Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: స్కిల్ స్కామ్‌పై మరి కాస్త వెలుగు

 ఎమ్బీయస్‍: స్కిల్ స్కామ్‌పై మరి కాస్త వెలుగు

ఈ వ్యాసం చదివే ముందు ఎమ్బీయస్‍: స్కిల్ స్కామ్‌పై ఇంకాస్త వెలుగు వ్యాసం చదవగోర్తాను. స్కిల్ కార్పోరేషన్ ప్రాజెక్టు గురించి ఏం మాట్లాడినా వెంటనే టిడిపి వారు ‘‘మోదీ ముఖ్యమంత్రిగా ఉండగా గుజరాత్‌లో పెట్టినిది చూసే మేమూ పెట్టాం.’’ అని అంటున్నారు. మమ్మల్ని ఏదైనా అంటే మోదీ మీద ఒట్టే అన్నట్లు ధ్వనిస్తోంది. మోదీకి ప్రస్తుతం ఉన్న పాప్యులారిటీ, యిమేజి దృష్ట్యా, మోదీ చేసినదాన్ని తప్పు పడితే కళ్లు పోయినా పోకపోయినా, కాళ్లు విరక్కొట్టడానికి కోట్లాది జనం రెడీగా ఉన్నారు. మోదీ పేరు తీసుకున్నారు కదాని, మనం గుడ్డిగా నమ్మకుండా గుజరాత్‌లో ఏం జరిగిందో క్షుణ్ణంగా తెలుసుకోవాలి.

ప్రధానిగా మోదీ విధానాలపై, ఆర్థిక నిర్వహణపై ఫిర్యాదులు ఉండవచ్చు కానీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా మోదీ పాలనాదక్షతపై రెండో మాట లేదు. గుజరాత్‌లో పరిశ్రమలకు అనువైన వాతావరణం ఎప్పణ్నుంచో ఉంది. అతని పాలనలో అది శరవేగంగా దూసుకు పోయింది. ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్టు పెడదామనుకున్న ఒక ఎంటర్‌ప్రెనార్ నాతో చెప్పారు – గుజరాత్‌లో మోదీని కలిసి వివరిద్దామనుకుంటే ఎపాయింట్‌మెంట్ అతి సులభంగా దొరికిందట. ఆయన ఓపిగ్గా విన్నాట్ట. వెనువెంటనే అధికారులకు తగిన ఆదేశాలు యిచ్చాడట. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్ గురించి కూడా చాలామంది యిలాగే చెప్తారు. తక్కిన రాష్ట్రాలలో ఎపాయింట్‌మెంట్ దొరకడమే దుర్లభం. మోదీ ముఖ్యమంత్రిగా ఉండగా, ప్రధానిగా ఉండగా గుజరాత్‌లో ఎంతెంత పెద్ద ప్రాజెక్టులు చేపడుతున్నారో, వాటిని ఎంత సమర్థవంతంగా, వేగంగా పూర్తి చేస్తున్నారో చూడండి.

అక్కడి రాజకీయ నాయకుల్లో చాలాకాలంగా అవినీతి పాతుకుపోయి ఉంది. కానీ అధికారులకు స్వేచ్ఛ నిచ్చి, వారి చేత పని తీసుకోవడం బాగా వచ్చు. మోదీ కేంద్రానికి వచ్చిన తర్వాత కూడా గుజరాతీ ఐఏఎస్‌ల మీద, గుజరాత్‌లో పని చేసిన ఐఏఎస్‌ల మీద ఆధారపడడం మానలేదు. ఇలాటి గుజరాత్‌లో యీ ప్రాజెక్టు ఎప్రూవ్ అయిందంటే, యిక దానికి తిరుగు ఉండివుండదు అనుకోవచ్చు. గుజరాత్ ఒప్పందాల గురించి, అది అమలైన తీరు గురించి సమాచారం సేకరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. పాఠకుల వద్ద ఉంటే మా అందరితో పంచుకో గోరుతున్నాను. అక్కడ కూడా సెంటర్లు ప్రారంభం కావడానికి 19 నెలలే ప్రభుత్వ వాటా మొత్తం యిచ్చేశారా? వంటివి ముఖ్యం.

