Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: ‘శుభలగ్నం’కు మూలకథ

ఎమ్బీయస్: ‘శుభలగ్నం’కు మూలకథ

తెలుగు సినిమాకై విదేశీ చిత్రాల కథలను తీసుకున్నపుడు మన వాతావరణానికి అనువుగా మార్చుకుంటే ఎంత బాగుంటుందో చెప్పడానికి ఓ మంచి వుదాహరణ ''శుభలగ్నం'' (1994)! డబ్బుకోసం ఓ మధ్యతరగతి యిల్లాలు తన భర్తను అమ్ముకోవడం అనే థీమ్‌ ఊహించడానికీ, వినడానికి ఎంత ఎబ్బెట్టుగా వున్నా చిత్రీకరణలో ఆ ఎబ్బెట్టుతనమేమీ కనబడకుండా యిలా కూడా జరగవచ్చు అనే విధంగా తీసిన సినిమా అది. దానికి మూలం మనకు ''ఇన్‌డీసెంట్‌ ప్రపోజల్‌'' అనే 1993 నాటి ఇంగ్లీషు సినిమాలో కనబడుతుంది.

మొదట ఇంగ్లీషు సినిమాను కాస్త పరికిద్దాం. తర్వాత దాన్ని తెలుగులో ఎలా మలచుకున్నారో చూద్దాం. ఇంగ్లీషు సినిమాలో ఇన్‌డీసెంట్‌ ప్రపోజల్‌ చేసేది, అంగీకరించేది మగవాళ్లు. మధ్యలో నలిగేది ఆడది. రాబర్ట్‌ రెడ్‌ఫోర్డ్‌, ఉడీ హేరెల్‌సన్‌ కథానాయకులుగా వేస్తే డెమీ మూర్‌ కథానాయికగా వేసింది. తెలుగులో అలాటి ప్రపోజల్‌ చేసేది రోజా. ఒప్పుకునేది ఆమని. మధ్యన నలిగే కథానాయకుడు జగపతిబాబు! ఇంగ్లీషు సినిమా డైరక్షన్‌ చేసినది ఎడ్రైన్‌ లైన్‌ కాగా తెలుగులో ఎస్వీ కృష్ణారెడ్డి. తెలుగు సినిమాకు మూలకథ భూపతి రాజా అని చూపించారు.

ఇంగ్లీషు సినిమాలో హీరో, హీరోయిన్‌ బాల్యస్నేహితులు. కలిసి పెరిగారు. పెళ్లాడారు. ఒకళ్లంటే మరొకరికి చచ్చేటంత యిష్టం. అతను ఆర్కిటెక్ట్‌. ఆమె రియల్‌ ఎస్టేటు ఏజంట్‌. ఇద్దరూ కలిసి బొటాబొటీ సంపాదనతో, హానీహానీగా గడిపేస్తున్నారు. కానీ హీరోకి ఓ పెద్ద బంగళా కట్టించాలన్న ఆశతో నిద్రపట్టటం లేదు. ఇలా వుండగా ఆర్థికమాంద్యం వచ్చిపడింది. అతని వుద్యోగం పోయింది. వాళ్ల అప్పులు ఏభైవేల డాలర్లకు చేరుకున్నాయి. చేతిలో చూస్తే ఐదువేలున్నాయి. ఇలా అయితే లాభం లేదని వాళ్ల లాయరు చెప్పాడు. అప్పుడు వాళ్లకు ఓ బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. చేతిలో ఉన్నది ఎలాగూ చాలదు. అది పెట్టి జూదం ఆడితే వస్తే బోల్డంత వస్తుంది, పోతే కొంచెమే పోతుంది అని.

