ఒకరు ఎస్‌ఐ, ఇంకొకరు బ్యూటీషియన్.. ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునేముందు కలుసుకున్నారట. ఆ 'కలయిక'పైనా అనేక అనుమానాలున్నాయి. ఓ కేసు విషయమై చర్చించడానికి వచ్చిన బ్యూటీషియన్‌పై ఎస్‌ఐ అత్యాచారానికి యత్నించాడన్నది విన్పిస్తోన్న ఆరోపణ. కాదు కాదు, అత్యాచారం జరిగిందన్నది మరో వాదన. అసలు అదేమీ లేదన్నది ఇంకో వాదన.! అసలేం జరిగింది.?
హైద్రాబాద్‌లో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసుకి సంబంధించి అనుమానాలు అలాగే వున్నాయి.. ఆ ఆత్మహత్య చుట్టూ 'కట్టు' కథలు కూడా అలాగే విన్పిస్తున్నాయి. కుటుంబ సభ్యులేమో శిరీషది హత్య అని ఆరోపిస్తున్నారు. పోలీసులేమో, అబ్బే అది ఆత్మహత్య మాత్రమేనని తెగేసి చెబుతున్నారు. పైగా, 'అక్రమసంబంధం' అంటూ పోలీసులు సర్టిఫై చేసేశారు కూడా.!
ఈ కేసులో ఇద్దరు నిందితులు పోలీసుల కస్టడీలో వున్నారు. ఒకరు శిరీషకి అత్యంత సన్నిహితుడు, బిజినెస్ పార్టనర్. ఇంకొకరు జస్ట్ స్నేహితుడు మాత్రమే. ఈ మొత్తం కథలో ఇంకొన్ని పాత్రలు కూడా వున్నాయి. శిరీషకి 'సవతి'గా ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతి, మరో ఇద్దరు వ్యక్తులు.
శిరీష బిజినెస్ పార్టనర్ రాజీవ్. రాజీవ్ స్నేహితురాలు తేజస్విని. తేజస్విని స్నేహితుడు శ్రావణ్. వీళ్ళందరికీ మళ్ళీ కామన్ ఫ్రెండ్స్ మరో ఇద్దరు. రాజీవ్‌ని తేజస్విని ఇష్టపడింది.. అతన్ని పెళ్ళాడదామనుకుంది. రాజీవ్ తల్లిదండ్రుల్ని కూడా అడిగిందట.
వాళ్ళు కాదనేశారు. ఈలోగా, శిరీషపై అనుమానం.. ఆమెతో గొడవలు.. తన గురించి ఇద్దరు మహిళలు కొట్టుకోవడం నచ్చని రాజీవ్, పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఈ కేసుని సెటిల్ చేయడానికి రంగంలోకి దిగిన శ్రావణ్.. అతనికి స్నేహితుడు ఓ ఎస్‌ఐ.. అతనే ప్రభాకర్ రెడ్డి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అటు ప్రభాకర్, ఇటు శిరీష ఆత్మహత్య చేసుకున్నారు.
అయ్యబాబోయ్.. బీభత్సమైన థ్రిల్లర్ సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు వుండవేమో.! ఐదడుగుల పదంగుళాల పొడవున్న ఓ మహిళ, సుమారు 80 కిలోల బరువుండే మహిళ సాధారణ ఫ్యాన్‌కి ఉరేసుకోవడమెలా సాధ్యమన్నది ఇక్కడ కీలకమైన విషయం. ఆత్మహత్యకు ముందు ఆమెని రాజీవ్, శ్రావణ్ చితక్కొట్టేశారు. కానీ, చంపలేదట. నమ్మేలా వుందా ఇదేమన్నా.?
ఆత్మహత్య చేసుకున్న ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డికి సంబంధించి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల వేధింపులకు అదే పోలీస్ స్టేషన్‌లో కొన్నాళ్ళ క్రితం ఓ ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని స్థానంలోకి వచ్చిన ప్రభాకర్‌రెడ్డి కూడా అదే రీతిలో ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ, శిరీషపై అత్యాచారానికి యత్నించి లేదా అత్యాచారానికి ఒడిగట్టి ఆ విషయం బయటపడుతుందనే ఆందోళనతోనే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులంటున్నారు.
రాజీవ్ అనే వ్యక్తితో చనువగా అతనివద్ద పనిచేసే మహిళ, అతని ప్రేమలో పడ్డ మరొక మహిళ.. రాజీవ్‌కి ఇంకో అమ్మాయితో పెళ్ళి చేసేందుకు అతని కుటుంబ సభ్యుల యత్నాలు.. ఒకదానితో ఒకటి ఏమాత్రం పొంతనలేని విషయాలివి. శిరీష ఆత్మహత్య అయినా, ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య అయినా పోలీసులు చెబుతున్న విషయాలేవీ నమ్మగలిగేలా లేవు.
కానీ, నమ్మాల్సిందే.! ఎందుకంటే, అక్కడ పోలీసులు 'డిక్లేర్' చేసేస్తున్నారు. ఇంతకీ నిజమేంటి.? అక్కడ జరిగిందేంటి.? చనిపోయిన ప్రభాకర్‌రెడ్డి, శిరీష బతికొస్తే తప్ప నిజాలు బయటకొచ్చే ఛాన్సే లేదు. అప్పటిదాకా ఇంకెన్ని కట్టుకథలు తెరపైకొస్తాయో ఏమో.!