*ఇంకో సంగతి చెప్తాను. గత వ్యాసంలో టిడిపి వాళ్లు పెట్టిన ఎపిస్కిల్‌డెవలప్‌మెంట్‌ట్రూత్ డాట్‌కామ్‌ గురించి రాశాను కదా. దానిలో ప్రతీ రాష్ట్రంలోనూ ఎన్ని సెంటర్లున్నాయి అని జాబితా యిచ్చారు. గుజరాత్‌ను చూసి మొదలుపెట్టాం అన్నారు కాబట్టి దాని సంగతి చూశా. అక్కడ 11 సెంటర్లు అని చెప్పారు. కరక్టే. ప్రభుత్వ కంట్రిబ్యూషన్ అని ఉన్న వరుసలో గుజరాత్‌లో 15% అని, ఆంధ్రలో అంతకంటె తక్కువగా 10% అని యిచ్చారు. ఇది చూస్తే ‘ఆంధ్రకు 90% డిస్కౌంట్ యిచ్చి, మాకు 85% మాత్రమే ఎందుకు యిచ్చావ’ని మోదీ డిజైన్‌టెక్-సీమెన్స్‌తో పేచీ పెట్టుకోవాలి. గుజరాత్‌లో ప్రభుత్వం 15% ఖర్చు భరించిందన్న డాక్యుమెంటు ఏదైనా కనబడితే పాఠకులతో షేర్ చేసుకోగోర్తాను. నా వద్ద ఉన్న రాజ్‌కోట్ ఒప్పందంలో ఈ శాతాల ముచ్చట లేదు.

*డిజైన్‌టెక్ వాళ్లు ఒప్పందం ప్రకారం తీసుకునేది కాకుండా అదనంగా మేన్‌టెనెన్స్ చార్జెస్ కింద మరో 5 కోట్లు అడిగితే ఆంధ్ర కార్పోరేషన్ వారు యిచ్చేశారట. ఇది బుగ్గన తన అసెంబ్లీ ప్రసంగంలో చెప్పారు. గుజరాత్‌లో కూడా ప్రభుత్వం యిలాగే అచ్చుకుందా? అదీ ఎవరైనా క్లారిఫై చేయాలి.

*ఒక పాఠకుడు గుజరాత్‌లో ట్రైనింగ్ తీసుకున్న వారి గురించి సమాచారం యిచ్చారు. అక్కడ 11 సెంటర్లకై సెంటరుకు రూ. 17 కోట్ల చొప్పున ఖర్చు పెట్టారు. 2013 నుంచి 2016 వరకు 16 వేల పై చిలుకు మందికి తర్ఫీదు యిచ్చారు. అంటే ఏడాదికి సెంటరుకు 500 మంది విద్యార్థులన్నమాట. మరి ఆంధ్రలో? 2018 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు అనగా రెండేళ్ల వ్యవధిలో తర్ఫీదు పొందినవారు 2.13 లక్షల మంది. అనగా ఏడాదికి 1.07 లక్షల మంది. ఆంధ్రలో ఉన్నవి 40 సెంటర్లు కాబట్టి సెంటరుకి ఏడాదికి 2675 మంది. 5.35 రెట్ల మంది. ఇదెలా సాధ్యం? ఆంధ్రలో విద్యార్థులకు తూతూమంత్రంగా ట్రైనింగు యిచ్చేసి, సర్టిఫికెట్లు యిచ్చేశారా? బుగ్గన అసెంబ్లీలో కొన్ని పేర్లు చదివి ఐదేసి రోజుల ట్రైనింగులివి, ట్రైనీలకు సాఫ్ట్‌వేర్‌ల డెమోలు మాత్రమే యిచ్చారు. అసలు కోర్సులైతే ఐదేసి నెలలు కనీసం పడతాయి అన్నారు.

*ఎపిస్కిల్‌డెవలప్‌మెంట్‌ట్రూత్ డాట్‌కామ్‌లో అంతా సవ్యంగానే జరిగింది అని వాదిస్తూ ట్రైనింగు పొందిన కొందరి సర్టిఫికెట్లు అంటూ ఓ పాతిక పెట్టారు. వాటిల్లో చూస్తే 4 రోజుల ఎయిర్ కండిషనింగ్ ట్రైనింగు కోర్సు సర్టిఫికెట్టు కూడా ఉంది. ఇండస్ట్రియల్ ఆటోమేషన్‌లో 5 రోజుల కోర్సు. సాలిడ్ ఎజ్‌ది 13 రోజుల కోర్సు. సిఎన్‌సి అనేది మాత్రం 80 రోజుల కోర్సు కనబడింది. అది 2022 నాటిది, అంటే యీ 2.13 లక్షల మంది ఖాతాలోకి రాదు. నాకు టెక్నికల్ కోర్సుల గురించి బొత్తిగా అవగాహన లేదు. దేనికి ఎన్ని రోజులు పడుతుందో, ఏ కోర్సు ఎందుకు పని చేస్తుందో, ఎలాటి ఉద్యోగం తెస్తుందో తెలియదు. సాఫ్ట్‌వేర్ విలువా తెలియదు. పాఠకుల్లో చాలామంది యిటువంటి వాటిల్లో తర్ఫీదు పొంది ఉంటారు. అందువలన కోర్సుల కాలపరిమితి, వాటి నాణ్యత గురించి వారికే ఎక్కువ తెలుస్తుంది.