మొగుడు గేంబ్లింగ్‌ టేబుల్‌ వద్ద అవస్థ పడుతూంటే హీరోయిన్‌ విండో షాపింగ్‌ చేయబోయింది. ఓ గౌను పట్ల ఆమె మోజుపడడం ఓ కోటీశ్వరుడి కంట పడింది. ఆ కోటీశ్వరుడు జాన్‌. ఒంటరివాడు. ఈమెను చూసి తొలిచూపులోనే ముచ్చటపడ్డాడు. వచ్చి పలకరించాడు. ఈమె తప్పించుకుని వచ్చేసి భర్త పక్కన కూర్చుంది. భర్త ఆమెను పక్కన బెట్టుకుని, ఆమె చేత డైస్‌ను ఆమె చేత కిస్‌ చేయించి మరీ వేశాడు. నెగ్గాడు. రోజు తిరిగేసరికి పాతికవేల డాలర్లు వచ్చిపడ్డాయి. సంతోషంతో వుక్కిరిబిక్కిరయి పోయారు. తక్కిన పాతికా కూడా సంపాదించేద్దామని మర్నాడు జూదగృహంలో హాజరయ్యారు. కానీ ఆ రోజు డబ్బు పోసాగింది. పోయినది రాబట్టాలని యింకా పందెం ఒడ్డి మొత్తం పోగొట్టుకున్నారు. ఇద్దరూ ఏడుపుమొహాలు పెట్టారు. హీరో హీరోయిన్లు యిటువంటి దౌర్భాగ్యస్థితిలో వుండగా వాళ్లకో ప్రపోజల్‌ వస్తుంది. అదే యీ కథను మలుపు తిప్పుతుంది.

తెలుగు సినిమాలో యిప్పటిదాకా జరిగిన కథను ఎలా చిత్రీకరించారో చెప్తాను. తెలుగు హీరో ఆర్కిటెక్ట్‌ కాదు కానీ ఇంజనియర్‌. లంచాలు పట్టని నిజాయితీపరుడైన వాడు. ఏడేళ్లగా మూడువేల జీతమే వున్నా అదే పదివేలనుకుంటాడు. పెళ్లయి, యిద్దరు పిల్లలు పుట్టుకొచ్చి అద్దె కట్టడానికి కూడా కటకటలాడుతున్నా నీతి తప్పనివాడు. అతని భార్యది పూర్తిగా వ్యతిరేక స్వభావం. లంచాలు పట్టయినా సరే, డబ్బు గడించి, సుఖపడాలని ఆమె ఫిలాసఫీ. ఇంగ్లీషు సినిమాలో హీరోకి బంగళా కట్టాలని ఆశ వుంటే తెలుగులో హీరోయిన్‌కు వుంది. మొగుడికి పెద్ద సంపాదన లేదనీ ఈసడిస్తూ వుంటుంది. అతనికి వచ్చేవన్నీ దరిద్రగొట్టు ఆలోచనలనీ ఎప్పుడూ రుసరుసలాడుతూ వుంటుంది. ఆమె ఆలోచనలన్నీ డబ్బు చుట్టూనే తిరుగుతాయి. గొప్పదానిగా నటించాలనే తాపత్రయంలో బోల్తా పడుతూ వుంటుంది.

ఈ దశలో రోజా వాళ్ల జీవితాల్లో ప్రవేశిస్తుంది. ఆమె హీరో యజమాని కూతురు. లండన్‌లో చదువుకుని వచ్చింది. హీరో వ్యక్తిత్వం, నిజాయితీ చూసి ముచ్చటపడింది. ప్రేమించింది. అతనికి పెళ్లయిందని ఆమెకు తెలియదు. అతనికి చిన్న టేప్‌ రికార్డర్‌ అంటే యిష్టమని తెలిసి కొనడానికి షాపుకెళితే ఒకటి కనబడింది కానీ ఆమని అప్పటికే దాన్ని కొనేసింది. భర్త పుట్టినరోజునాడు బహుమతిగా యివ్వాలని అతను పైసాపైసా కూడబెట్టి దాచుకున్న డబ్బుతో కొంది. రోజా 'కావాలంటే పదివేలు యిస్తా, పెద్ద టేప్‌ రికార్డరు కొనుక్కోండి, దీన్ని మాత్రం నన్ను కొనుక్కోనివ్వండి' అని ఆఫర్‌ చేస్తే ఆమని ఎగిరి గంతేసి ఒప్పుకుంది. అసలు విషయం తెలిసేటప్పటికి మండిపడింది. భర్తకు బహుమతిగా వచ్చిన చిన్న టేప్‌రికార్డరును విసిరిపారేసింది.

