నేడు పార్టీలన్నీ తమ చుట్టూ తాము తిరుగుతూ, ‘భూమి’ చుట్టూ తిరుగుతున్నాయి. పారిశ్రామిక వేత్తలకీ, బహుళ జాతి సంస్థల్నీ ఆకర్షించటానికి కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి భూమి కావాలి. రాజధాని కట్టుకోవటానికి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి భూమి కావాలి. తెలంగాణలో ‘వాస్తు’ దోషం సవరించుకోవటానికి టీఆర్ఎస్ పార్టీకి భూమి కావాలి. ఎలా చూసినా రాజకీయాలు ఇప్పుడు ‘భూ’ మార్గమే పట్టాయి.
ఎన్డీయే సర్కారు గానే భూసేకరణ చట్టం 2014 పై మార్పులు చేస్తూ ఆర్డినెన్సు చేసినా, దానివల్ల వచ్చిన ఇబ్బందుల్ని మాత్రం, మొత్తం ఎన్డీయే కాకుండా, బీజేపీ మాత్రమే ఎదుర్కొంటోంది. ‘నా దారి పక్కదారి’ అన్నట్టుగా, బీజేపీ పలు ఇతర నిర్ణయాలతో పాటు, ఈ నిర్ణయాన్ని కూడా ‘పక్కదారి’ లేదా ‘అడ్డదారి’లోనే అమలు జరిపింది. ఈ అడ్దదారే, ‘ఆర్డినెన్సు’దారి. దేశం మొత్తం తమేక పట్టం కట్టిందని విర్రవీగిన బీజేపీకి, ఏడాది తిరగకుండానే శృంగభంగం జరగుతుందని ఊహించి వుండదు.
ఏ ఢిల్లీ దేశానికి రాజధానిగా వుందో, ఆ ఢిల్లీలోనే బీజేపీ మూడు అంటే మూడు సీట్లతో పరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో ఈ అడ్డదారికి గండి పడింది. ఈ అర్డినెన్సును చట్టంగా మార్చుకోవాలీ అంటే ఉభయ సభల్లో పొందితీరాలి. లోక్ సభలో గండం గట్టెక్కినా, రాజ్యసభలో ఈ మార్పులకు గండి పడింది. అక్కడ ఎన్డీయే కు మెజారిటీ లేదు. చిత్రమేమిటంటే, ఈ భూసేకరణ చట్టంలో మార్పులు తేవటానికి ‘ససేమీ వీలు లేదు’ అంటూ ప్రతిపక్షాలన్నీ ఒక్కటిగా రావటమే కాదు, కడకు ఎన్డీయే భాగ స్వామ్య పక్షాలు (శివసేన, శిరోమణి అకాలీ దళ్, లోక్ జనశక్తి పార్టీలు) కూడా ప్రతిపక్షాలతో వంత పాడాయి.
భూసేకరణ చట్టానికి బీజేపీ ఆర్డినెన్సు ద్వారా చేసినవి పైపై సవరణలు కావని వీరందరి నిశ్చితాభిప్రాయం. ఈ సవరణలు చట్టం తాలూకు నవనాడులూ పీకేస్తున్నాయి. రైతుల ఇష్టానికి వ్యతిరేకంగా భూమిని లాక్కోవటనికి బాటలు వేస్తుంది. 2014 లో యూపీయే సర్కారు ఆమోదించిన చట్టంలో రైతుల సమ్మతికి అవకాశం ఇచ్చింది. ఎంతటి విస్తీర్ణంలో భూమిని సేకరించాలో, ఆ విస్తీర్ణ పరిధిలో వున్న రైతుల్లో కనీసం 80 శాతం మంది భూమిని ఇవ్వటానికి తమ సమ్మతిని తెలియజేయాలి. ఇప్పుడు ఎన్డీయే ఈ ‘క్లాజు’ ను ఎత్తివేసింది. అంతే కాదు కొన్ని మినహాయింపుల్ని కోరింది. ఇండస్ట్రియల్ కారిడార్లకు సైతం ఈ షరతును ఎత్తివేయాలంటూ సవరణ చేసింది. వీటికితోడుగా మరో నాలుగు ఇతర ప్రయోజనాలను జోడించింది.