*పేర్ని నాని అసెంబ్లీలో మాట్లాడుతూ వడ్రంగం లాటివి నేర్పారు అన్నారు. ఆటో కాడ్ బయట 3 వేలకు చెప్తారు, దానికి యింత ఖర్చా? అన్నారు. బుగ్గన మాట్లాడుతూ వీటిలో చాలా భాగం ఇంటర్నెట్‌లో ఫ్రీగానే లభ్యమౌతాయి అన్నారు. ఒకవేళ కొనాల్సినా యింతకంటె తక్కువ ధరకే అనేక కంపెనీలు ఆఫర్లు యిస్తున్నాయి అన్నారు. ఇది ఇంజనీరింగు విద్యార్థులకే కాక, పాలిటెక్నిక్, ఐటిఐ చదివిన వారికి కూడా ఉద్దేశించినవి కాబట్టి పేర్ని నాని వడ్రంగం అనే మాట వాడి ఉంటారు. పైన చెప్పిన వెబ్‌సైట్‌లోనే క్లస్టర్‌కు 559 కోట్లు అవుతుందంటూ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్టు కింద యిచ్చిన వర్గీకరణలో 476 డిజిటల్ కోర్సులకు గాను క్లస్టర్‌కు ధర 249.75 కోట్లు అని చూపించారు. మరి ఆ కోర్సులన్నీ యిలాటివేనా? నాకు తెలియదు.

*ఇది కాక సాఫ్ట్‌వేర్‌కి 247.78 కోట్లు అన్నారు. అదీయిదీ కలిపితే మొత్తం 497 కోట్లు. (హార్డ్‌వేర్‌కు 48.48, సర్వీసెస్‌కు 13.31) దీన్ని 10% రేటుకే యిచ్చారనుకుంటే 49.70 కోట్లు. రౌండాఫ్ చేస్తే 50 కోట్లు. దీన్ని ఒక్కో క్లస్టర్‌కి విడిగా కొనాలా? కార్పోరేషన్ పేర కొంటున్నారు కాబట్టి అన్ని క్లస్టర్లకు అదే వాడుకోకూడదా? నాకు తెలియకే అడుగుతున్నాను. అలా వాడుకునే సౌలభ్యం ఉండి ఉంటుందనుకుంటా. అందుకే డిజైన్‌టెక్ సీమెన్స్ నుంచి 56 కోట్లకు సాఫ్ట్‌వేర్ కొని ఆరిటికీ సర్ది వుంటుంది. అబ్బే కాదు, అలా కుదరదు అనుకుంటే, చీప్‌గా దొరికే యితర సాఫ్ట్‌వేర్లు కొనేసి, పాలల్లో నీళ్లు కలిపినట్లు, సీమెన్స్‌తో కలిపేసి, అన్నిటికీ కలిపి సీమెన్స్ ముద్ర కొట్టేశారేమో! ఎలా చూసినా 56 కోట్ల (పన్నులతో కలిపి 58.8)ను మొత్తం అన్నిటికి కలిపి చుట్టుబెట్టేసినపుడు, క్లస్టరుకి 10 కోట్ల లోపే అవుతుంది కదా. మరి ఒక్కో క్లస్టరుకు 55 కోట్ల (మొత్తం 550లో పది శాతం) చొప్పున ప్రభుత్వాన్నుంచి ఎందుకు వసూలు చేసినట్లు? ప్రభుత్వం ఎందుకు యిచ్చినట్లు?

*ఐదు రోజుల ట్రైనింగ్‌లతో ఉద్యోగాలు వచ్చేస్తాయా? ఒకవేళ ఉద్యోగం వచ్చిందనుకుంటే యీ 5 రోజుల సర్టిఫికెట్టుతోనే వచ్చిందని ఎవరైనా వాదించగలరా? ఎవరైనా ఐఏఎస్‌కు సెలక్టయితే ఆ క్రెడిట్ అతను చదివిన ఎలిమెంటరీ స్కూలుకి పోతుందా? హైస్కూలుకి పోతుందా? జూనియర్ కాలేజీకి పోతుందా? డిగ్రీ కాలేజికి పోతుందా? పోస్ట్ గ్రాజువేషన్ చేసిన యూనివర్శిటీకి పోతుందా? ఐఏఎస్‌కు తర్ఫీదు యిచ్చిన ఎకాడమీకి పోతుందా? చిన్నప్పణ్నుంచి ట్యూషన్లు చెప్పిన అరడజను మంది అయ్యవార్లకు పోతుందా?