ఇంగ్లీషు సినిమాలో హీరోహీరోయిన్లకు జూదగృహంలో జాన్ తారసిల్లాడు. అతనికి హీరోయిన్ వివాహితురాలా కాదా అన్న పట్టింపు లేదు. షాపులో ఈమెను చూసినప్పుడు తొలిచూపులోనే నచ్చేసింది. అందుకే 'జూదంలో నేను ఓడిపోతున్నాను. కాస్సేపు మీ ఆవిణ్ని నా పక్కన నుంచోనిస్తావా? నాకు లక్‌ తిరుగుతుంది' అని డైరక్టుగా హీరోని అడిగేశాడు. ఈలోగా అతను కోటీశ్వరుడని హీరోకి తెలిసింది. సరేనన్నాడు. హీరోయిన్ పక్కన కూర్చుని, కిస్ చేసి యిచ్చిన డైస్‌ను వేస్తే జాన్‌కు కలిసి వచ్చింది. ఆనందంతో తనను తాను పరిచయం చేసుకుని తన అతిథిగా స్టార్‌ హోటల్లో గడపమన్నాడు. అంతేకాదు, హీరోయిన్ ముచ్చటపడినా కొనలేకపోయిన 5 వేల డాలర్ల గౌనుని బహుమతిగా పంపాడు. డబ్బు యిచ్చే సౌఖ్యాలు ఎలా వుంటాయో వాళ్లకు మప్పాక ఓ రోజు డిన్నర్‌ వద్ద ఓ వింత ప్రతిపాదన చేశాడు. నీ భార్యను నాతో ఓ రాత్రి గడపనిస్తే పదిలక్షల డాలర్లు యిస్తానని ప్రతిపాదన చేశాడు. ఒళ్లు గగుర్పాటు కలిగించే యిలాటి ప్రపోజల్‌ను తెలుగులోకి తీసుకురావడం ఎలా? స్వేచ్ఛాయుతమైన విదేశీ వాతావరణంలోనే విన్న ప్రజలు తెల్లబోయే అసభ్యకరమైన ప్రతిపాదన, ఇన్‌డీసెంట్‌ ప్రపోజల్‌ అది.

ఆమె వేశ్య కాదు. ఓ మధ్యతరగతి భద్రమహిళ. సరాసరి భర్త వద్దకు వెళ్లి ‘ఓ రాత్రి నీ భార్యతో పడుక్కోనివ్వమ’ని అడగడమా? దానికి హీరోగారు అతన్ని చెప్పుపుచ్చుకుని కొట్టలేదు సరికదా ఆలోచనలో పడ్డాడు. రాత్రంతా నిద్రపట్టక దొర్లాడు. ఒక్కరాత్రి కళ్లు మూసుకుంటే, ఆ మిలియన్‌ డాలర్లు చేజిక్కితే హాయిగా తన కలలు కంటున్న సౌధం కొనేయవచ్చు కదాని. కానీ భార్యకు అలాటి ఆలోచనే లేదు. ప్రతిపాదన చేసినప్పుడు తెల్లబోయి చూసింది. దాన్ని మర్చిపోయి హాయిగా నిదరోయింది. కానీ భర్త విడిచిపెట్టలేదు. ఆమెకూ నచ్చచెప్పి ఒప్పించాడు. పోనీ భర్త సొంతింటి చిరకాల వాంఛ తీరుతుంది కదాని ఆమె సరేనంది. భర్త తన లాయరును పిలిచి జాన్‌తో అగ్రిమెంటు రాయించాడు. భార్యను అప్పగించి యివతలికి వచ్చిందాకా వుండి, తను చేస్తున్నది వెధవపని అని తోచింది. గబగబా పరిగెట్టుకుని వెళ్లి అగ్రిమెంట్‌ కాన్సిల్‌ అని చెప్పబోయాడు. అప్పటికే టూ లేట్‌. వాళ్ల హెలికాప్టర్‌ ఎగిరిపోయింది. ఓ ప్రైవేట్‌ క్రూసీలో వాళ్లు విహరిస్తున్నారు. ఇక అక్కణ్నుంచి భర్త మానసిక వేదన ప్రారంభమైంది.