సెజ్‌లకు కానీ, అభివృద్ధి పనులకు కానీ, భూసేకరణ చేసినప్పుడు, ఆ భూమిని అయిదేళ్ళ వరకూ ఆ ప్రయోజనానికి ఉపయోగించని పక్షంలో, ఆ భూమిని తిరిగి రైతుకు ఒప్పగించాల్సి వుంటుందన్న క్లాజుకు కు కూడా ఎన్డీయే నీళ్ళు వదలుతోంది. ఎలా చూసినా, రైతుల్ని కొట్టి, కార్పోరేట్ శక్తులకు పెట్టటానికి చట్టంలో ఏయే అడ్డంకులున్నాయో, వాటినన్నటినీ తొలగించుకోవటానికే ఈ సవరణలను ఎన్డీయే చేసింది. ఆశ్చర్యంగా రైతుకు అదనంగా సదుపాయాన్ని కలిగించే ఒక్క సవరణనూ ఎన్డీయే ప్రతిపాదించలేక పోయింది. అందుకే ఇంతటి వ్యతిరేకత వచ్చింది.
అయితే భూసేకరణ విషయంలో తలమునకలయి వున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తూళ్ళూరు ప్రాంతంలో భూమిని నిజంగానే ‘నాలుగు రెట్లు’ పెట్టి కొందామన్నా వీలుకాని పరిస్థితి ఈ ప్రభుత్వానికి వుంది. అందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ ఒక కొత్త పంథాను ఎంచుకున్నారు. ‘భూసేకరణ’ (లాండ్ ఎక్విజషన్) స్థానంలో, ‘భూసమీకరణ’ను (ల్యాండ్ పూలింగ్) ను తెచ్చారు. ఈ పధ్ధతితో ఇప్పటికే 22 వేల ఎకరాల భూమిని ‘సమీకరించినట్టు’గా చెబుతున్నారు. అయితే ఈ భూమిని రైతులనుంచి ‘బినామీ’ వ్యక్తుల ద్వారా సేకరిస్తున్నారనే ఆరోపణ వుండనే వుంది. అయితే నిజంగానే రైతులు ఎవరికి వారు ఒక ప్రాంతంలో భూమిని ‘ఐఛ్చికం’గా ఇచ్చినా కూడా, అది ‘భూసేకరణ చట్టం’ స్ఫూర్తికి విఘాతం కల్పిస్తుంది. ఎందుకంటే, భూముల పేరు మీద గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతాయి. రైతు పరిహారం తీసుకుని వెళ్ల వచ్చు కానీ, భూమిలేని రైతుకూలీ, కౌలు రైతు ఏం కావాలి? వారంతా నిరాశ్రయులవుతారు.
అయితే కేసీఆర్ ఇప్పటికయితే ప్రభుత్వ భూములనే ఆకాశ హర్మ్యాలకు వినియోగించుకునే ఉద్దేశ్యంతో వున్నారు కానీ, ఆయనకు తక్షణం ఈ సమస్య రాలేదు. కానీ ఇతర ప్రాజెక్టుల కొరకు ఆయన కూడా భూసేకరణ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా చేస్తారన్నది వేచి చూడాలి. ఒకటి మాత్రం నిజం దేశం మొత్తం మీద భూసేకరణ కారణంగా అధికం గా నష్టపోతున్నవారు ఆదివాసులను అడవికీ, మత్స్య కారులను సముద్రానికీ దూరం చేసి బతకమనే ‘భూసేకరణ’ ఏమాత్రం సమర్థనీయం కాదు.
సతీష్ చందర్