*70 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయంటే ఆ ఘనతంతా యీ స్కిల్ సెంటర్‌కే కట్టబెట్టడం భావ్యమా? పోనీ ఓ రెండేళ్ల పాటు తర్ఫీదు యిచ్చి ఉద్యోగార్హుణ్ని చేసి ఉంటే వాళ్ల సంగతి వేరే! వారం రోజుల ట్రైనింగు యిచ్చి, అంతా మా వల్లే అంటే ఎలా? తన అసెంబ్లీ ప్రసంగంలో బుగ్గన మాట్లాడుతూ యిది ఆర్థిక నేరం కంటె పెద్దది, విద్యార్థుల భవిష్యత్తు చెడగొట్టడం ద్రోహం అన్నారు. ఐదు రోజుల్లో ఎంత చెడగొడతారు లెండి, వాళ్ల టైము పెద్దగా వేస్టు చేయనందుకు సంతోషించాలి. దీని వలన వాళ్లలో చాలామందికి వచ్చిందీ లేదు, పోయిందీ లేదనుకుంటా. అందుకే వాళ్లు బాబు అరెస్టు తర్వాత నిర్లిప్తంగా ఉన్నారు. నంద్యాలలో బాబు అరెస్టు అయ్యాక చిలకలూరి పేట వరకు యీ విద్యార్థులంతా రోడ్డుకు అడ్డుపడి ఆందోళన చేసి ఉండాల్సిందిగా అని అడిగారు కెఎస్ ప్రసాద్. చిలకలూరిపేటలో అడ్డుపడ్డవాళ్లు కూడా పార్టీ కార్యకర్తలు తప్ప, నైపుణ్యశిక్షణ పొందినవారు కాదు. వెంటనే ఆంధ్రజ్యోతి మేం సెంటర్ల వలన లాభం పొందామని కొందరు అన్నారు అంటూ కథనం యిచ్చారు.

హైదరాబాదులో, బెంగుళూరులో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో నిరసన ప్రదర్శనలు చేసిన ఐటీ వారు పాతికేళ్ల క్రితం బాబు రాష్ట్రానికి ఐటీని తెచ్చి మాకింత భుక్తి కల్పించారు అని చెప్పుకున్నారు కానీ మూడేళ్ల క్రితం దాకా స్కిల్ సెంటర్లలో శిక్షణ పొందిన వారెవ్వరూ రోడ్డెక్కలేదు. యూట్యూబు వీడియోలు చేసినట్లు కనబడలేదు. ఇకపై ఎవరైనా చేస్తే, అది ఎన్ని రోజుల కోర్సో, దానివలన ఉద్యోగం ఎలా లభించిందో కూడా చెప్పాలని కోరుకుంటున్నాను. సీమెన్స్ వారు ఏకంగా 476 కోర్సులలో శిక్షణ యిస్తామని తమ కొటేషన్‌లో చూపించారు మరి.

* సీమెన్స్ 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఎందుకిస్తుంది? అని అడిగినవాళ్లందరికీ టిడిపి వాళ్లు ‘సిఎస్‌ఆర్ కింద యిచ్చింది’ అని చెప్తూన్నారు. సీమెన్స్ ఆ మాట అనలేదు. మేం డిస్కౌంట్ యిస్తాం, అదే గ్రాంట్ ఇన్ కైండ్ అనుకోండి అంది అని గత వ్యాసంలోనే రాశా. ఈ డిస్కౌంట్లను సిఎస్ఆర్ కింద ఇన్‌కమ్ టాక్స్ వారు పరిగణిస్తారని అనుకోను. అలా అయితే ప్రతీ కంపెనీ తన ఉత్పాదన ధర పెంచేసి, డిస్కౌంట్ యిచ్చాను, అదే సమాజానికి మా కంట్రిబ్యూషన్ అని నాటకం ఆడుతుంది. ఇప్పటికీ సీమెన్స్‌ది సిఎస్‌ఆర్ అని వాదించేవాళ్లు పైన చెప్పిన వెబ్‌సైట్‌కి వెళ్లి ఎఫ్‌ఎక్యూలలో ‘‘వై సీమెన్స్..?’’ అనే ప్రశ్నకు సమాధానం చూడండి. విన్-విన్ సిచ్యువేషన్ అంటూ ఏదో రాశారు తప్ప సిఎస్‌ఆర్ మాటే ఎత్తలేదు.

*ఇక కొంతమంది చెప్పేదేమిటంటే, డిజైన్ టెక్ సప్లయిర్లలో ఎవరో జిఎస్‌టి ఎగ్గొడితే స్కాము జరిగిందని ఎలా అనగలరు? జిఎస్‌టి వాళ్లు పళ్లు రాలగొట్టి పన్ను కట్టించుకుంటారు. కహానీ ఖతమ్. దీనిలో పెద్ద అల్లరెందుకు? అంటున్నారు. అవి డొల్ల (షెల్)కంపెనీలని ఎలా అంటారు? నిక్షేపంలా భవంతుల్లో ఉన్నాయి, చాలా ఏళ్లగా మనుగడలో ఉన్నాయి అంటున్నారు. కంపెనీ గట్టిదే కావచ్చు. కానీ చేసిన ట్రాన్సాక్షన్ షెల్ వ్యవహారం కావచ్చు. ఇక్కడ పన్ను తక్కువ కట్టారా, ఎక్కువ కట్టారా అన్నది ప్రశ్న కాదు. బోగస్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అని జిఎస్‌టి ఇంటెలిజెన్స్ పట్టుకుని చెప్పింది. అలా ఎలా చెప్పగలదు అని సందేహించే సామాన్య పాఠకులకు అర్థం కావడానికి మా బ్యాంకులో జరిగిన ఒక ఫ్రాడ్ చెప్తాను.