ఇక తెలుగులో యిక్కడిదాకా కథ ఎలా నడిపారంటే హీరోకి బహుమతి యిచ్చిన చిన్న టేప్ రికార్డరులో ‘ఐ లవ్యూ’ చెప్పిన తర్వాత రోజాకు తెలుస్తుంది, హీరో వివాహితుడని, యిద్దరు పిల్లల తండ్రి అని. అయినా తన మనసు మార్చుకోదు. సరికదా, ధైర్యంగా సరాసరి ఆమని వద్దకు వెళ్లి తన ప్రతిపాదన ముందు పెట్టింది. ఓ రాత్రి వ్యవహారం అనలేదు. విడాకులు యిచ్చి, తనను పెళ్లి చేసుకోవాలంది. ఇద్దరూ ఒకే యింట్లో వుంటూ భర్తను పంచుకోవచ్చంది. కోటి రూపాయలు తీసుకుని భర్తను అమ్మేయదలచుకుందా మనుకుంటున్నానని ఆమని యింట్లో అందరితో చెప్పింది. తండ్రి సమర్థించాడు. తల్లి తిట్టింది. కోటి రూపాయలు వస్తున్నపుడు సవతి వుంటే తప్పేముందని యీమె వాదించింది. ఏడ్చి మొత్తుకుని, అన్నం మానేసి భర్తను ఒప్పించింది. లంచం పట్టి సంపాదించడం రానపుడు కనీసం దీనికైనా ఒప్పుకో అని నిందించింది. నువ్వు నష్టపోతున్నావు అని హెచ్చరిస్తే యిప్పుడు బావుకుంటున్నదేముంది? అని యీసడించింది. తప్పని పరిస్థితుల్లో భార్య పోరు భరించలేక హీరో సరేనన్నాడు. ఆమనికి విడాకులిచ్చి రోజాను చేసుకున్నాడు.

ఒరిజనల్‌ సినిమాలో భర్తలా ఆమని పునరాలోచించలేదు. కోటి రూపాయల క్యాష్‌ పుచ్చుకుని సంతోషించింది. భర్తను బలవంతం చేసి సవతి గదిలోకి పంపింది. కానీ భర్తలో మార్పు లేదు. శోభనం గదిలో రోజాతో  ‘గుర్రాన్ని కొనగలవు కానీ నీళ్లు తాగించలేవు' అన్నాడు. కానీ త్వరలోనే హీరోలో మార్పు వచ్చింది. ఇటు ఆమని డబ్బు రుచి మరిగి అహంభావంతో భర్తను, పిల్లలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అటు రోజా అచ్చమైన మధ్యతరగతి మహిళలా భర్తను, పిల్లలను ఆదరించి మచ్చిక చేసుకుంది. భర్త కోసం రోజా డైనింగు టేబులు వద్ద వెయిట్ చేస్తే, ఆమని బయట తిని వచ్చానని చెప్పసాగింది.

ఇటు ఒరిజినల్‌లో ఏం జరిగిందో చూద్దాం. భార్యను పరాయివాడికి అప్పగించి విచారంలో మునిగిపోయిన హీరో వద్దకు హీరోయిన్‌ మర్నాడు తిరిగి వచ్చింది. ఆ రాత్రి అనుభవం ఆమె పెదాలనుండి తుడిచేశాడు కానీ తన మనసులోంచి తుడిచివేయలేకపోయాడు. భార్య పర్సులో జాన్‌ విజిటింగ్‌ కార్డు చూడడంతో ఆమె ఇంకా ఆ కోటీశ్వరుడితో వ్యవహారం సాగిస్తోందన్న అనుమానం అతనిలో కలిగి పెరిగి పెద్దదైంది. నిన్ను నమ్మనని అనసాగాడు. అతని ఫ్రస్టేషన్‌ కు ఓ కారణం కూడా వుంది. ఏ యిల్లు కొనడానికి మిలియన్‌ డాలర్లకోసం తన భార్యను అప్పగించాడో ఆ యిల్లు ఎవరో అంతకుముందే కొనేశారు. ఎవరు కొన్నారా అని విచారిస్తే కోటీశ్వరుడే అది కొనేసాడని హీరోయిన్‌కి తెలిసింది. హీరోయిన్ వెళ్లి ఎందుకిలా చేశావని అతనిపై విరుచుకుపడింది. నా వద్దకు శాశ్వతంగా వచ్చేయ్‌ అని ఆహ్వానించాడతను. నువ్వంటే నా కసహ్యం అంది ఆమె. వాళ్లనుకున్న డ్రీమ్‌ హౌస్‌ చేతి కందకుండా చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోతారని, హీరోయిన్‌ తన వైపు వస్తుందని కోటీశ్వరుడు అంచనా వేశాడు. అదే జరిగింది.

