఆశించారు. అనేక మంది కాంగ్రెసు నాయకులూ అలాగే అనుకుని కాంగ్రెసులో ఉండిపోయారు. అయితే కొందరు కాంగ్రెసు నాయకులు జనతా పార్టీ పట్ల ప్రజల మోజు పెరుగుతూండడం చూసి ఆ పార్టీలో చేరారు. కేంద్రం నుంచి వచ్చిన జనతా నాయకుల సభలకు నగరాలలో విశేష స్పందన లభించేది. అందువలన కాంగ్రెసు వాళ్లు కాంగ్రెస్‌ (ఆర్‌)లోనూ, జనతాలోను సర్దుకున్నారు. ఇందిరా కాంగ్రెసుకు అభ్యర్థులు లేకుండా పోయారు.

అభ్యర్థులే కాదు, నాయకులు కూడా లేకుండా పోయారు. ఆ పార్టీలో చెన్నారెడ్డి ఒక్కరే పేరున్న నాయకులు. కేంద్రంలో జనతాపార్టీ అధికారంలోకి వచ్చాక ఆయనకు తన గవర్నరు పదవి ఎక్కువకాలం ఉండదని తోచింది. రాజీనామా చేసి హైదరాబాదుకి వచ్చి, ఓ నాడు సభ పెట్టి, ఇందిరాగాంధీ ఎమర్జన్సీని తెగ తిట్టి, మర్నాడే ఆవిడ ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరారు. 1978 జనవరిలో ఆయనను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. పూర్తిగా అప్రతిష్ఠ పాలైన ఇందిర కథ ముగిసిపోయినట్లేనని నాయకులందరూ అనుకున్నారు కాబట్టి పిలిచి పార్టీ టిక్కెట్టు యిస్తామన్నా ఎవరూ ముందుకు రాలేదు. చివరకు 284 స్థానాల్లో 202 మంది కొత్తవాళ్లకు టిక్కెట్లిచ్చారు. వాళ్లు కూడా జనతా, కాంగ్రెసు (ఆర్‌)లలో టిక్కెట్లకై ప్రయత్నించి విఫలమై వచ్చినవారే. చాలామందికి రాజకీయాల్లో ఓనమాలు కూడా రావు. అందువలన ఆ పార్టీ విజయం సాధిస్తుందని ఎవరూ అనుకోలేదు.

ఇందిర కాలికి బలపం కట్టుకుని 175 నియోజకవర్గాల్లో తిరిగారు. వెళ్లిన ప్రతీచోటా ఒక్కటే చెప్పారు - 'నేను పేదల కోసం ఎంతో చేశాను. అందుకని నాపై కక్షకట్టి జనతాపార్టీ వాళ్లు నాపై కేసులు పెట్టి జైల్లోకి తోశారు. నాపై గౌరవం వుంటే నా పార్టీని గెలిపించండి' అని. హరిజన, గిరిజన, బిసి, బడుగు వర్గాల వారందరికీ అప్పటిదాకా ఇందిర పేరు మీదుగానే సంక్షేమపథకాల ఫలితాలు అందాయి. ఆవిడను పేదల పాలిట పెన్నిధిగా చిత్రీకరించారు. వాటిని సమర్థవంతంగా అమలు చేసినది తను కాబట్టి ఆ క్రెడిట్‌ తనకు వస్తుందని వెంగళరావు అనుకున్నారు కానీ, అంతా ఇందిర పేరు మీదే జరగడంతో ఆ ఘనతంతా ఆవిడకే పోయింది. అనేక ఎన్నికల సభల్లో ఆవిడ కన్నీరు కార్చి, ప్రజలను సెంటిమెంటుతో తడిసి ముద్దయ్యేట్లు చేశారు. మేధావులు, మధ్యతరగతి వాళ్లు చీదరించుకున్నారు. ఉన్నతవర్గాల వారు అసహ్యించుకున్నారు. కానీ పేదలు ఆదరించారు. ఇందిర మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మన కష్టాలు కడతేరుస్తుందని నమ్మారు.

ఫలితం కాంగ్రెసు (ఐ)కి 175 సీట్లు వచ్చాయి! అయితే మార్జిన్లు తక్కువ. బడుగు వర్గాలు మాత్రమే ఆమె వెంట నిలవడం వలన 1972లో 52% ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెసు 1978కి 39% మాత్రమే తెచ్చుకోలిగింది. ధనిక వర్గాలు జనతాపార్టీని ఆదరించడం వలన ఆ పార్టీకి గతంలో ఎంతమాత్రం బలం లేకపోయినా 29% ఓట్లు, 60 సీట్లు వచ్చాయి. ఇక కాంగ్రెసు ఆర్‌కు 17% ఓట్లు, 30 సీట్లు వచ్చాయి. 13 మంది స్వతంత్రులు నెగ్గారు. సిపిఐకి 6, సిపిఎంకు 8 వచ్చాయి. ఓట్లశాతం సమానమే, 3%. ఇక్కడ గమనించవలసిన దేమిటంటే కాంగ్రెసు (ఆర్‌), జనతా రెండిటికి కలిపి 46% రాగా, కాంగ్రెసుకు 39% వచ్చాయి. అంటే కాంగ్రెసు వ్యతిరేక ఓటు బలంగా ఉందన్నమాట.

కానీ అవి రెండు పార్టీల మధ్య చీలిపోవడంతో కాంగ్రెసు లాభపడింది. 1983లో ఎన్టీయార్‌ తెలుగుదేశం పెట్టినపుడు యిలా చీలిపోకుండా సాలిడ్‌గా దానికే పడడంతో టిడిపికి 46% ఓట్లు వచ్చాయి. కాంగ్రెసుకు 34% వచ్చాయి. గతంలో కంటె 5% తగ్గిపోవడానికి కారణం దాని ముఖ్యమంత్రుల పని తీరు, దానికి అధిష్టానం స్పందించిన విధం!
(ఫోటో - వారం రోజుల కారాగారవాసం తర్వాత బయటకు వస్తున్న ఇందిర)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2019)
mbsprasad@gmail.com

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 01 ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 02  ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 03

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 04 ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 05  ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 06

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 07 ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 08   ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 09

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 10  ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 11  ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 12

ఎమ్బీయస్‌:  ఎన్టీయార్‌ - 13  ఎమ్బీయస్‌:  ఎన్టీయార్‌- 14  ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌- 15

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌- 16