*బ్యాంకింగ్ కార్యకలాపాల్లో బిల్స్ బిజినెస్ ఒకటి. ‘నేను వేరే ఊళ్లో ఉన్న ఫలానావాడికి అరువు మీద సరుకు పంపాను. ఇదిగో దాని తాలూకు లారీ రిసీట్ (ఎల్‌ఆర్). వాడు 90 రోజుల తర్వాతనే డబ్బిస్తానంటున్నాడు. మీరు నాకు ఆ డబ్బు ముందుగానే యిచ్చేయండి. ఆ ఊళ్లో ఉన్న మీ బ్రాంచ్‌కు యీ కాగితాలు పంపండి. వాడు వచ్చి 90 రోజుల తర్వాత డబ్బు కట్టేస్తానని సంతకాలు పెట్టి ఆ ఎల్‌ఆర్ తీసుకుంటాడు. ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసు నుంచి సరుకు తీసుకుని, అమ్ముకుని, గడించి, 90 రోజుల గడువు నాటికి డబ్బు కట్టేస్తాడు.’ అంటాడు. దీని వలన కమిషన్ వస్తుంది కదాని బ్యాంకు ఒప్పుకుంటుంది. కస్టమరుకి రావలసిన డబ్బు 90 రోజుల ముందుగానే ముడుతుంది కాబట్టి, చార్జీలు చెల్లించడానికి సిద్ధపడతాడు.

అయితే కొంతమంది ఏం చేస్తారంటే సరుకులు అమ్మకుండానే, దొంగ ఎల్‌ఆర్ పట్టుకుని వచ్చి, బ్యాంకు నుంచి డబ్బు తీసుకుని 90 రోజుల పాటు తక్కువ వడ్డీకి దాన్ని వాడుకుంటారు. 90వ రోజుకి అవతలివాడికి డబ్బు పంపించి, బ్యాంకులో కట్టేయమంటారు. గడువుకి బిల్లు చెల్లింపు అయిపోయింది కాబట్టి బ్యాంకుకి అనుమానం రాదు. అంతా సవ్యంగానే ఉంది అనుకుంటుంది. దీన్ని కైట్ ఫ్లయింగ్ అంటారు. ఒక్కోప్పుడు వాడేసుకున్న డబ్బు బ్యాంకులో కట్టకపోతే యిది బయటకు వస్తుంది. బ్యాంకు వాళ్లు తణిఖీ చేస్తే ఎల్‌ఆర్ దొంగదని తెలుస్తుంది. అప్పుడు ట్రాన్స్‌పోర్టు కంపెనీని బ్లాక్‌లిస్టులో పెడతారు. వాళ్ల ఎల్‌ఆర్ ఉన్న బిల్లులను డిస్కౌంట్ చేయరు.

1990ల్లో మా బ్యాంకు మధురై బ్రాంచ్‌ కస్టమరు త్రిచూరు బ్రాంచ్‌కి పంపిన బిల్లు యిలాటిదే. (పేర్లు మార్చాను). మధురై బ్రాంచ్‌లో చాలాకాలంగా ఉన్న ఒక కస్టమరును బ్రాంచ్ మేనేజరు యిలాటి పని చేయమని ప్రేరేపించాడు. త్రిచూరులో ఉన్న ఒక వ్యాపారి పేర బిల్ డ్రా చేయడం, యిక్కడ డిస్కౌంట్ చేయించుకోవడం. కొంతకాలం బాగానే సాగింది. కానీ తర్వాత్తర్వాత అవతలివాడు బిల్లు చెల్లించడం మానేశాడు. బిల్లులు తిరిగి వచ్చేసేవి. ఈ బ్యాంకు మేనేజరు వాటిని మళ్లీ డిస్కౌంట్ చేసేవాడు. ఈ వ్యవహారం బయటకు వచ్చింది. సిబిఐ రంగంలోకి దిగింది. కేసు నడిచింది. బ్యాంకు మేనేజరుకి శిక్ష పడింది. దీనిలో బ్యాంకు మేనేజరు యింటికి డబ్బు చేరినట్లు సిబిఐ నిరూపించలేదు. త్రిచూరులో అవతలి వ్యక్తి వాళ్ల బావమరిదికి స్నేహితుడని బయట అనుకున్నారు కానీ, సిబిఐ ఆ దిశగా విచారణ చేయలేదు. బ్యాంకులో ఉన్న డిపాజిటర్ల డబ్బుకు కస్టోడియన్‌గా ఉండవలసిన వ్యక్తి తన బాధ్యతను విస్మరించనందుకు కేసు నడిపారు. ప్రజా ప్రతినిథులపై కూడా యిలాటి సెక్షన్లే ఉపయోగిస్తారు.