నీ కోసమే ఆ కోటీశ్వరుడి వద్ద పడుక్కున్నానంటుంది హీరోయిన్‌. నువ్వే కావాలని వెళ్లావని హీరో నింద మోపాడు. పరస్పర అంగీకారంతో విడిపోవడానికి అప్లయి చేసుకున్నారు. మనోవర్తి అక్కరలేదంది హీరోయిన్‌. తన కాళ్లపై తను నిలబడడానికి హీరోయిన్‌ రియల్‌ ఎస్టేటు ఏజంటుగా మళ్లీ చేరింది. అక్కడకు కోటీశ్వరుడు జాన్‌ కస్టమర్‌గా ప్రత్యక్షమయ్యాడు. తనకు యిళ్లు చూపించు అంటూ తన కారులో ఆమెను తిప్పసాగాడు. అతన్ని వదుల్చుకోవాలని ఓ స్కూల్లో వయోజనులకు టీచర్‌గా చేరితే అక్కడా ప్రత్యక్షమయ్యాడు. ఒక యంగ్‌ లవర్‌లా తన వెంటపడుతున్న అతన్ని చూసి ఆమె ముచ్చటపడింది. అతని ప్రేమను అంగీకరించింది. ఇద్దరూ కలిసి డాన్సులు, పార్టీలకు వెళుతున్నారు. ఇవతల హీరో పరిస్థితి నానాటికి దిగజారింది. తనెంత హీనంగా ప్రవర్తించాడో తెలుసుకుని తనను తాను నిందించుకోసాగాడు. హీరోయిన్‌పై కోపం తెచ్చుకోవడం, తాగడం, ఏడవడం. ఓ సారి జాన్‌తో ఉన్నపుడు వాళ్ల వద్దకు వెళ్లి తాగి అల్లరి చేశాడు కూడా.

ఒరిజినల్‌లో కోటీశ్వరుడు హీరోయిన్‌ను తన డబ్బుతో కాక, ఆరాధనతో ఎలా మెప్పించాడో, తెలుగులో రోజా హీరోని అలాగే మెప్పించింది. అతనికి నచ్చే సాదాసీదా జీవితం గడిపి అతనికి దగ్గరైంది. డబ్బే సర్వస్వమనుకున్న ఆమని దూరమైంది. డబ్బు మైకంలో ఆమెకు పెళ్లిరోజు కూడా గుర్తు రాలేదు. ఆమె తల్లి, పాత యింటాయన, పనిమనిషి  ఎందరు దెప్పి పొడిచినా తెలిసి రాలేదు. పిల్లలు కూడా తనకు దూరమై రోజాకు దగ్గర కావడంతో యిక సహించలేక పాత పద్ధతులు అవలంబించబోయింది. అక్కడ కూడా రోజాదే పై చేయి కావడంతో సహించలేక ఆమెను లెంపకాయ కొట్టింది. ఇప్పటిదాకా వున్న జాలి కూడా పోయిందన్నాడు భర్త. అప్పుడు ఆమెకు జ్ఞానోదయమైంది. డబ్బు తిరిగిచ్చేస్తా నా భర్తను నాకిచ్చేయ్ అని రోజాను అడిగింది. ‘మొగుణ్నే అమ్ముకున్నదానికి ప్రేమేమిటి?’ అని రోజా తండ్రి అన్నాడు.