*దీనిలో బిల్లు డిస్కౌంట్ చేయించుకున్న కస్టమరు డొల్ల మనిషి కాదు. ఈ ట్రాన్సాక్షన్లు మాత్రమే డొల్లవి. బ్యాంకింగ్ కార్యకలాపాల్లో భాగంగానే డిస్కౌంట్ చేశానన్న మేనేజరు మాట కోర్టు ఒప్పుకోలేదు. సహజంగా ఉపయోగించ వలసిన విచక్షణను ఎందుకు ఉపయోగించలేదని అడిగారు. ఇలాటి కేసుల్లో డబ్బు అంతిమ లబ్ధిదారుకి చేరినట్లు చూపడం, ప్రత్యక్ష సాక్ష్యాలు దొరకడం కష్టం కాబట్టి, సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్సు ఉందా చూస్తారు. అసాధారణ రీతిలో ప్రవర్తిస్తే అనుమానిస్తారు. డిజైన్‌టెక్ విషయానికి వస్తే అది తనకు డబ్బు వస్తూనే 241 కోట్లను స్కిల్లార్‌కు పంపించింది. అక్కణ్నుంచి అనేక కంపెనీలకు డబ్బు వెళ్లింది. వాటిల్లో కొన్ని పని చేయకుండానే చేసినట్లు దొంగ యిన్‌వాయిస్‌లు సృష్టించి డబ్బులు తీసుకున్నాయని జిఎస్టీ ఇంటెలిజెన్సు కనుగొంది.

*గతంలో అయితే ఎల్‌ఆర్ దొంగదో, సరైనదో కనుక్కోవడం కష్టంగా ఉండేది. ఈ రోజుల్లో ప్రతీదీ రికార్డవుతోంది. అమెజాన్ నుంచి అప్పడాల కర్ర తెప్పించుకున్నా పార్శిల్‌ను ట్రాక్ చేసి ఏ క్షణాన ఎక్కడుందో చెప్తోంది. సాఫ్ట్‌వేర్ తెప్పించినా దాని టూల్ కిట్ కొరియర్‌లో వస్తుంది కదా! ఈ కేసులో అలా రాలేదన్నమాట. అందుకే జిఎస్‌టి ఇంటెలిజెన్సు రిపోర్టు చేసింది. ఇది కేవలం పన్ను తక్కువ కట్టడం సమస్య అనుకోవడం సరి కాదని గ్రహించాలి. ఎప్పుడైతే బోగస్ ఇన్‌వాయిస్ అన్నారో ఇడి ఎంటరైంది. ఇది ఆంధ్రకు సంబంధించిన ట్రాన్సాక్షన్సే అని ఎలా చెప్పగలరు, వేరే కార్యకలాపాలవి కావచ్చు కదాని ఒక పాఠకుడు అడిగారు. బిల్లులో డెలివరీ అడ్రసు ఆంధ్ర సెంటర్లవై ఉంటాయి. అందుకనే జిఎస్‌టి ఆంధ్ర ప్రభుత్వాన్ని ఎలర్ట్ చేసింది. లేకపోతే మరొకళ్లని చేసి ఉండేది. వైసిపి ప్రభుత్వం వచ్చాక ‘మీకిచ్చిన నిధుల వినియోగం గురించి చెప్పండి అని అడిగితే డిజైన్‌టెక్ 19.02.22న జవాబిచ్చింది. అవన్నీ మొద్దంకెలే’ అని బుగ్గన అసెంబ్లీలో అన్నారు. విచారణ సమయంలో డిజైన్‌టెక్ వాటిని ఎలా సమర్థించుకుంటుందో చూడాలి.

*ఇవన్నీ చూస్తే స్కాము తథ్యం అనుకోవచ్చు. ఎవరు చేశారు అనేది కోర్టే తేల్చాలి. ప్రస్తుతానికి చూస్తే అన్నిటా తానై, అనేక శాఖల్లో ఆ ఫైలును కదిలేట్లా చూస్తూ నిధులు విడుదలయ్యేట్లా చూసిన గంటా సుబ్బారావు గారు కనబడుతున్నారు. స్కిల్ కార్పోరేషన్ 2014 అక్టోబరులో ఏర్పడితే 2015 డిసెంబరు వరకు నిధుల విడుదల ప్రారంభం కాలేదు. ఈ 14 నెలల కాలంలో ఎందరో అధికారులు ఈ వ్యవహారాన్ని చూశారు. కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. నిధులు విడుదలయ్యాక రేటిఫికేషన్ తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ రాసినా తీసుకోలేదు. నిధుల విడుదల తర్వాత కూడా 19 నెలల దాకా సెంటర్లు ప్రారంభం కాకపోతే పర్యవేక్షించిన వారు ఏం చేశారన్న ప్రశ్న వస్తుంది. ప్రభుత్వానిది అసమర్థతే అనాలి. అది బాబు హయాంలో జరిగిందని ఒప్పుకోవాలి. ప్రజాధనం వ్యర్థం కాకుండా కాపాడలేక పోయారు అనాలి.

*బ్యాంకులో ఫ్రాడ్ జరిగితే సదరు ఆఫీసర్ని శిక్షించాలి తప్ప చైర్మన్‌ను శిక్షిస్తారా? అని లోకేశ్ మంచి పాయింటు లాగారు. అది వేరెవరి పాలనలోనైనా అన్వయించ వచ్చు కానీ బాబు పాలనలో మాత్రం కాదంటారు. ఎందుకంటే పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ ఆయన తప్ప వేరెవరూ డెసిషన్ మేకింగ్ చేయలేరు. పార్టీ సంగతి కళ్ల ఎదురుగా కనబడుతోంది. ఆయన జైల్లో కూర్చోగానే పార్టీ అస్తవ్యస్తంగా తయారైంది. ఎవరికీ బాధ్యతలు డెలిగేట్ చేయలేదు. అందుకే కాస్సేపు బాలకృష్ణ, కాస్సేపు లోకేశ్, కాస్సేపు బ్రాహ్మణి లీడ్ తీసుకుంటున్నారు. దిశానిర్దేశం చేసేవారు కరువయ్యారు.

*ప్రభుత్వాధినేతగా కూడా బాబు తరహా అంతే. ఏ మంత్రికీ వాయిస్ లేదు. అన్నీ ఆయనే చూసుకుంటారు. మోహన్ కందా గారు బాబు, వైయస్ యిద్దరి వద్దా చీఫ్ సెక్రటరీగా పని చేశారు. ఇద్దరికీ తేడా ఏమిటని అడిగితే ఒక వ్యాసంలో రాశారు. ఇద్దరూ వర్క్‌హాలిక్‌లే. బాబు తనకు ప్రతీదీ తెలియాలంటారు. ఏదైనా చెప్పకపోతే నాకెందుకు చెప్పలేదు? అని అడుగుతారు. అదే వైయస్ అయితే ‘ఇది నాకెందుకు చెప్తున్నారు? మీరు చూసుకోవాల్సిన వ్యవహారం కదా!’ అంటారు’ అని. బాబు వద్ద చీఫ్ సెక్రటరీగా చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు కూడా యిటీవల ఒక వీడియోలో బాబు ఓపిగ్గా గంటల తరబడి కూర్చుని అన్ని విషయాలూ తరచితరచి అడుగుతారు అని చెప్పారు. అందువలన బాబుకి తెలియకుండా అధికారులే పెత్తనం చేసేశారంటే నమ్మడం కాస్త కష్టం.

*బాబు దీనిలో యిన్వాల్వ్ అయ్యారా అనే సందేహాలు ఎందుకు వస్తున్నాయంటే, 13 చోట్ల సంతకాలు పెట్టారు కాబట్టి అనడం అర్థం లేని మాట. ఉదాహరణకి కార్పోరేషన్ ఏర్పాటు చేయండి అని సంతకం పెడితే అదేమైనా నేరమా? ఘోరమా? ఒక ఫైలు మీద ‘డిస్పెన్స్ విత్ ఫైనాన్షియల్ ప్రోటోకాల్’ అని బాబు రిమార్కు రాశారని పేర్ని నాని అసెంబ్లీలో అన్నారు. అది ఎంచ దగినదే. కానీ ‘అనేక సందర్భాల్లో అలా రాస్తారు, దీనిలో కథ అడ్డం తిరిగింది కాబట్టే దీనికి ప్రాముఖ్యత వచ్చింది’ అని వాదించవచ్చేమో, నాకు తెలియదు. సీమెన్స్ వాటా గురించి ఆగకుండా నిధులు విడుదల చేయమని ముఖ్యమంత్రి తనతో అన్నారని చీఫ్ సెక్రటరీ రాయడమూ ముఖ్యమైనదే. ‘నిధులు విడుదల చేసినప్పుడు మంచి ఉద్దేశ్యంతోనే చేశారు, డిజైన్‌టెక్ మంచి కంపెనీ అనే భావంతోనే ఉన్నారు, అందుకే యిచ్చారు, మేలఫైడీ (దురుద్దేశం) ఏమీ లేదు’ అని బాబు లాయర్లు వాదించవచ్చు.

నిధులు అందిన తర్వాత కదా డిజైన్‌టెక్ దుర్మార్గంగా వ్యవహరించినది, అది మేమెలా ఊహించగలం? అని డిఫెన్సు తీసుకోవచ్చు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాటి వాళ్లు తర్వాతి రోజుల్లో బ్యాంకును మోసం చేస్తారని మొదట్లో లోను యిచ్చినవారు అనుకోలేరు కదా! అందువలన వాళ్ల ఖాతాలను ఓపెన్ చేసిన బ్యాంకు అధికారులను శిక్షించరు. ఇక్కడ బాబు సమాధానం చెప్పవలసిన పాయింటు ఒకటుంది. సెబి ద్వారా ఉప్పందుకున్న జిఎస్‌టి ఇంటెలిజెన్స్ విభాగం 2018 ఫిబ్రవరిలో, పుణెలోని విజిల్ బ్లోయర్ 2018 జూన్‌లో ఆంధ్ర ప్రభుత్వాన్ని ఎలర్ట్ చేసినా ఆయన అరెరే, తప్పు జరిగిందా, బాధ్యులెవరో తేల్చండి అంటూ చర్య ఎందుకు తీసుకోలేదు? ఎసిబి (అవినీతి నిరోధక శాఖ) విచారణ ప్రారంభించి, అతి త్వరలోనే ఆపేసింది ఎందుకు? ఆ శాఖ రిపోర్టు చేసేది ముఖ్యమంత్రికే. అది ఆపేయడానికి కారణం ఎవరు?

*దీనికి సమాధానం బాబు ప్రజలకు, తన అభిమానులకు చెప్పాలి. తమ తీరుతెన్నులపై వ్యతిరేక వార్తలు వచ్చినపుడు కంపెనీలు నిజానిజాలివి అంటూ యాడ్స్ యిస్తూంటాయి. అలాగే బాబు కూడా తన వెర్షన్ ప్రజలకు చెప్పాలి. ‘ఫైళ్లు చూశాను, పాలసీ డెసిషన్ తీసుకున్నపుడు యిలా జరుగుతుందని నేను ఊహించలేదు. కానీ దురదృష్టవశాత్తూ నా హయాంలో తప్పు జరిగింది. సంబంధిత అధికారులదే బాధ్యత, నాది కాదు.’ అని డిక్లేర్ చేస్తే బయట పడవచ్చు. ఆయన అలా చేయటం లేదు. ‘నాపై కేసు పెడతారా? నేను రెండు రాష్ట్రాలనూ ఎంత అభివృద్ధి చేశాను’ అనే లైను తీసుకుంటున్నారు. కోర్టులోనూ అదే చెప్తున్నారు. ఇక్కడ మేటరు అభివృద్ధి గురించి కాదు, స్కాము గురించి. ‘తప్పుంటే అధికారులది బాధ్యత’ అని క్వాలిఫై చేసినా సరిపోదు. ఆయనకున్న అపారమైన పాలనానుభవంతో పేపర్లన్నీ చూసి ‘ఔను, తప్పు జరిగింది. కానీ నాకు తెలియకుండా జరిగింది.’ అంటే దివ్యంగా ఉంటుంది. అప్పుడు అధికారుల మీదనే ఫోకస్ పడుతుంది.

డొల్ల కంపెనీల ద్వారా బాబుకి డబ్బు తిరిగి వచ్చి చేరిందని నిరూపించడం సిఐడి వలన అవుతుందని నేను అనుకోవటం లేదు. డబ్బు ట్రయల్ పెండ్యాల శ్రీనివాస్ వద్దకు వచ్చి ఆగిపోయిందట. ఆయన యిప్పుడు గాయబ్. అమెరికాలో ఉన్నాడట. ఆయన క్షేమంగా ఉండాలి, వీళ్లకు దొరకాలి, దొరికినా నోరు విప్పాలి, విప్పినా అతను అబద్ధాలు చెప్తున్నాడని బాబు లాయర్లు వాదిస్తే ఔననడానికీ, కాదనడానికీ సాక్ష్యాలేముంటాయి? అందువలన బాబుపై అవినీతి కేసు నిలుస్తుందని నేను అనుకోను. కస్టోడియన్‌గా విఫలమయ్యారని నిరూపిస్తే, కోర్టు మందలించి వదిలేయవచ్చు. ఈ క్రమంలో కొందరు అధికారులకైనా శిక్షలు పడితే యికపై ప్రజాధనాన్ని కాపాడవలసిన బాధ్యతను పాలకులు, అధికారులు మరింతగా గుర్తిస్తారని ఆశించవచ్చు. ఇంతటితో యీ సీరీస్ సమాప్తం. తప్పులుంటే ఎత్తి చూపగోర్తాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?