ఇంగ్లీషు ఒరిజినల్‌లో కూడా హీరోకి బుద్ధి వచ్చింది. అతని డిజైన్లు తిరస్కరించబడ్డాయి. టీచరుగా పనిచేస్తూ తనూ కొన్ని పాఠాలు నేర్చుకున్నాడు. లాయరు తెచ్చిన డైవోర్సు పేపర్లు జేబులో పట్టుకుని హీరోయిన్‌కు కానుకగా యివ్వడానికి వెళ్లాడు. అతను వెళ్లేసరికి అతని భార్య కోటీశ్వరుడు ఓ పార్టీలో వున్నారు. విరాళాలకై వేస్తున్న వేలంలో పాల్గొంటున్నారు. హీరో భార్యను అమ్ముకోవడం ద్వారా వచ్చిన మిలియన్‌ డాలర్లను విరాళంగా యిచ్చేశాడు. భార్య వద్దకు వచ్చి ఆప్యాయంగా మాట్లాడాడు. ఆమె అతని కేసి చూసిన చూపు కోటీశ్వరుడికి జ్ఞానోదయం కలిగించింది. భార్యాభర్తలిద్దరూ చేరువ కావాలనే వుద్దేశంతో ఆమెను నొప్పించేట్లు మాట్లాడాడు కోటీశ్వరుడు. ఆమె అది గ్రహించి అతని మంచితనానికి ధన్యవాదాలు చెప్పి కారు దిగిపోయింది. అదేమిటి, ఆమెను అలా జారవిడుచుకున్నావ్‌ అన్నాడు అతని సహచరుడు. అలాటి చూపు నా కేసి ఎప్పుడూ చూడలేదు అన్నాడితను. హీరోయే ఆమెకు సరైనవాడన్నాడు. హీరోయిన్ ఒడిలో వచ్చి పడిన సంపదలను కాలదన్ని, బస్సెక్కి గతంలో వాళ్లు కూచునే చోటుకి వచ్చి భర్తను కలిసింది.

తెలుగులో ఆమని తన భర్తను తిరిగి తెచ్చుకోవాలని విశ్వప్రయత్నాలు చేసింది. కానీ అవన్నీ కుదరలేదు. లాయర్‌ను కలిస్తే విడాకులు తీసుకున్నావు కాబట్టి నువ్వు భార్యవు కావన్నాడు. ఇంటికెళ్లి ఆవేశంలో నన్ను మోసగించావంటూ రోజాను కొట్టింది. రోజా తండ్రి వచ్చి మనింటికి వెళ్లిపోదామన్నాడు. కూడా అల్లుణ్ని రమ్మన్నాడు. ఆమని పరాయిస్త్రీ కాబట్టి ఆమెతో సంబంధం పెట్టుకుంటే కుదరదన్నాడు. ఇదేమి అన్యాయం అని ఆమని వాపోతే ‘అనుభవించు’ అని భర్త వెళ్లిపోయాడు. ఇక్కడుంటే మమ్మల్నీ అమ్మేస్తావ్‌ అంటూ పిల్లలూ వెళ్లిపోయారు. ‘ఈ దేశంలో ఉంటే యీమె గోలచేసేట్టుంది, లండన్‌ వెళ్లిపోదాం’ అంది రోజా. భర్తను, పిల్లలను సుఖంగా వుంచాలనే తాపత్రయంలో తను కోల్పోయిందేమిటో తెలుసుకున్న ఆమని ఆస్తంతా అనాథాశ్రమానికి రాసేసింది. ఎయిర్‌పోర్టు కెళ్లి మీరైనా సుఖంగా వుండండి అని భర్తకు, పిల్లలకు చెప్పింది. ఇదంతా చూసి రోజా కరిగింది. మీరంతా మళ్లీ కలిసి ఉండండి. నేను ఒక్కదాన్నే లండన్ వెళుతున్నా అంటూ త్యాగం చేసింది.

ఇలా ముగుస్తుంది తెలుగు సినిమా. ఇంగ్లీషు ఒరిజినల్‌లో భర్త భార్యను అమ్ముకుంటాడు. తెలుగులో స్త్రీ ఎంగిలిపడడం చూపలేక కాబోలు, మొగుణ్ని అమ్ముకున్నట్టు చూపారు. నిజానికి భర్తను అమ్ముకోవడం, లేదా దానం యివ్వడం, తిరిగి తెచ్చుకోవడానికి అగచాట్లు పడడం సత్యభామ కాలం నుంచీ వున్నదే కదా. అందుకనే తెలుగువాళ్లకు యీ థీమ్‌ మింగుడు పడింది. సినిమా హిట్‌ అయింది.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2022)

[email protected]

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా